Oscar 2027: ఆస్కార్ 2027 అర్హత జాబితాలో భారత చిత్రాలు గోంధల్, అంగ్ చోటు దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆస్కార్ బరిలో మన సినిమాలు.. ‘గోంధల్’, ‘అంగ్’ చిత్రాలకు గ్లోబల్ గుర్తింపు
ఆస్కార్ 2027 అవార్డులకు సంబంధించి భారతీయ సినీ రంగానికి ఒక గుడ్ న్యూస్ అందింది. ఈసారి అకాడమీ అవార్డ్స్ రేసులో భారతదేశం నుంచి రెండు సినిమాలు చోటుదక్కించుకున్నాయి. గోంధల్ సినిమాతో పాటు, ఫిల్మ్ మేకర్ థేజా రియో రూపొందించిన అంగ్ సినిమాలు ఆస్కార్ 2027 అర్హత కలిగిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లో పోటీకి అర్హత సాధించిన సినిమాల లిస్టును విడుదల చేసింది.
అకాడమీ విడుదల చేసిన ఈ జాబితాలో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మొత్తం 104 సినిమాలకు చోటు దక్కింది. ఈ విభాగంలో ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు అర్హత సాధించడం ఇప్పటివరకు ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత చిత్రం ‘గోంధల్’ కూడా ఇదే జాబితాలో ఉంది. వీటితో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 190 సినిమాలు, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 38 సినిమాలు పోటీకి అర్హత సాధించినట్లు అకాడమీ ప్రకటించింది.
25
గోంధల్ సినిమా కథ ఏమిటి?
గోంధల్ సినిమా కథ గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సాగుతుంది. ఒకే ఒక్క రాత్రి సమయంలో జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు. రాత్రి వేళ నిర్వహించే సాంప్రదాయ గోంధల్ ఆచారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో సంగీతం, నృత్యం, పౌరాణిక కథలు, మతపరమైన సంప్రదాయాలను ఎంతో అందంగా మేళవించారు. మహారాష్ట్ర జానపద సంస్కృతి, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం, తన ప్రత్యేకమైన కథనం కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
35
థేజా రియో చిత్రం అంగ్ కు కూడా చోటు
ఆస్కార్ రేసులో నిలిచిన రెండో భారతీయ చిత్రం అంగ్. ఈ సినిమాకు థేజా రియో నిర్మాతగా వ్యవహరించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా ఈ సినిమా నేరుగా ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టింది.
ది హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం, వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి మొత్తం 100 సినిమాలను అధికారికంగా పంపించగా, మరో నాలుగు సినిమాలు ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులు గెలుచుకుని ఈ విభాగానికి అర్హత సాధించాయి.
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో జపాన్ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్, నేపాల్ నుంచి ఎలిఫెంట్స్ ఇన్ ది ఫాగ్, పోలాండ్ నుంచి ఫాదర్ల్యాండ్, రొమేనియా నుంచి ఫ్యోర్డ్, స్పెయిన్ నుంచి లా బోలా నెగ్రా సినిమాలు ఉన్నాయి.
వీటితో పాటు ఫ్రాన్స్ నుంచి మినోటార్, దక్షిణ కొరియా నుంచి పాజిబుల్ లవ్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి రిహార్సల్స్ ఫర్ ఎ రెవల్యూషన్ చిత్రాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
55
షార్ట్‌లిస్ట్, నామినేషన్లపైనే అందరి దృష్టి
అర్హత కలిగిన సినిమాల జాబితాలో చోటు దక్కినంత మాత్రాన ఈ సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయినట్లు కాదు. ప్రస్తుతం గోంధల్, అంగ్ సినిమాలు ప్రారంభ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటాయి. ఆ తర్వాత అకాడమీ షార్ట్‌లిస్ట్‌ను విడుదల చేస్తుంది. అనంతరం తుది నామినేషన్లను ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో, భారతదేశానికి చెందిన ఈ రెండు సినిమాలు ఆస్కార్ 2027 తుది నామినేషన్ జాబితా వరకు చేరుకుంటాయా లేదా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.