అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుందిగా. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్.
అప్పట్లోనే కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ యువతను కట్టి పడేశాయి. కానీ సాహసం శ్వాసగా సాగిపో మూవీ నిరాశపరచడంతో టాలీవుడ్ లో మంజిమకు ఆఫర్స్ రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో నారా భువనేశ్వరి పాత్రలో మెరిసింది. కొన్ని మలయాళీ, తమిళ చిత్రాల్లో నటించింది.
తాజాగా మంజిమ మోహన్ పెళ్లి పీటలు ఎక్కింది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ ని మంజిమ వివాహం చేసుకుంది. మణిరత్నం కడలి చిత్రంతో గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయం అయ్యాడు. మంజిమ, కార్తీక్ ఇద్దరూ కలసి దేవరట్టం అనే చిత్రంతో నటించారు.
ఈ చిత్రంతోనే వీరిద్దరి ప్రేమకి పునాది పడ్డట్లు అయింది. నెమ్మదిగా స్నేహం.. ఆ తర్వాత ప్రేమ పెళ్లి వైపు ఈ జంట అడుగులు వేశారు. ఇటీవలే మంజిమ తన ప్రియుడు అంటూ గౌతమ్ ని సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది.
90వ దశకంలో అభినందన, అన్వేషణ లాంటి చిత్రాలతో అలరించిన హీరో కార్తీక్ తనయుడే ఈ గౌతమ్ కార్తీక్. తండ్రి బాటలోనే గౌతమ్ కూడా హీరో అయ్యాడు. కడలి చిత్రంతో గౌతమ్ కార్తీక్ సైమా, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు. సోమవారం రోజు ఈ యువ జంట వివాహం చెన్నైలో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఓ హోటల్ లో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది. గౌతమ్, మంజిమ ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో వెలిగిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. గౌతమ్, మంజిమ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుపమ పరమేశ్వరన్, ప్రియా భవాని శంకర్, ప్రియమణి, రీతూ వర్మ లాంటి సెలెబ్రిటీలంతా మంజిమ, గౌతమ్ లకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.