'కశ్మీర్ ఫైల్స్'పై కామెంట్స్ తో పెను దుమారం.. ఎవరీ నడవ్ లాపిడ్, ఏ దేశం ?

First Published Nov 29, 2022, 5:49 PM IST

కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా సృష్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు.

Nadav Lapid

కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా సృష్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కశ్మీర్ ఫైల్స్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. 

కశ్మీర్ పండిట్లపై జరిగిన హత్యాకాండని కళ్ళకి కట్టినట్లు చూపించారు అంటూ కొందరు ప్రశంసించగా.. ఇది రాజకీయ ప్రేరేపిత చిత్రం అంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఈ చిత్రం వెనుక బీజేపీకి రాజకీయ అజెండా ఉందంటూ ఇతర పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos


అయితే నిజంగా చరిత్ర తెలిసిన వాళ్ళు, వాస్తవాలు ఎరిగిన వాళ్ళు ఈ చిత్రాన్ని రాజకీయ అజెండా మూవీ అని విమర్శించరు అంటూ చిత్ర యూనిట్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉండగా గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్ర వేడుకల్లో కశ్మీర్ ఫైల్స్ చిత్రం దుమారం రేపింది. 

జ్యూరీ అధ్యక్షుడిగా నడవ్ లాపిడ్ ప్రసంగిస్తూ.. ఇలాంటి ప్రఖ్యాత సినిమా వేడుకలో కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాన్ని ప్రదర్శించడం విచారకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వల్గర్ మూవీ, హింసాత్మక చిత్రం. రాజకీయ ప్రేరేపిత కారణాలతోనే ఈ చిత్రం తెరకెక్కినట్లు అనిపిస్తోంది అంటూ నడవ్ లాపిడ్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. దీనితో అసలు ఇంతకీ ఈ నడవ్ ఎవరు ? ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటూ నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. 

నడవ్ లాపిడ్ ఇజ్రాయెల్ కి చెందిన రచయిత, దర్శకుడు. 1975లో జన్మించిన నడవ్ ఆ దేశంలోనే ఫిలాసఫీ చదివారు. అనంతరం ప్యారిస్ లో లిటరేచర్ పూర్తి చేశారు. 2011లో నడవ్ తెరకెక్కించిన పోలీస్ మెన్ చిత్రానికి లోకర్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2014లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో నడవ్ కి అనుబంధం ఏర్పడింది. 

ఆ ఏడాది నడవ్ తెరకెక్కించిన 'ది కైండర్గార్టెన్ టీచర్' చిత్రానికి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు లభించింది. లాపిడ్ ఇజ్రాయెల్ లో సినిమా కోసం అనేక పోరాటాలు చేశారు. దర్శకుడిగా ఆయన.. ది స్టార్, అహెడ్స్ నీ, సినోనిమ్స్ , లవ్ లెటర్ టూ సినిమా లాంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు. ఇలాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ దర్శకుడు అంతర్జాతీయ భారత చలనచిత్ర వేడుకలో ఈ రకమైన కామెంట్స్ చేయడం దుమారం రేపుతోంది. 

నడవ్ లాపిడ్ కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్లు కూడా పడుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి.. అవి వ్యక్తుల చేత అబద్దాలు కూడా చెప్పిస్తాయి.. అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ లో కీలక పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ కూడా నడవ్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. యూదులపై దారుణమైన మారణహొహం అనుభవించిన వర్గానికి చెందిన దర్శకుడు ఈ రకంగా మాట్లాడడం సిగ్గు చేటు. యూదులపై జరిగిన మారణ హోమం నిజమైతే.. కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం కూడా నిజమే.. ఆయనకి దేవుడు తెలివి ప్రసాదించాలి అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. 

click me!