`ఫంకీ` హీరోయిన్ కయాదు లోహర్ తన స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
కన్నడ చిత్రం 'ముగిల్‌పేట'తో మనోరంజన్ రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది కయాదు లోహర్. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ భాషల్లో నటించింది. ఇటీవల విశ్వక్ సేన్‌తో `ఫంకీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన స్కూల్ రోజుల్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు కొందరు అబ్బాయిలు రోజూ వేధించేవారని, సహనం నశించి కోపంతో వాళ్లపై రాయి విసిరానని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
25
10వ తరగతిలో వేధించిన కుర్రాళ్లు
ఇటీవల 'గలాటా తమిళ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కయాదు లోహర్ ఈ సంఘటనను గుర్తుచేసుకుంది. తను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇది జరిగిందని చెప్పింది. "మా ఇంటి దగ్గరే ట్యూషన్‌కి వెళ్లేదాన్ని. దారిలో రోజూ కొంతమంది అబ్బాయిలు నన్ను ఏడిపించేవాళ్లు. మొదటి రోజు పట్టించుకోలేదు. రెండో రోజు కూడా సైలెంట్‌గా ఉన్నా. కానీ మూడో రోజు నా వల్ల కాలేదు," అని ఆమె వివరించింది.
35
రక్తం కారేలా కొట్టిన కయాదు
ఆ రోజు తీవ్రమైన కోపంతో ఉన్న తాను, రోడ్డుపై ఉన్న రాయి తీసుకుని ఆ అబ్బాయిల వైపు విసిరినట్లు ఆమె వివరించింది. "నాకు చాలా కోపం వచ్చింది. రాయి విసరగానే అది ఒక అబ్బాయి తలకు తగిలింది. వాడి తల నుంచి రక్తం కారడం మొదలైంది. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ క్షణంలో నేను చాలా ఆవేశంలో ఉన్నాను," అని కయాదు చెప్పింది.
ఇప్పుడు ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, హింసాత్మకంగా ప్రవర్తించడం సరైంది కాదని ఆమె ఒప్పుకుంది. కానీ, నాటి పరిస్థితులు తనను అలా ప్రవర్తించేలా చేశాయని చెప్పింది. "ఎవరిపైనైనా రాయి విసిరి గాయపరచడం తప్పు. కానీ ఆ సమయంలో నాకు కలిగిన బాధ, నిస్సహాయత, కోపం నన్ను అలా రియాక్ట్ అయ్యేలా చేశాయి. నేను సాధారణంగా ప్రశాంతంగా ఉంటాను. కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు సైలెంట్‌గా ఉండకూడదు. వాళ్లకు తగిన సమాధానం ఇవ్వాలని నేను నమ్ముతాను," అని ఆమె చెప్పింది. కయాదు వ్యాఖ్యలతో, స్కూల్, పనికి వెళ్లే మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, వాటి పర్యవసానాలపై మరోసారి చర్చ మొదలైంది.
55
కయాదు లోహర్ సినిమాలు
కయాదు లోహర్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఇధయమ్ మురళి' జూలై 10న విడుదల కానుండగా, 'ఇమ్మోర్టల్' జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జి.వి. ప్రకాష్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ భాషల్లో నటించిన కయాదు, ప్రస్తుతం 'ఐ యామ్ గేమ్', 'ఖలీఫా', 'ది ప్యారడైజ్' వంటి మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే సూర్యతో ఓ మూవీ చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించే ఈ మూవీకి టీజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు.