
సహజ నటి జయసుధ ఇండియన్ సినిమాని శాషించిన నటీమణుల్లో ఒకరు. మొదటి తరం నటుల నుంచి ఇప్పటి తరం నటుల సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో జయసుధ తన వ్యక్తి గత విషయాలపై ఓపెన్ అయ్యింది.
జయసుధ భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరిగింది. దానికి జయసుధనే కారణమనే వార్తలు వినిపించాయి. ఇప్పటికీ అవే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై జయసుధ స్పందించింది. ఆమె సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాలను పంచుకుంది.
నితిన్ కపూర్ ఆత్మహత్యకు తాను కారణం కాదని చెప్పింది. తాను సినిమాలు నిర్మించడం వల్ల నష్టపోయిందనేది వాస్తవం కాదని, అప్పులు ఉన్నాయి. కానీ అవి డిప్రెషన్‌లోకి వెళ్లి, తీర్చలేనంతవి కావు, అసలు అప్పులు అనేది తమకు పెద్దసమస్యనే కాదు అని వెల్లడించింది జయసుధ. అప్పులు వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో లేమని వెల్లడించింది.
ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది జయసుధ. తన భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుంటాడని తనకు ముందే తెలుసని వెల్లడిచింది. వారి ఫ్యామిలీలో చాలా మంది అలా ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్ల అన్న, అత్తగారి ఫ్యామిలీలో ఇద్దరు ఆడపడుచులు కూడా ఇలానే ఆత్మహత్య చేసుకున్నారని, ఏదైనా ప్రెజర్‌గా అనిపిస్తే వాటిని హ్యాండిల్ చేయలేరని ఇలా సూసైడ్‌కి పాల్పడతారని, అదే వారి ఫ్యామిలీ ముందు నుంచి వస్తుందని తెలిపింది.
తన భర్త కూడా ఆత్మహత్య చేసుకుంటాడని భావించినట్టు తెలిపింది. `ఇంట్లో సమస్యలున్నాయి. చాలా రోజులుగా అవి నడుస్తున్నాయి. దీంతో ఆయన ఇలాంటి పని(సూసైడ్) చేసుకుంటాడని మాకు తెలుసు. ఇప్పుడు, అప్పుడా, మేం ఉన్నప్పుడా, లేనప్పుడా అనేది తెలియదు కానీ, ఆయన సూసైడ్ చేసుకుంటాడని పరిస్థితులు అర్థమయ్యాయి. కానీ కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మేం లేని సమయంలో ఆయన ఈ పని చేశాడు` అని వెల్లడించింది జయసుధ. వారి ఫ్యామిలీలో ఉన్న సైకలాజికల్ సమస్య, ఇంట్లో సమస్యలు కారణమని, తాను గానీ, అప్పులు గానీ కారణం కాదని వెల్లడించింది జయసుధ.
నితిన్ కపూర్ ఆత్మహత్య తర్వాత షాక్‌లోకి వెళ్లినట్టు చెప్పింది జయసుధ. మూడు నెలలు పెద్ద షాక్‌లో ఉన్నానని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండగా ఉన్నారని, చాలా సపోర్ట్ చేశారని తెలిపింది. అయితే ఆ సమయంలోనే సినిమా షూటింగ్ ఆఫర్లు వచ్చాయని, వాటికి కమిట్ కావడం వల్ల కొంత మర్చిపోయే అవకాశం వచ్చిందని, కానీ ఇంటికివెళ్లాక అవే జ్ఞాపకాలు వెంటాడేవి అని వెల్లడించింది. లాక్ డౌన్‌లో మరింత ఒంటరి ఫీలింగ్ కలిగిందని వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ జితేంద్ర కపూర్ కజిన్ అయిన నితిన్ కపూర్ నిర్మాతగా అనేక సినిమాలు చేశారు. ఏఎన్నార్‌తో `ఆది దంపతులు`, `కాంచన సీత`, `కలికాలం`, `మేరా పత్ని సర్ఫ్ మేరా హై`, `అదృష్టం`, `వింతకోడలు`, `హ్యాండ్సప్` వంటి చిత్రాలను నిర్మించారు. చాలా వరకు ఆయన నష్టాలపాలయ్యారు.