విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

First Published Jan 19, 2023, 7:57 AM IST

కొన్ని రోజుల క్రితం  విజయ్ ఆంటోని తన తదుపరి చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 

కొన్ని రోజుల క్రితం  విజయ్ ఆంటోని తన తదుపరి చిత్ర షూటింగ్ లో ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2)  చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

షూటింగ్ లో భాగంగా విజయ్ ప్రయాణిస్తున్న బోట్ పక్కనే ఉన్న సిబ్బంది పడవని బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే విజయ్ ఆంటోనీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అవుట్ ఆఫ్ డేంజర్ అని సన్నిహితులు తెలిపారు. కుటుంబ సభ్యులు మలేషియా చేరుకొని విజయ్ ని చెన్నైకి తీసుకువచ్చారు. 

ప్రస్తుతం చెన్నైలో ఆంటోనికి చికిత్స జరుగుతున్నట్లు అతని భార్య ఫాతిమా మీడియాకి తెలిపారు. అయితే ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పుకార్లు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విజయ్ అపస్మారకస్థితిలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. 

దవడ ఎముక విరిగిందని, పళ్ళు ఊడిపోయాయని, ముఖానికి బలమైన గాయం అయిందని చిత్ర యూనిట్ లో ఒకరు చెప్పినట్లుగా తమిళనాట మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనితో విజయ్ హెల్త్ కండిషన్ ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే అతని సన్నిహితులు ఈ వార్తలని కొట్టిపారేశారు. విజయ్ కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. విజయ్ దాదాపుగా కోలుకున్నారు. సినిమా షూటింగ్ మాత్రం వాయిదా పడింది. విజయ్ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు అని తెలిపారు. బుధవారం సాయంత్రమే కుటుంబ సభ్యులు విజయ్ ని చెన్నైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

click me!