
చిరంజీవి(Chiranjeevi) రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయన కెరీర్‌లో రీమేక్‌ల పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. కానీ ఇటీవల రీమేక్‌లు వర్కౌట్ కావడం లేదు. సేఫ్ గేమ్ కోసం చేసే Remake ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఓటీటీలు విస్తరించిన నేపథ్యంలో రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. బాగున్నప్పటికీ కమర్షియల్‌గా వర్కౌట్ అవడం లేదు. ఒకటి రెండు రోజులకే పరిమితమవుతున్నాయి. అప్పటికే ఓటీటీలో ఆడియెన్స్ సినిమాని చూడటమే అందుకు కారణమని చెప్పొచ్చు.
తాజాగా `భోళాశంకర్` (Bhola Shankar) చిత్రంతో బోల్తా పడ్డారు చిరంజీవి. ఇది తమిళంలో వచ్చిన `వేదాళం`కి రీమేక్ అనే విషయం తెలిసిందే. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి నెగటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మహా అయితే ఆదివారం వరకు అంతో ఇంతో ఆడే అవకాశం ఉందంటున్నారు. తొలి రోజు కూడా చాలా చోట్ల షోస్ ఫుల్ కాలేదు. చిత్ర యూనిట్ సైలెన్సే దీనికి నిదర్శమని చెప్పొచ్చు. ఇది రీమేక్‌లు వర్కౌట్ కావనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రీమేక్‌లు చేయాలనుకునే ఆలోచన ఉన్న వారిని కూడా హెచ్చరిస్తుందని చెప్పొచ్చు. ఇదే కాదు, అంతకు ముందు పవన్ నటించిన `బ్రో` కూడా నిరాశ పరిచింది. వెంకటేష్ నటించిన `నారప్ప` రిజల్ట్ కూడా సేమ్.
ఇదిలా ఉంటే `భోళాశంకర్`కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా రీమేక్‌ని మొదట చేయాల్సింది చిరంజీవి కాదట. అది సూపర్ స్టార్ మహేష్ (Maheshbabu)వద్దకు వెళ్లిందని సమాచారం. దర్శకుడు మెహెర్ రమేష్(Meher Ramesh). మొదట `వేదాళం` సినిమా రీమేక్ స్క్రిప్ట్ తో మహేష్ వద్దకి తీసుకెళ్లారట. చాలా రోజులుగా ఈ స్క్రిప్ట్ ని పట్టుకుని సూపర్‌స్టార్ వెంట తిరిగారట మెహర్. కానీ రీమేక్ చేయడం నచ్చక.. ఆయన్నుంచి తప్పించుకోలేక.. మెగాస్టార్‌ని సజెస్ట్ చేశారట.
అలా మహేష్‌బాబు కారణంగా ఇది చిరంజీవి వద్దకు వెళ్లిందట. మహేష్ పంపడంతో చిరంజీవి కూడా ఓకే చెప్పారట. పైగా ఆయన అప్పటికే రీమేక్ విషయంలో ఆసక్తికరంగా ఉన్నారు. తమిళంలో హిట్ మూవీ కావడంతో స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పారట. ఇందులో సిస్టర్ సెంటిమెంట్, ఉమెన్ ట్రాఫికింగ్, యాక్షన్ సీన్లు ఉండటంతో కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందని భావించారట చిరు. పైగా మెహెర్ రమేష్ తమ ఫ్యామిలీ మనిషి. తనని ఎలా చూపించాలనేది ఆయనకు బాగా తెలుసు. అలా `భోళాశంకర్`ని పట్టాలెక్కించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా మహేష్ చేయాల్సిన సినిమాని చిరంజీవి చేశారు. మహేష్‌బాబు తెలివిగా డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారు, కానీ మెగాస్టార్ గట్టిగా బలయ్యారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన `భోళాశంకర్`లో ఆయనకు జోడీగా తమన్నా నటించగా, కీర్తిసురేష్ చెల్లిగా చేసింది. సుశాంత్ గెస్ట్ రోల్ చేశారు. వీరితోపాటు శ్రీముఖి, రష్మి, హైపర్ ఆది, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, గెటప్ శ్రీను, నరేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రవిశంకర్ వంటి వారు ఇతర పాత్రల్లో మెరిశారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.
శుక్రవారం విడుదలైన `భోళాశంకర్` సినిమాకి నెగటివ్ టాక్ వస్తుంది. సినిమా కంటెంట్ ఔట్ డేటెడ్ అని, ఇరవై ఏళ్ల క్రితం చేయాల్సిన సినిమా అని అంటున్నారు. రొటీన్ కథ, కథనాలు, యాక్షన్ సీన్లు బోర్ తెప్పించాయి. పైగా సంగీతం పరంగానూ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం విషయంలో మహతి సాగర్ విఫలమయ్యాడు. దీంతో సినిమా చిరంజీవి ఫ్యాన్స్ ని కూడా డిజప్పాయింట్ చేస్తుంది. మొత్తానికి చిరంజీవి ఓ ఫెయిల్యూర్‌ని కొని తెచ్చుకున్నారని అంటున్నారు నెటిజన్లు.