టాలీవుడ్‌ కోసం సొంత ఇండస్ట్రీకి దుల్కర్‌ గుడ్‌ బై?.. `లక్కీ భాస్కర్‌` టైటిల్‌ సాంగ్‌.. అదిరే కొత్త మూవీ టైటిల్

First Published | Jul 28, 2024, 7:09 PM IST

దుల్కర్‌ సల్మాన్‌.. తెలుగులో బిజీ అవుతున్నాడు. తాజాగా ఆయన తన ఫోకస్‌ మొత్తం టాలీవుడ్‌పైనే ఉంది. ఈ క్రమంలో ఆయన తన సొంత ఇండస్ట్రీకి గుడ్‌ బైచెప్పినట్టు టాక్‌. 
 

మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తెలుగు హీరోగా మారిపోతున్నాడు. `మహానటి`తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడి ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. క్రమంగా టాలీవుడ్‌ హీరో అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మలయాళ సినిమాలు చేసేందుకు  ఆసక్తి చూపించడం లేదట. తెలుగు సినిమాల కోసం ఆయన సొంత ఇండస్ట్రీకే గుడ్‌ బై చెబుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 

మలయాళంతో పోల్చితే తెలుగు సినిమా మార్కెట్‌ చాలా పెద్దది. బడ్జెట్‌, పారితోషికాలు ఎక్కువ. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ చాలా వరకు పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇది తన పాన్‌ ఇండియా ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని, పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు దుల్కర్‌. అందుకే మలయాళ సినిమాలకంటే ఆయన తెలుగు చిత్రాలే చేస్తున్నారు. ఓ రకంగా మాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పాడా? అనే ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

Latest Videos


`మహానటి` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌  తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత `సీతారామం`తో హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో గెస్ట్ రోల్‌లో మెరిశాడు. వాహ్‌ అనిపించాడు. ప్రస్తుతం `లక్కీ భాస్కర్‌` చిత్రంలో నటిస్తున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ఈ మూవీకి వెంకీ అట్లూరీ దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. నేడు దుల్కర్‌ సల్మాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం సాంగ్‌ని విడుదల చేసింది టీమ్‌. 

ఈ సినిమా టైటిల్‌ ట్రాక్‌ని తాజాగా విడుదల చేశారు. `యూ లక్కీ భాస్కర్‌` అంటూ సాగే ఈ పాట దుల్కర్‌ క్యారెక్టరైజేషన్‌ని, సినిమా మెయిన్‌ థీమ్‌ని వివరిస్తుంది. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, ఉషా ఉతుప్‌ ఆలపించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. చాలా కూల్‌గా సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. అలరించేలా ఉంది. బ్యాంక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఇక సినిమా విషయానికి వస్తే 1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని `లక్కీ భాస్కర్` సినిమాలో చూడబోతున్నారని తెలిపింది టీమ్. 
 

దుల్కర్‌ సల్మాన్‌ బర్త్ డే సందర్భంగా మరో ట్రీట్‌ వచ్చింది. తెలుగులో ఆయన చేస్తున్న మరో తెలుగు సినిమాని ప్రకటించారు. `ఆకాశంలో ఓ తార` పేరుతో ఆయన కొత్త సినిమా చేస్తున్నారు.  దీన్ని గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్‌ సంయుక్తంగా లైట్‌ బాక్స్ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నాయి. పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్‌గున్నమ్‌, రమ్య గున్నమ్‌  నిర్మాతలు. తెలుగుతోపాటు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఆకాశపు మబ్బుల వెనుక దుల్కర్‌ దేనికోసమే చూస్తున్నాడు. భుజంపై పింక్‌ టవల్‌ వేసుకుని కనిపిస్తున్నాడు. కింద స్కూల్‌ బ్యాగ్‌లో ఓ చిన్నారి కనిపిస్తుంది. తన కూతురు కోసం దుల్కర్‌ వెయిట్‌ చేస్తున్నాడా ? అసలు ఈ మూవీ ద్వారా ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిని క్రియేట్‌ చేసేలా ఉంది. ఇది 1980 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తుంది. ఒక పేద వాడు గొప్పగా ఎదిగిన కథతో ఇన్‌స్పైరింగ్‌ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారట. గుణ్ణం గంగరాజు స్క్రిప్ట్ అందించారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను టీమ్‌ వెల్లడించబోతుంది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే దుల్కర్‌ తెలుగులో మరో సినిమాని కూడా ప్రకటించారు. ఆ మధ్య రానా బ్యానర్‌లో `కాంత` పేరుతో ఓ సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇది వైరల్‌ అయ్యింది. దీనికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇలా ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో టాలీవుడ్‌ హీరోగా బిజీ అవుతున్నాడు దుల్కర్‌. తెలుగు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు. 

click me!