Katha Kanchiki Manam Intiki Review: `కథ కంచికి మనం ఇంటికి` మూవీ రివ్యూ

First Published | Apr 8, 2022, 2:22 PM IST

అదిత్‌ అరుణ్‌ పేరు మార్చుకున్నాక(త్రిగుణ్‌) వస్తున్న చిత్రం `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత పొన్నాడ కథానాయికగా ఆర్జే హేమంత్‌, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో చాణక్య చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. హర్రర్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(ఏప్రిల్‌ 8)న విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

హీరోగా సరైన గుర్తింపు, సక్సెస్‌ రావడం లేదని, తన కెరీర్‌ని మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలని త్రిగుణ్‌గా పేరు మార్చుకున్నారు అదిత్‌ అరుణ్‌. ఆయన పేరు మార్చుకున్నాక విడుదలవుతున్న సినిమా `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత పొన్నాడ కథానాయికగా నటించిన ఈ హర్రర్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి చాణక్య చిన్నా దర్శకత్వం వహించారు. మోనిష్‌ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 8)న విడుదలైంది. మరి ఇప్పటికే వచ్చిన అనేక హర్రర్‌ కామెడీ సినిమాలకు ఇది భిన్నంగా ఉందా? ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసిందా? అనేది `కథ కంచికి మనం ఇంటికి` చిత్ర రివ్యూలో తెలుసుకుందాం. Katha Kanchiki Manam Intiki Review

కథః
శృంగార పురుషుడైన తాత అనేక మంది ఆడవారితో సంబంధాలు పెట్టుకుని తన ఆస్తిని మొత్తం వారికే రాసిచ్చి తనని మాత్రం రోడ్డున పడేశాడని బాధ పడుతుంటాడు ప్రేమ్‌(త్రిగుణ్‌). తనకు పెళ్లి కావడం లేదని, తనకు ఏ ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, తన జీవితం ఎండుటాకుల మారిపోయిందని బాధ పడుతుంటాడు. అమ్మాయిలను పడేయడం, ఆంటీలైనా సరే పెళ్లి చేసుకుందామని యావలో తిరుగుతుంటాడు. మరోవైపు క్రేజీ బెట్టింగ్‌లతో తన లైఫ్‌లో క్రేజ్‌ని పొందుతూ ఫ్రెండ్స్ వద్ద డబ్బులు కొట్టేస్తుంది దీక్ష(పూజిత పొన్నాడ). ఇంకో వైపు సినిమా దర్శకుడిగా రాణించాలని కథలు రాస్తూ, వాటిని పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు నంది(ఆర్జే హేమంత్‌). మరోవైపు దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు దొంగేష్‌(గెటప్‌ శ్రీను). ఈ నలుగురు ఓ రాత్రి శ్మశానంలో కలుసుకుంటారు. ఒకరినొకరు దెయ్యాలుగా భ్రమ పడి, తీరా తాము మనుషులమే అని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ రాత్రి పక్కనే ఉన్న ఓ గెస్ట్ హౌజ్‌లోకి వెళ్తారు. అక్కడ దెయ్యం వీరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది. ఆ దెయ్యం కథేంటి? చైల్డ్ ట్రాఫికింగ్‌(అనాథ మైనర్‌ బాలికలపై అత్యాచారాలు) కి, ఈ కథకి సంబంధమేంటనేది మిగిలిన సినిమా. 

Katha Kanchiki Manam Intiki Review


విశ్లేషణః 
హర్రర్‌ కామెడీ సినిమాలు ఇప్పటికే తెలుగులో చాలా చిత్రాలొచ్చాయి. పదుల సంఖ్యలో అలాంటి సినిమాలను చూశారు ఆడియెన్స్. ఇంకా చెప్పాలంటే హర్రర్‌ సినిమాలపై బోర్‌ కొట్టేసిన టైమ్‌ నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరో హర్రర్‌ కామెడీ సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా కొత్తగా ఉండాలి, గత చిత్రాలకు భిన్నంగా, బాగా నవ్వించేలా ఉండాలి. మంచి పాయింట్‌తోనైనా ఉండాలి. కానీ అవేవీ లేని సినిమా `కథ కంచికి మనం ఇంటికి`. అనేక సినిమాల్లోని సన్నివేశాలను కాపీ కొట్టి(ఇన్‌స్పైర్‌) అయి చేసిన చిత్రమిది. ఓ రకంగా ఇదొక ఓ స్ఫూప్‌ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశంలోనూ చూసేసినా ఫీలింగ్‌, తర్వాతి సన్నివేశం ఏం జరుగుతుందో ఊహించేలా ఉండటం ఈ చిత్రంలోని ప్రధాన మైనస్‌. బలమైన కథ లేదు. సెకాండాఫ్‌ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏ పాత్ర ఏం చేస్తుందో అర్థం కాదు, ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు.

Katha Kanchiki Manam Intiki Review

హీరోహీరోయిన్ల పాత్రలు మరీ చిరాకు తెప్పిస్తాయి. అంతో ఇంతో ఆర్జే హేమంత్‌, గెటప్‌ శ్రీను పాత్రలు నవ్వించే ప్రయత్నం చేస్తాయి. అయితే గెటప్‌ శ్రీను పాత్ర కూడా పరమ రొటీన్‌గా, సిల్లీగా ఉంటుంది. ప్రధాన కాస్టింగ్‌ నటన కూడా తేలిపోయింది. నటనలో ఏమాత్రం సహజత్వం కనిపించదు. దీనికితోడు రొడ్డకొట్టుడు కామెడీ. ఇంటర్వెల్‌కి ముందు శ్మశానం ఎపిసోడ్‌ బాగా నవ్విస్తుంది. ఒకరినొకరు దెయ్యాలుగా భావించి భయపడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత మళ్లీ బలవంతపు కామెడీ స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ వరకు ఇది కొనసాగుతుంది. గెస్ట్ హౌజ్‌లో అమ్మాయి, ఈ నలుగురు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. ఆయా సన్నివేశాల్లో `అపరిచితుడు`, `చంద్రముఖి`, `అరుంథతి` వంటి అనేక సినిమాల సీన్లు కళ్ల ముందు కదలాడుతుంటాయి. 

Katha Kanchiki Manam Intiki Review

చివరల్లో తమని కాపాడే పెద్దే తమని మానవ మృగాలకు ఆమ్మేస్తున్నాడనే సందేశం, సెంటిమెంటల్‌ కాన్సెప్ట్ కాస్త కదిలించేలా ఉన్నా? దాదాపు ప్రతి హర్రర్‌ సినిమాల్లో ఇలాంటి సంఘటనలనే చూపించడంతో ఆ పాయింట్‌ కూడా తెరపై తేలిపోయింది. దీంతో ఇంటర్వెల్‌ ముందు వచ్చే కామెడీ, గెస్ట్ హౌజ్‌లోని కొన్ని సన్నివేశాలు తప్ప మరేది ఆకట్టుకోలేకపోయాయి. హర్రర్‌ కథలను హాలీవుడ్‌ చిత్రాలను చూసి కాపీ కొట్టి రాస్తుంటారనే సెటైర్లు వేసి మరీ ఈ చిత్రంలోనూ అలానే కాపీ కొట్టడం గమనార్హం. 
 

నటీనటులుః 
హీరోగా నటించిన త్రిగుణ్‌ నటన చాలా వరకు తేలిపోయింది. విసుగు పుట్టించింది. అయినా సినిమాని తన భుజాలపై వేసుకున్నాడని చెప్పొచ్చు. దీక్ష పాత్రలో పూజిత ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రకి సరైన డైరెక్షనే లేదు. ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో అర్థమే కాదు. మరోవైపు రైటర్‌గా ఆర్జే హేమంత్‌  మెప్పించారు. ఆయన భార్యగా శ్యామల ఫర్వాలేదనిపించింది. దొంగగా గెటప్‌ శ్రీను కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయించాడు. గెస్ట్ హౌజ్‌లో అమ్మాయిగా సాహితి బాగా చేసింది. మహేష్‌ మంజ్రేకర్‌ పాత్రలో ఈజ్‌ లేదు. సప్తగిరి గెస్ట్ గా రొటీన్‌గానే చేశాడు. వినోద్‌ కుమార్‌ ఇంట్రడక్షన్‌ పాటలో మెరిశారు. 

సాంకేతిక వర్గం పనితీరుః 
దర్శకుడు చాణక్య రొటీన్‌ హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్ ని ఎంచుకుని మిస్టేక్‌ చేశారనే చెప్పాలి. కథని బలంగా రాసుకోలేకపోవడమే కాదు, సినిమాని ఎంగేజింగ్‌గా తీయలేకపోయారు. కొన్నిసన్నివేశాల్లోనే మెప్పించాడు. చాలా చోట్ల ఆయన టేకింగ్‌ చాలా తేలిపోయింది. కెమెరా పనితీరు సైతం మైనస్‌గా చెప్పొచ్చు. విజువల్స్ లో క్వాలిటీ లేదు. భీమ్స్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటర్‌ చేతులేత్తేశాడనే ఫీలింగ్‌ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ పెద్దగా కనిపించవు. 
 

ఫైనల్‌గా రొటీన్‌ హర్రర్‌ కామెడీ చిత్రాల జాబితాలో `కథ కంచికి మనం ఇంటికి` సినిమా కూడా చేరిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పేరు మార్చుకుని సక్సెస్‌ కొట్టాలన్నా త్రిగుణ్‌ కోరిక నెరవేరలేకపోయింది.

రేటింగ్‌ః 2.25

నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు.
డైరెక్టర్: చాణక్య చిన్న
మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి: వైయస్ కృష్ణ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
ఫైట్స్: షావోలిన్ మల్లేష్
ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి

Latest Videos

click me!