కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో తరచుగా ఆరోపణలు వింటూనే ఉంటాం. మీటూ సమయంలో చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా చాలా మంది, దర్శకులు, నటులపై ఆరోపణలు చేశారు. క్రేజీ హీరో అర్జున్ లాంటి వాళ్ళు కూడా వివాదంలో చిక్కుకున్నారు. నటి శృతి హరిహరన్.. అర్జున్ సర్జా తనని లైంగికంగా వేధించారు అంటూ ఆరోపించింది. షూటింగ్ సమయంలోనే లైంగికంగా తనతో అసభ్యంగా ప్రవర్తించారు అని ఆరోపించింది. అప్పట్లో ఆమె ఆరోపణలు సంచలనం అయ్యాయి. కొందరు శృతి హరిహరన్ కి మద్దతు తెలుపగా.. మరికొందరు అర్జున్ కి సపోర్ట్ చేశారు. అర్జున్, జగపతి బాబు మంచి స్నేహితులు.
వీరిద్దరూ హనుమాన్ జంక్షన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అర్జున్ పై వచ్చిన ఆరోపణలపై జగపతి బాబు స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలు బేస్ లెస్ అని జగపతి బాబు కొట్టిపారేశారు. పబ్లిసిటీ కోసం కొందరు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు అని జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుండొచ్చు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇష్టంతోనే అవకాశాల కోసం అంగీకరించి ఉండొచ్చు.
కానీ అర్జున్ విషయంలో వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదు అని జగపతి బాబు అన్నారు. మీపైన భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం లేదా అని యాంకర్ ప్రశ్నించారు. జగపతి బాబు సమాధానం ఇస్తూ.. ఎవరైనా కావాలని ఆరోపణలు చేస్తే చేసుకోవచ్చు అంటూ సరదాగా బదులిచ్చారు. తాను అమ్మాయిలని రక్షించే వ్యక్తిని కానీ ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు అని అన్నారు.
గతంలో నాతో నటించిన హీరోయిన్ ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడను. ఆమెకి బాలీవుడ్ లో వివేక్ ఒబెరాయ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ విషయం నాతో చెప్పింది. వివేక్ ఒబెరాయ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కాబట్టి ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. మరుసటి రోజు కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు లుక్ టెస్ట్ కోసం ఆమెని ముంబై రమ్మన్నారు. నాకు ఎక్కడో తేడాగా అనిపించింది. చాలా అనుమానాలు వచ్చాయి. దీనితో ఆమెతో నువ్వు వెళ్లొద్దు అని చెప్పా.
వివేక్ ఒబెరాయ్ పక్కన నటించడం అంటే ఎంత మంచి ఛాన్స్.. దానిని వదులుకోమంటావా.. నేను ఎదగడం నీకు ఇష్టం లేదా.. నా కెరీర్ నాశనం చేస్తున్నావు అంటూ నన్ను తిడుతూ గొడవ పెట్టుకుంది. నిందలు మోస్తూ, ఆమెతో తిట్లు తింటూ ముంబై వెళ్లకుండా అడ్డుకున్నాను. మరుసటి రోజు న్యూస్ లో ఆ కాస్టింగ్ ఏజెన్సీ ఫేక్ అని.. వాళ్ళు అమ్మాయిలని అత్యాచారం చేసి పాకిస్తాన్ లాంటి దేశాలకు తరలించే గ్యాంగ్ అని న్యూస్ లో వచ్చింది. ముంబై పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ విధంగా తాను ఆ హీరోయిన్ ని కాపాడినట్లు జగపతి బాబు పేర్కొన్నారు. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీలో లేదని.. పెళ్లి చేసుకుని సెటిల్ అయినట్లు జగ్గూభాయ్ తెలిపారు. ఆమె పేరుని మాత్రం జగపతి బాబు బయటకి చెప్పలేదు.