జబర్దస్త్ కమెడియన్ కి ప్రభుత్వ ఉద్యోగం.. 25 ఏళ్ల కల.. సొంతూరికే టీచర్ గా గణపతి మాస్టర్

First Published | Apr 29, 2023, 1:30 PM IST

‘జబర్దస్త్’ కమెడియన్ గా అలరించిన గణపతి  మాస్టర్ (Ganapathi Master) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాడు.  ఆయన 25 ఏళ్ల  నాటి కల తాజాగా నెరవేరింది.  సొంతూరిలోనే ప్రస్తుతం టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 
 

‘జబర్దస్త్’ కమెడియన్ గా గణపతి  మాస్టర్ బుల్లితెర ఆడియెన్స్ కు  బాగా పరిచయమే. ఎన్నో వందల స్కిట్లతో అలరించిన గణపతి మాస్టర్ ప్రస్తుతం జబర్దస్త్ వేదికకు దూరమయ్యారు. అందుకు కారణంగా  ఆయనకు ప్రభుత్వం ఉద్యోగం రావడమే.  ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో ఆయన టీచర్ గా మారారు. 
 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని ఆముదలవలస మండలం సంత కొత్తవలసకు చెందిన పేడాల గణపతి మాస్టర్ 1998లో డీఎస్సీ రాశారు. ఉద్యోగం రాకపోవడంతో స్థానికంగానే ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు నేర్పించారు. ఈక్రమంలోనే నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ లోని శ్రీనగర్ కు చేరారు. అక్కడ టీచర్ గా కొనసాగుతూనే సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. 
 

Latest Videos


తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణపతి మాస్టర్ ఆసక్తికరంగా స్పందించారు.. ‘1998లో రాసిన డీఎస్సీకి గాను తాజాగా ఉద్యోగం దక్కింది. ఉద్యోగం రాకముందు, జబర్దస్త్ లోకి రాకముందు ఇంటి వద్దే టీచర్ గా నటించాను. మా ఇంట్లో వాళ్లు,  ఊర్లోనూ నాటకాలు వేస్తుండే వారు అలా  నటనపై ఆసక్తి పెరిగింది. 
 

డీఎస్సీ రాసిన తర్వాత.. నటనపై ఆసక్తి కూడా ఉండటంతో అన్నపూర్ణ స్టూడియో దగ్గర్లోనే దిగాను.  అక్కడ కూడా టీచర్ గా వర్క్ చేశాను. షకలక శంకర్ అన్న ద్వారా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత అదిరే అభి, హైపర్ ఆది టీమ్ లలో నటించాను. అంతకు ముందే ‘లవ్ యూ బంగారం’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. 2013 నుంచి కొనసాగాను. 
 

సినిమాలపై, నటనపై ఆసక్తిగా ఉన్నప్పటికీ.. టీచర్ వ్రుత్తిపై నాకున్న గౌరవమే ఇంటికి తిరిగి వచ్చేలా చేసింది. అందులోనూ మా ఊరిలోనే  ఉద్యోగం రావడం సంతోషం. సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ కూడా ఉండటంతో వీలైనప్పుడు నటుడిగానూ అలరించేందుకు ప్రయత్నిస్తాను. 

ఇక తను టీచర్ గా కొనసాగుతున్న ఈసమయంలోనూ సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. సమయం చూసుకొని వెళ్లేందుకు, సమ్మర్ హాలీడేస్ లో వెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక రామమూర్తి అనే మాస్టర్ తనకు అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు చేస్తుంటారని చెప్పుకొచ్చారు.  

click me!