సినిమా అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చిన నటుడు Kamal Haasan. కమర్షియల్ సినిమాలను, సందేశాత్మక చిత్రాలను, ఆర్ట్ చిత్రాలను, కామెడీ చిత్రాలను, యాక్షన్ చిత్రాలను, ప్రయోగాత్మక చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లని మనం వేర్వేరుగా చూస్తుంటాం. ఇందులో చాలా సందర్భాల్లో ఏదో ఒకటి రెండు మాత్రమే కలిసి ఉంటాయి. అలాంటి చిత్రాలు సక్సెస్ అవుతుంటాయి. కానీ ఈ జోనర్స్ కలిపితే అది కమల్ హాసన్ సినిమా అని చెప్పొచ్చు.
విశ్వ నటుడు కమల్ హాసన్(Kamal Haasan Birthday).. నేడు(నవంబర్7న) తన 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు నటనలోనే జీవించిన కమల్ పుట్టిన రోజంటే ఇండియన్ సినిమా పులకరించిపోతుందని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన నటనలో ఇండియన్ సినిమాకి ప్రతిబింబంగా నిలిచారు. తన విలక్షణ నటనతో యావత్ ఇండియన్ ఆడియెన్స్ ని మాత్రమే కాదు, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా అలరించారు. అలరిస్తున్నారు.
కమల్ చిత్రాల్లో అన్ని జోనర్లు మేళశింపుగా ఉంటాయి. కమర్షియల్ అంశాలను, ఫ్యామిలీ ఎలిమెంట్లని, సందేశాన్ని, ఆర్ట్ ని, కామెడీని, యాక్షన్, ప్రయోగాత్మకంగా చేయడంలో సక్సెస్ సాధించారు కమల్. అందుకే ఆయన ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడుగా నిలిచిపోయారు. జనరల్‌గా ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. కానీ కమల్ సినిమాలో మాత్రం ఇలాంటి అన్ని ఎలిమెంట్లని మనం చూడొచ్చు. సహజత్వం, కమర్షియాలిటీ, సందేశం, కామెడీని, యాక్షన్ మేళవించి ఆయన చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఆయా చిత్రాలు ఇండియన్ సినిమాలో స్థానం సంపాదించాయి.
ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ నటుడిగా చేయని ప్రయోగాలంటూ లేవు. `దశావతారం` చిత్రంలో ఏకంగా పది పాత్రలు పోషించి ఆశ్చర్యానికి గురి చేశారు. చరిత్ర సృష్టించారు. అంతేకాదు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా, రైటర్‌గా ఇలా అనేక విభాగాల్లో ఆయనకు మంచి పట్టుంది. మొత్తంగా సినిమాని అవలీలగా అవపోసన పట్టిన నటుడు కమల్ హాసన్. ఇండియన్ సినిమాలో ఆయనొక అరుదైన నటుడిగా నిలిచారు.
ఇదిలా ఉంటే కమల్‌కి ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. ఆయన్ని స్టార్ యాక్టర్స్ సైతం కొత్త విభిన్న పేర్లతో పిలుస్తున్నాయి. ఆయన్ని సంభోదిస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్‌ని అలా వర్ణిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కమల్ ఒక సినిమా పుస్తకం అని, కమల్ ఒక యాక్టింగ్ లైబ్రరీ అని, కమల్ ఒక సినిమా వికీపీడియా అని, కమల్ ఒక 24 క్రాఫ్ట్స్ అని, కమల్ ఒక యాక్టింగ్ స్కూల్ అని, కమల్ ఒక నట విశ్వరూపం అని.. మొత్తంగా కమల్ ఒక కంప్లీట్ యాక్టర్ అని సంభోదిస్తున్నారు. ఇలా రకరకాలుగా వర్ణిస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కమల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా యూనివర్సల్ నటుడు ఆస్తులు వివరాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ యూనివర్సల్ యాక్టర్‌కి ప్రస్తుతం దాదాపు 177కోట్ల విలువైన ఆస్తులున్నాయట. అందులో స్థిరాస్తుల విలువ రూ. 132కోట్లు ఉంటాయని, చరాస్తుల విలువ 45కోట్లు ఉంటాయని తెలుస్తుంది.
కమల్‌కి చెన్నైతోపాటు లండన్‌లోనూ ఇల్లు ఉందట. దాని విలువ రెండున్నర కోట్లు ఉంటుందట. అలాగే 2.7కోట్ల విలువైన లగ్జరీ కారు ఉంది. రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉంది. అంతేకాదు తనకు 50కోట్ల అప్పులు కూడా ఉన్నాయట. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కమల్ ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో కొయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందులో ఈ వివరాలు పేర్కొన్నారు. `మక్కల్ నీది మయ్యం` అనే పార్టీని స్థాపించి కమల్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ నుంచి ఒక్క సీటు గెలవలేదు.
కమల్ తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. ఆయనకు మరిన్ని భాషలపై మంచి అవగాహణ ఉంది. కానీ కమల్ ఎంత వరకు చదువుకున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఆయన కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారట. ఆయన పుట్టిన ఆరేళ్లకే నటనని ప్రారంభించారు. దీంతో చదువు కంటే నటనపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. అలా చదువుని లైట్ తీసుకున్నారు.
1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో `కలత్తూర్ కన్నమ్మ` అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. 1974లో మలయాళంలో వచ్చిన `కన్యాకుమారీ` కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన `పదనారు వయదినిలె` కమల్ హాసన్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
1978లో `మరో చరిత్ర`తో కమల్ కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. ఇందులో కమల్, సరితల నటన ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. 1983లో కమల్, శ్రీదేవి జంటగా బాలుమహేంద్ర దర్శకత్వంలో `మూన్రాంపిరై ` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని `వసంత కోకిల`గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా అవార్డుని అందుకున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో చేసిన `నాయకుడు` మూవీలో నటనకుగాను రెండోసారి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన `భారతీయుడు` సినిమాతో మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఆర్ట్ సినిమాలోని నాచురాలిటీ.. కమర్షియల్ సినిమాలోని సేలబులిటీ రెండిటినీ మిక్స్ చేసి సరిహద్దు రేఖల్ని చెరిపేశాడు. సినిమా అంటే ఓ కళారూపం అన్న సత్యాన్ని తెలియజెప్పాడు. ప్రాంతాలు, భాషలు అనే అడ్డుగోడల్ని కూల్చేశాడు. సినిమా చుట్టూ అల్లిన ఫార్మాట్‌ని బ్రేక్ చేసి నిజమైన నాయకుడిగా నిలబడ్డాడు. లోక నాయకుడిగా ఎదిగాడు.
కమల్ తన కెరీర్‌లో `నాయకుడు`, `ఆకలిరాజ్యం`, `స్వాతిముత్యం`, `శుభసంకల్పం`, `బ్రహ్మచారి`, `తెనాలి`, `ఇంద్రుడు చంద్రుడు`, `సాగర సంగమం`, `పుష్పక విమానం`, `అపూర్వ సహోదరులు`, `క్షత్రియ పుత్రుడు`, `భారతీయుడు`, `దశావతారం`,`విశ్వరూపం`, `ఉత్తమ విలన్` వంటి చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు `విక్రమ్` సినిమాతో రాబోతున్నారు.
నాయకుడుగా నటించినా.. బ్రహ్మచారిగా కనిపించినా.. తెనాలిగా మెప్పించినా.. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నా.. అది కమల్‌కే చెల్లింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్. కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు.
Bigg boss tamil
కమల్ హాసన్ నటనతోపాటు టీవీ రంగంలోనూ రాణిస్తున్నారు.ఆయన తమిళ `బిగ్‌బాస్` రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆయన కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.