
తెలుగు సినిమాల్లోనే కాదు, భారతీయ సినిమాల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా. `ఎస్‌ఎస్‌ఎంబీ29` వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. గ్లోబల్ ట్రోటర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇందులో మహేష్ ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, మహేష్ అడ్వెంచరర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
నేడు మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి అప్ డేట్ వస్తుందని భావించారు ఫ్యాన్స్. ఈగర్‌గా వెయిట్ చేశారు. కానీ ఎలాంటి పోస్టర్ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని, ఇప్పటి వరకు చూడని ఒక కొత్త సినిమాని చూపించబోతున్నామని, అందుకోసం శ్రమిస్తున్నామని తెలిపారు రాజమౌళి. నవంబర్‌లో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి.
ఇందులో మహేష్ బాబుతోపాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ సీన్ లీక్ అయ్యింది. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ తన సైన్యంతో మహేష్ ని బ్లాక్ చేశారు. ఆయన ముందు మహేష్ ని మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఆ సీన్ పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజమౌళి ఈ సారి గట్టిగానే వండబోతున్నారనిపించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు జక్కన్న. అదే స్థాయిలో మార్కెట్ చేయబోతున్నారు. కొత్త ఆడియెన్స్ సినిమా చూసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు ప్రీ లుక్ అదిరిపోయింది. తల నుంచి రక్తం కారుతుండగా, మెడలో శివుడి లాకెట్ ఉంది. ఇందులో త్రిశూలం, నంది, శివుడి నామాలున్నాయి. మహేష్ యాక్షన్‌లోకి దిగిన సమయంలో తీసిన ఫోటోని ఇలా ప్రీ లుక్ లాగా విడుదల చేసినట్టుగా అనిపించింది. జస్ట్ ప్రీ లుక్కే పిచ్చెక్కించేలా ఉంది. ఈ సినిమా కథ శివతత్వం చుట్టూ తిరుగుతుందని, హీరో మహేష్ శివ భక్తుడిగా కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఇటీవల కాలంలో దైవత్వానికి సంబంధించిన సినిమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి కూడా ఆ టచ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. సుమారు వెయ్యి కోట్లతో తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. దీనికి మహేష్ బాబు పారితోషికం కూడా షాకిస్తుంది. ఈ సినిమాకి ఆయన వంద కోట్లు తీసుకుంటున్నారట. అయితే వంద కోట్లు లిక్విడ్ రూపంలో కాదు, షేర్ రూపంలో తీసుకోబోతున్నారట. సినిమా వసూళ్లలో షేర్ తీసుకుంటున్నారు మహేష్. ఇదంతా రాజమౌళి ప్లానే అని సమాచారం. పారితోషికం ఇస్తే నిర్మాతకు ఇబ్బంది అని చెప్పి, ముందుగా ఇవ్వకుండా కలెక్షన్లలో లాభాలను ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2027లో ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.