
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. చాలా కాలంగా ఇది రన్ అవుతుంది. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలే రీ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
స్ట్రెయిట్ మూవీస్ పెద్దగా లేకపోవడంతో, రీ రిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకుంది. పైగా ఈ మూవీస్ మంచి వసూళ్లని రాబడుతుండటం విశేషం. అందుకే ఒకప్పుడు హిట్ అయిన మూవీస్‌ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.
ఒకప్పుడు రాంగ్ టైమ్‌లో వచ్చి పెద్దగా ఆకట్టుకోని మూవీస్‌ని కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల `ఖలేజా` మూవీ అలానే కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక జులైలో చాలా సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో సమంత-నాగచైతన్యల మూవీ, రెండు సూర్య చిత్రాలు, రవితేజ మూవీ, రాజ్ తరుణ్ చిత్రాలున్నాయి.
జులై 10న రాజ్ తరుణ్, హెబా పటేల్ కలిసి నటించిన `కుమారి 21ఎఫ్` చిత్రం విడుదల కానుంది. ఈ మూవీని సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించాడు.
ఈ మూవీ 2015 నవంబర్ 20న విడుదలైంది. రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. యూత్‌ని తెగ ఆకట్టుకుంది. అంతేకాదు ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచింది. ఈ మూవీని దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేస్తుండటం విశేషం.
జులై 11న మాస్ మహారాజా రవితేజ నటించిన `మిరపకాయ్` మూవీ విడుదల కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేత్ హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీ 2011 జనవరి 13న విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడింది. కానీ ఇందులోని మాస్ ఎలిమెంట్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
జులై 18న రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అందులో సమంత, నాగచైతన్యలు నటించిన తొలి చిత్రం `ఏమాయ చేసావె` విడుదల కాబోతుంది. గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.
లవ్ స్టోరీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. 2010 ఫిబ్రవరి 26న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 15ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీతోనే సమంత, నాగచైతన్యల మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసి పెళ్లి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వెండితెరపైకి రాబోతుండటంతో సామ్, చైతూ ఫ్యాన్స్ లో ఒకరకమైన ఆసక్తి ఏర్పడింది.
అప్పట్లో ఈ మూవీ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు, మరి ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.
జులై 18న కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన `గజిని` రీ రిలీజ్ కాబోతుంది. ఏఆర్ మురుగదాస్ రూపొందించిన ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ 2005లో విడుదలై సంచలన విజయం సాధించింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆ స్థాయిలో అలరిస్తుందా అనేది చూడాలి.
ఒక్క రోజు గ్యాప్‌తోనే సూర్య నటించిన మరో సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సూర్య, తమన్నా కలిసి నటించిన `వీడొక్కడే` జులై 19న రీ రిలీజ్ కాబోతుంది. దీనికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ఈ చిత్రం 2009లో విడుదలైంది. యావరేజ్‌గా ఆడింది. ఇప్పుడు దీన్ని మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.