Meena: హీరో జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో మీనా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు, పర్సనల్ లైఫ్‌లో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన మీనా రెండో పెళ్లి రూమర్స్ పై ఎమోషనల్ అయ్యారు.
సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1986లో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా, అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అలాగే.. రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, కృష్ణ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.
25
‘జయమ్ము నిశ్చయమ్మురా’లో మీనా
తాజాగా మీనా, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మీనా తన కెరీర్, పర్సనల్ లైఫ్, ఫిల్మ్ అనుభవాలు, తన లైఫ్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీనా మాట్లాడుతూ “చాలామంది నిర్మాతలు ఫ్లాప్‌లలో ఉన్నామని, తక్కువ అమౌంట్‌తో సినిమా చేయమని నన్ను సంప్రదించేవారు. నేను సరేనని అంగీకరించేదాన్ని. ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యేవి. కానీ తర్వాత నన్ను మర్చిపోయేవారు. నా కెరీర్ అంతా ఇలాగే జరిగింది” అని తెలిపారు.
35
కెరీర్ పీక్‌లో పెళ్లి
మీనా తన కెరీర్‌లో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2009లో విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆమెకు కూతురు పుట్టింది. కూతురు రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మలయాళంలో దృశ్యం సినిమా కోసం మీనాను సంప్రదించారు. మొదట చిన్నారిని వదిలి వెళ్లలేక తిరస్కరించగా, చిత్రబృందం “ఈ పాత్రను మీకోసమే రాశాం, వేరొకరితో చేయలేం” అని రిక్వెస్ట్ చేయడంతో చివరికి అంగీకరించినట్లు ఆమె చెప్పారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి, మీనా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
అదే ఇంటర్వ్యూలో మీనా రెండో పెళ్లి రూమర్స్‌పై ఘాటుగా స్పందించారు. “ఎవరు విడాకులు తీసుకున్నా.. వారితో నా పేరు కలిపి పెళ్లి అని రాయడం చాలా బాధ కలిగిస్తుంది. భర్తను కోల్పోయిన వారం రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వదంతులు నాకు అసహ్యం వేసేవి. వాళ్లకు కుటుంబాలు ఉండవా.. ఇలా రాయడానికి?” అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. 2022లో అనారోగ్యంతో మీనా భార్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణించిన తరువాత నుంచి మీనా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి.
55
కెరీర్‌లో గుర్తుండిపోయే క్షణాలు
మీనా తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను స్టార్ హీరోలతో చేసిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. కృష్ణ, రజనీకాంత్ ఇద్దరికీ ఒకసారి కూతురుగా, మరోసారి హీరోయిన్‌గా నటించడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. అలాగే, నటుడు జగపతి బాబుతో నటించినప్పుడల్లా “మీ పక్కన నేను ఉంటే ఎవరూ నన్ను చూడరని.. అందరూ మిమ్మల్నే చూస్తారు” అని సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ప్రస్తుతం మీనా మూకుతి అమ్మన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి బలమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.