టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ చిత్రాల్లో సెంటిమెంట్లని కూడా పరిగణలోకి తీసుకుంటారు. టాలీవుడ్ లో రాజమౌళి సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. రాజమౌళి అన్ని చిత్రాలు హిట్లే. ఇది పక్కన పడితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోల తదుపరి చిత్రం తప్పకుండా డిజాస్టర్ అవుతోంది.
స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్టీఆరే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ కి స్టూడెంట్ నంబర్ 1 తర్వాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా.. ప్రభాస్ కి ఛత్రపతి తర్వాత పౌర్ణమి..బాహుబలి తర్వాత సాహూ.. రాంచరణ్ కి మగధీర తర్వాత ఆరెంజ్ ఇలా డిజాస్టర్లు ఎదురయ్యాయి.
వీళ్లంతా రాజమౌళి సెంటిమెంట్ నుంచి కోలుకుని త్వరగానే పిక్ అప్ అయ్యారు. త్వరగానే మరో హిట్ అందుకున్నారు. కానీ ఒక్క హీరో కెరీర్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ తో ఆల్మోస్ట్ ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ హీరోకి రాజమౌళి సినిమా తర్వాత 12 ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ హీరో ఎవరో కాదు నితిన్.
నితిన్, రాజమౌళి కాంబినేషన్ లో 2004లో సై చిత్రం వచ్చింది. రగ్బీ క్రీడ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యువతని విపరీతంగా ఆకర్షించింది. ఈ చిత్రంతో నితిన్ మంచి విజయం అందుకున్నాడు. సై తర్వాత నితిన్ కి దాదాపు 8 ఏళ్ళు ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా లేదు. 8 ఏళ్ళల్లో 12 సినిమాలు చేశాడు. ఆ 12 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీనితో ఒక దశలో నితిన్ కి సినిమాల పట్ల విరక్తి వచ్చిందట. ఇండస్ట్రీ వదలి వెళ్ళిపోదాం అని అనుకున్నాడట.
చివరి ప్రయత్నంగా విక్రమ్ కుమార్ తో 2012లో ఇష్క్ చిత్రం చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నితిన్ కెరీర్ మళ్ళీ చిగురించింది. ఇష్క్ తర్వాత నితిన్ మంచి విజయాలు అందుకున్నాడు. ఆ విధంగా నితిన్ రాజమౌళి సెంటిమెంట్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యాడు. ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రం.. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు.