
కార్తీక దీపం 2 సీరయల్ బుధవారం ఎపిసోడ్ లో 2 గంటలు టైం ఎందుకు బ్రదర్ అని అడుగుతాడు కార్తీక్. చెప్పడానికి ఇబ్బందిగా ఉంది బ్రదర్ అంటాడు సూరజ్. ఎవ్వరినైనా కలవడానికి వెళ్తున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. అవును శనీశ్వరుణ్ని కలవడానికి వెళ్తున్నాను అంటాడు సూరజ్. నాకు దోషం ఉంది. అందుకే కొన్ని సంబంధాలు చూసిన రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అంత సవ్యంగా జరగాలని దోష నివారణ పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు సూరజ్. నీకు ఇష్టమైన ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను వెళ్లి మాట్లాడి, మీ పెళ్లి చేస్తాను అంటాడు కార్తీక్.
వద్దు బ్రదర్ దోష నివారణ చేయించకపోతే పెళ్లి అయిన వాళ్ల మీద వ్యామోహం కలుగుతుందని పంతులుగారు చెప్పారు. అని జ్యోత్స్న మాటలనే పంతులు చెప్పినట్లు చెప్తాడు సూరజ్. రేపు శని త్రయోదశి.. రేపు పూజ చేయించుకుంటే మంచిది అందుకే వెళ్తున్నాను అని సూరజ్ చెప్పగానే.. రేపు మనం కూడా గుడికి వెళ్తాం అంటాడు శివన్నారాయణ. ఎందుకండి అని అడుగుతుంది పారు. జ్యోత్స్నకు కూడా దోషం ఉందని పంతులు గారు చెప్పారు. ఏర్పాట్లు చేయి సుమిత్ర మనం కూడా వెళ్దాం అంటాడు శివన్నారాయణ. కార్తీక్, దీప వెళ్తామంటే భోజనం చేసి వెళ్లమంటాడు శివన్నారాయణ. సూరజ్ ని కూడా వాళ్లతోపాటు భోజనం చేయమంటాడు. ఆ మాట విని షాక్ అవుతుంది జ్యోత్స్న.
మరోవైపు మాలిని దగ్గరకు హోటల్ ఓనర్ బాలా కోపంగా వస్తాడు. నా హోటల్ లో చెఫ్ లు అందరినీ డబ్బులిచ్చి కొనేశారు. ఇప్పుడు నేను హోటల్ ఎలా రన్ చేయాలి, మర్యాదగా మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోండి అంటాడు. నాకు అవసరం వచ్చింది. వాళ్లకు అవకాశం వచ్చింది అని పొగరుగా సమాధానం చెప్తుంది మాలిని.
నీ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి చెఫ్ లను అక్కడే ఉంచుకోగలను అంటాడు బాలా. అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. హోటల్ పై రాళ్లతో దాడి చేస్తున్నట్లు ఆ ఫోన్ సారాంశం. ఎవరు చేస్తున్నారని షాక్ అవుతాడు బాలా. రాళ్లకు బదులు అగ్గిపుల్ల విసిరితే హోటల్ పోయి బూడిదే మిగులుతుందని బెదిరిస్తుంది మాలిని. బాలాకి హోటల్ అమ్ముకోవడం తప్పా, వేరే అవకాశం లేకుండా చేస్తుంది మాలిని.
మీరు ఇస్తానన్న రూ. 4 కోట్లు ఇవ్వండి. అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను అంటాడు బాలా. అగ్రిమెంట్ మీద రూ. 2 కోట్లు ఉంటుంది. అదేంటి, రూ.4 కోట్లు అన్నారు కదా.. అని షాక్ అవుతాడు బాలా. నేను అడిగినప్పుడు ఇస్తే రూ. 4 కోట్లు. నువ్వే అమ్ముతున్నావు కాబట్టి రూ. 2 కోట్లు. నీకు వేరే ఆప్షన్ లేదు అంటుంది మాలిని. బాలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి వెళ్తుంటే.. దక్షిణమూర్తి లోపలికి వస్తాడు.
ఆయన ఎందుకు వచ్చారు అని అడుగుతాడు దక్షిణమూర్తి. అతని హోటల్ మనకు అమ్మేశాడు మామయ్య అంటుంది మాలిని. సరే అమ్మ చూసుకో, నాకు కొడుకైనా, కోడలైనా నువ్వే అంటాడు దక్షిణమూర్తి. హోటల్ ఓనర్ బాలాను బ్లాక్ మెయిల్ చేసిన విషయం దాచేస్తుంది మాలిని. ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేశాను. ఇక ఎదురు పడటమే మిగిలింది అని శివన్నారాయణ ఫ్యామిలీని ఉద్దేశించి అంటుంది మాలిని.
ఇంకోవైపు శివన్నారాయణ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. జ్యోత్స్న మాత్రం భోజనానికి కూర్చోదు. నువ్వు కూడా కూర్చోమని కార్తీక్ అడిగితే, సూరజ్, దీప వాళ్లతో కూర్చోవడం ఇష్టంలేక, అది బయటకు చెప్పకుండా నేను వడ్డిస్తాను అని కవర్ చేస్తుంది జ్యోత్స్న. ముందుగా నేను ప్రియమైన దీపకు వడ్డిస్తాను అనగానే షాక్ అవుతాడు కార్తీక్.
దీపకు పప్పు వద్దు అంటాడు కార్తీక్. అయితే సూరజ్ కి వడ్డిస్తాను అని సూరజ్ షర్ట్ పై పప్పు పోస్తుంది జ్యోత్స్న. చేతకాని పనులు చేయడం అవసరమా.. అని జ్యోత్స్నపై అరుస్తుంది సుమిత్ర. కావాలని ఎవ్వరైనా పప్పు ఒలకపోస్తారా.. అని ఇండైరెక్ట్ గా జ్యోకు గట్టిగా తగిలేలా కౌంటర్ ఇస్తాడు సూరజ్. ఆ తర్వాత షర్ట్ క్లీన్ చేసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు.
జ్యోత్స్న, పారు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పప్పు ఒలకపోసి రివేంజ్ తీర్చుకున్నానని అనుకుంటున్నావు కానీ.. వాడు సారీ వద్దు అన్నాడు అంటే ఏదో చేయబోతున్నాడని అర్థం అంటుంది పారు. వాడి బొంద. వాడేం చేస్తాడు.. నేను ఇచ్చిన దానికి షాక్ లో ఉంటాడు. షర్ట్ ఉతుక్కుంటూ ఉండి ఉంటాడు అని అంటుంది జ్యోత్స్న. అప్పుడే సూరజ్ జ్యోకి కాల్ చేసి వీడియో ఆన్ చేస్తాడు.
ఏంట్రా కాల్ చేశావ్.. షర్ట్ ఎలా ఉతుకుతున్నావో చూపిస్తావా అని అంటుంది జ్యోత్స్న. లేదు మీ గుర్తుగా మీరు పప్పు పోసిన షర్ట్ అలాగే ఉంచుకున్నా. వెదర్ చల్లగా ఉందని చలిమంట వేసుకుందామని అనుకుంటున్నా అంటాడు సూరజ్.
నాకెందుకు చెప్తున్నావ్ అంటుంది జ్యోత్స్న. నేను మంట వేసుకునే మెటీరియల్ ఏంటో చూడండని జ్యోత్స్న శారీ చూపిస్తాడు సూరజ్. దాని కాస్ట్ లక్ష యాభైవేల రూపాయలు రా అని చెప్తుంది జ్యోత్స్న. మీ శారీకి ఏం కాకూడదంటే మీరొచ్చి నా షర్ట్ ఉతకాలి అంటాడు సూరజ్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.