
Lagare Sound Saala : ఈ టెక్ జమానాలోనూ జానపదాల హవా సాగుతోంది. ఫాస్ట్ బీట్, పాప్ అల్బమ్స్ ను ఇష్టపడే జెన్ జి యువత కూడా అచ్చతెలుగు ఫోక్ సాంగ్స్ అంటే పడిచస్తున్నారు. ఎంతలా అంటే 'రాను బొంబైకి రాను' అంటూ అద్భుతమైన జానపదానికి స్టెప్పులేసిన రాము రాథోడ్ ను ఏకంంగా బిగ్ బాస్ హౌస్ కి పంపించే స్థాయిలో... 'ఓ పిలగ యెంకటేశు' సాంగ్ విదేశీ పబ్బుల్లో వినిపించేంత స్థాయిలో వైరల్ చేశారు.
అయితే ఇలా ఒక్కపాట కాదు... ఆమె కనిపించే ప్రతిపాట సూపర్ హిట్టే అనేంత గొప్ప పేరు తెచ్చుకుంటోంది ఓ ఫోక్ డ్యాన్సర్. ఆమె సరికొత్త పాటలతో రోజురోజుకి అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఆమె ఎవరో కాదు... ఎర్రాఎర్రా తువ్వాలు, మామిడి కొనాలమీద, పేరుగల్ల పెద్దిరెడ్డి పాటలతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగదుర్గ. తాజాగా ''లగారె సౌండ్ సాలా'' అంటూ ఈమె అదిరిపోయే స్టెప్పులేసిన సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.
ఈ రోజుల్లో సినిమా పాటలకంటే మన అమ్మానాన్నలు, అమ్మమ్మలు, తాతల కాలంనాటి జానపదాలే జనాల్లోకి ఎక్కువ వెళుతున్నాయి.. సూపర్ హిట్ అవుతున్నాయి. ఇలా ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గు అదిరేటి స్టెప్పులేసిన ''లగారె సౌండ్ సాలా'' సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఈ సాంగ్ ప్రోమోతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది... అందుకే ఫుల్ సాంగ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూశారు. వారంరోజుల క్రితమే విడుదలైన సాంగ్ కూడా ఏమాత్రం నిరుత్సాహపర్చడంలేదు. ఇంకా చెప్పాలంటే మంచి ఫాస్ట్ బీట్ లోనే అమ్మాయిల గురించి అద్భుతంగా చెప్పిన సాంగ్ ఇది.
అమ్మాయిలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది ఈ లగారే సాంగ్ లో చాలా చక్కగా చెప్పారు. అమ్మాయిలు సిగ్గుతో ముడుచుకుపోకూడదు... అలాగని స్వేచ్చ పేరిట మరీ ఓవర్ గా ఉండకూడదని చక్కగా చెప్పారు. కన్న తల్లిదండ్రులు, అన్నతమ్ములు బాధపడేలా ఉండకూడదు... కట్టుకున్నోడికి తలవంపు తెచ్చేలా, మెట్టినింట మాటలు పడేలా అమ్మాయిల ప్రవర్తన ఉండరాదు.. అలాగని నిన్ను నీవు దాచుకోకు అంటూ నేటితరం అమ్మాయిలకు సూచించేలా ఈ పాట ఉంది.
సిగ్గు పక్కనబెట్టాలి.. ఈ జన్మ మళ్లీరాదు కాబట్టి ఓసారి కొంగుజుట్టి సింగుజెక్కి స్టెప్పెయ్ అంటూ పెళ్లి కూతురికి సూచిస్తూ ఈ లగారె సౌండ్ సాంగ్ సాగుతుంది. అమ్మాయిలు వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో అనుకోవడం మానుకోవాలని... నచ్చినట్లు ఉండాలని ఈ పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. ఫాస్ట్ బీట్ లో మంచి ఊపున్న సాంగ్ అయినా చాలా అర్థవంతంగా ఉంటుంది. అమ్మాయిని చూస్తే చేతులెత్తి మొక్కేలా, గుణం చూస్తే లోకమే మెచ్చేలా ఉండాలి... ఆడజన్మ మందిరం లాంటిది, మందారం లాంటిది ఆమె జీవితం... ఇలాంటి అద్భుతమైన మాటలతో లగారే సౌండ్ సాలా సాంగ్ సాగుతుంది.
ఎర్రాఎర్రా రుమాలు, నా పేరే ఎల్లమ్మ, పేరుగల్ల పెద్దిరెడ్డి, మామిడి కొనాల మీద పాటలతో నాగదుర్గ ఎంత గొప్ప డ్యాన్సరో అందరికీ తెలిసిపోయింది. ఇక ఇంతకంటే గొప్పగా ఆమె డ్యాన్స్ ఉండదు అనుకునేవారికి ఈ లగారే సౌండ్ సాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ పాటలో నాగదుర్గ మాస్ స్టెప్పులకు ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. కేవలం డ్యాన్స్ తోనే కాదు తన నటనతో కూడా ఆమె ఆకట్టుకుంది.
యూట్యూబ్ లో ఈ లగారె సౌండ్ సాలా పాట ప్రొమోనే 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక వారంరోజుల కింద రిలీజ్ అయిన ఫుల్ సాంగ్ ఇప్పటికే 4.7 మిలియన్ వ్యూస్, 60k లైక్స్ తో దూసుకుపోతోంది. ఈ పాట చూసిన ప్రతిఒక్కరు నాగదుర్గ డ్యాన్స్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు... పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తెలంగాణ జానపదం లగారె సౌండ్ సాలాను ట్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ రూపొందించింది. బుల్లెట్ బండి లక్ష్మణ్ అద్భుతమైన లిరిక్స్ అందించగా... మదీన్ ఎస్కే మాస్ మ్యూజిక్ ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇక సింగర్ మమతా రమేష్ గొంతులో పడి ఈ పాట మరింత అద్భుతంగా మారింది.
ఈ లగారే సౌండ్ సాలా వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... నాగదుర్గ డ్యాన్స్ అదిరిపోయింది. మరోసారి కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ తన మార్కు స్టెప్పులు అందించాడు. ఇలా మాస్ బీట్ లో సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు తోడయ్యాయి... అందుకే లగారె సౌండ్ సాలా అంటుంటే ప్రేక్షకులే పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పెళ్లిలో, బరాత్ లో ఈ పాటే వినిపించేలా ఉంది... అమ్మాయిలు, అబ్బాయిలతో స్టెప్పులు వేయించేలా ఉంది.