Meter Review: కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీ రివ్యూ

First Published Apr 7, 2023, 12:57 PM IST

డిఫెరెంట్ యాటిట్యూడ్ తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు చేస్తున్నాడు. 2019లో కిరణ్ రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన 'మీటర్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

డిఫెరెంట్ యాటిట్యూడ్ తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు చేస్తున్నాడు. 2019లో కిరణ్ రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎస్ఆర్ కళ్యాణండపం, వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే కిరణ్ చేసిన చెప్పుకోదగ్గ చిత్రాలు. మిగిలినవి నిరాశపరిచాయి. అయినా రిజల్ట్ తో సంబంధం లేకుండా కిరణ్ వరుస చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన 'మీటర్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేష్ కదూరి  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అతుల్య రవి.. కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం. 

కథ :

స్వతంత్ర భావాలు, ఉత్సాహం కలిగిన యువకుడు అర్జున్ కళ్యాణ్(కిరణ్ అబ్బవరం). అతడి తండ్రి నిజాయతీకలిగిన పోలీస్ కానిస్టేబుల్. కొడుకుని పోలీస్ అధికారిగా చూడాలనేది తండ్రి కల. కానీ అర్జున్ కి పోలీస్ కావడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా అర్జున్ ఎస్సైగా సెలెక్ట్ అవుతాడు. ఉద్యోగంలో చేరుతాడు. ఎప్పుడు సస్పెండ్ అయిపోదామా అని ఎదురుచూస్తుంటాడు. ఊహించని విధంగా అర్జున్ కి మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు వస్తుంది. 

ఈ క్రమంలో హోమ్ మినిష్టర్ బైరెడ్డితో అర్జున్ కి వివాదం ఏర్పడుతుంది. అధికారంలోకి వచ్చేందుకు బైరెడ్డి చేసే ఓ కుట్ర గురించి అర్జున్ కి తెలుస్తుంది. అసలు బైరెడ్డి, అర్జున్ మధ్య ఏం జరిగింది ? బైరెడ్డి కుట్రని అర్జున్ అడ్డుకున్నాడా ? పోలీస్ అధికారిగా అర్జున్ కొనసాగాడా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ :

కిరణ్ అబ్బవరం తన యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో నయా మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కిరణ్ గతంలో నటించిన చిత్రంలో కథకు తగ్గట్లుగా పాత్ర ఉండేది. కొన్ని చోట్ల మాత్రమే మాస్ అవతారంలో కనిపించేవాడు. కానీ తొలిసారి కిరణ్ పూర్తి స్థాయి మాస్ పాత్రలో మెరిశాడు. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కి వంకలు పెట్టలేం. 

పోలీస్ అధికారి పాత్రకు కిరణ్ బాగా సెట్ అయ్యాడు. తొలిసారి కిరణ్ ఈ చిత్రంలో తనలోని డ్యాన్సర్ ని కూడా బయటకి తీశాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మాస్ సాంగ్ లో కిరణ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక హోమ్ మినిస్టర్ బైరెడ్డి పాత్రలో విలన్ గా ధనుష్ పవన్ బాగా నటించారు. ఈ చిత్రంలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన వారిలో పోసాని కృష్ణ మురళి, సప్తగిరి కూడా ఉన్నారు. వారి పాత్రలు ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచాయి. 

ఈ చిత్రంలో ఇవి తప్ప కథ గురించి మాట్లాడుకునే స్కోప్ కూడా దర్శకుడు ఇవ్వలేదు. అలాంటి పరమ రొటీన్ స్టోరీని దర్శకుడు రమేష్ ప్రేక్షకుల మీదికి వదిలారు. మాస్ ఫార్ములా కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. ఏదో ఒక ప్రత్యేకత లేకుంటే కమర్షియల్ చిత్రాలు వర్కౌట్ కావడం లేదు. కమర్షియల్ ఫార్ములాతోనే సినిమా చేసినా అన్ని పక్కాగా కుదిరితేనే రాణిస్తున్నాయి. ఈ అంశాలని దర్శకుడు పూర్తిగా పక్కన పెట్టేసినట్లు ఉన్నారు. 

ఎలాంటి భాద్యత లేకుండా తిరిగే హీరో.. తండ్రి కోసం ఇష్టం లేని ఉద్యోగం చేయడం.. సడెన్ గా కథలో మలుపులు.. ఆ తర్వాత విలన్ ని వణికించడం.. ఈ తరహా కథలు ఎన్ని చూడలేదు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు మీటర్ చిత్రం చూస్తున్నప్పుడు కలుగుతుంది. 

చాలా సన్నివేశాలు అతిగా, లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. హీరో వెంట పడుతున్నా హీరోయిన్ అతడిని అసహ్యించుకుంటూనే ఉంటుంది. ఒక్క సన్నివేశంతో ఆమె అభిప్రాయం మారిపోతుంది. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటి ప్రేక్షుకులకు వినోదాన్ని అందించవు. హీరోయిన్ అతుల్య రవికి నటించే అవకాశమే రాలేదు. నటులు నటించిన విధానం బావుంది కానీ.. ఆ పాత్రల్లో కూడా కొత్తదనం ఎక్కడా కనిపించదు. 

టెక్నికల్ గా :

దర్శకుడు రమేష్ ఎంచుకున్న కథ ఆకట్టుకునే విధంగా లేదు. మొత్తం రొటీన్ అంశాలే. అయినప్పటికీ ఏదైనా కొత్త అంశం తీసుకుని స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మార్చి ఉండొచ్చు. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. పాటల్లో డ్యాన్స్ కొరియోగ్రఫీ బావుంది. కానీ సాయి అందించిన సంగీతం ఏమాత్రం వినసొంపుగా లేదు. 

ఈ చిత్ర నిడివి రెండు గంటల ఏడు నిమిషాలు. రొటీన్ సీన్స్ వల్ల ఇంకా ఎడిట్ చేసి ఉంటే బావుండేది అనిపిస్తుంది. దిలీప్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. అయినా ఈ చిత్రానికి ఇంత ఖర్చు చేయడం అనవసరం అనిపిస్తుంది. 

ఫైనల్ థాట్ :

మాస్ అంశాలు ఉన్నప్పటికీ అవి మీటర్ రీడింగ్ పెంచేవి కాదు. ఏదో ఆశించి ఈ చిత్రం కోసం థియేటర్స్ కి వెళితే తెల్లముఖం వేసుకుని తిరిగి రావలసిందే. 

రేటింగ్ : 1.5/5

నటీనటులు : కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, ధనుష్ పవన్ 

దర్శకుడు : రమేష్ కదూరి 

నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు 

సంగీతం : సాయి కార్తీక్ 

click me!