ఇద్దరు సూపర్ స్టార్లు కృష్ణ, మహేష్ కలిస్తే బాక్సాఫీసు దుమారమే.. ఏకంగా పదిసార్లు అభిమానులకు ఆ భాగ్యం..

First Published Nov 15, 2022, 7:43 AM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ సాహసాలకు, ప్రయోగాలకు కేరాఫ్‌. ఆయనకు మహేష్‌ తోడైతే అది ఘట్టమనేని అభిమానులకు కనువిందే. అలాంటి కనువిందు పది సార్లు కలిగింది. ఇద్దరు కలిసి బాక్సాఫీసుని షేక్‌ చేశారు. 
 

సినిమాల్లో ఏదైనా జరుగుతుందని, అన్నాగా చేసిన వాళ్లు బాయ్‌ ఫ్రెండ్‌గా చేయోచ్చు, చెల్లిగా చేసిన నటి ప్రియురాలిగా చేయోచ్చు. అలాగే సూపర్‌ స్టార్‌ కృష్ణ విషయంలో సొంత కొడుకే కొడుకుగా, తమ్ముడిగా చేయడం విశేషం. అవును కృష్ణ, మహేష్‌బాబు తండ్రి కొడుకులుగా, అన్నాదమ్ములుగానూ నటించి రావడం అరుదైన విషయమనే చెప్పొచ్చు. మరి వీరిద్దరు కలిసి నటించిన సినిమాలేంటీ? అనేది ఓ సారి చూస్తే.. 
 

మొదట 1983లో తొలిసారి కృష్ణ, మహేష్‌ కలిసి `పోరాటం` చిత్రంలో నటించారు. అప్పటికి మహేష్ వయసు ఆరేళ్లు. యాక్షన్‌ డ్రామాగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో కృష్ణకి తనయుడిగా కనిపించారు మహేష్‌. ఈ చిత్రం విశేషంగా అలరించింది.

ఆ తర్వాత 1987 లో వచ్చిన `శంఖారావం` సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు. ఈ సినిమాని కృష్ణ తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్‌ చేసింది. కృష్ణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 
 

ఆ తర్వాత వెంటనే 1988లో వచ్చిన మరో చిత్రం `ముగ్గురు కొడుకులు`.కృష్ణ తన ఇద్దరు కొడుకులతో చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు. ఈసినిమాకి కూడా కృష్ణనే దర్శకుడు కావడం మరో విశేషం. తన పద్మాలయ బ్యానర్‌లో ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మించారు. ఈ చిత్రం హిట్‌ అయ్యింది. 

కృష్ణ, మహేష్‌ ల దూకుడికి మరో నిదర్శనం `కొడుకు దిద్దిన కాపురం`. కృష్ణ, విజయశాంతి కలిసి నటించిన చిత్రం కావడం విశేషం. ఇందులో కొడుకుగా మహేష్‌ అదరగొట్టాడు. కృష్ణ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన వాటిలో` కొడుకు దిద్దిన కాపురం` ఒకటిగా నిలిచింది. ఇది 1989లో విడుదలైంది. 
 

ఇదే ఏడాది `గూఢచారి 117` విడుదలైంది. కృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.తెలుగు తెరకి మొదటిసారి స్పై ఫిల్మ్ ని పరిచయం చేశారు కృష్ణ. ఇందులో కృష్ణ గూఢచారిగా అదరగొట్టాడు.
 

`అన్న తమ్ముడు` చిత్రం నటులకు హద్దులుండవని నిరూపించింది. ఇందులో అన్నగా కృష్ణ, తమ్ముడిగా మహేష్‌ నటించడం విశేషం. 1990 లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ పేరుకు ముందు ఒమేగా స్టార్ అని వేయడం విశేషం. అప్పుడే స్టార్ హోదా అందుకున్నాడు మహేష్‌. ఇక కృష్ణ అప్పటికే సూపర్‌ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు `బజార్‌ రౌడీ` చిత్రంలో కృష్ణ గెస్ట్ గా చేశారు. రమేష్‌ బాబు హీరోగా నటించిన ఈచిత్రంలో బాలనటుడిగా మహేష్‌ నటించారు.

మహేష్‌బాబు 1999లో `రాజకుమారుడు` సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత మహేష్ హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇందులోనూ కృష్ణ నటించారు. `అన్న అన్న రైతన్న నీకున్నది అప్పులు రోయ్` అనే పాటలో కనిపించారు కృష్ణ. అయితే ఇందులో మహేష్‌, కృష్ణ కాంబినేషన్‌లో సన్నివేశాలు లేకపోవడం కాస్త డిజప్పాయింట్‌ చేసినా, కృష్ణ అప్పియరెన్స్ మాత్రం వారి అభిమానులకు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

మహేష్‌ హీరోగా నటించిన `టక్కరి దొంగ` చిత్రంలో మహేష్ కౌ బాయ్ గా నటించారు. అయితే క్లైమాక్స్ లో కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. కౌ బాయ్ డ్రస్ లో `మోసగాళ్లకు మోసగాడు` సినిమాను గుర్తుకు తెచ్చారు. మహేష్, కృష్ణ ల మధ్య సంభాషణ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. 
 

చివరగా మహేష్‌, కృష్ణ కలిసి `వంశీ` చిత్రంలో నటించారు. బి గోపాల్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో కీలక పాత్రలో కృష్ణ కనిపించారు. మహేష్‌కి జోడీగా నమ్రత నటించడం విశేషమైతే, అప్పటికే వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమకి ఈ చిత్రం టైమ్‌లోనే కృష్ణ ఓకే చెప్పారని సమాచారం. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఏదేమైనా దాదాపు పదికిపైగా చిత్రాల్లో కృష్ణ, మహేష్‌ కలిసి నటించి అభిమానులను అలరించారు. బాక్సాఫీసుని షేక్‌చేశారు. 
 

click me!