
కథ:
డాక్టర్ శరవణన్ వైద్యరంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తారు. తన మిత్రుడు డయాబెటిక్ కారణంగా చనిపోవడంతో ఆయన ఈ మహమ్మారికి ముందు కనిపెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. డాక్టర్ శరవణన్ నిర్ణయం మెడికల్ మాఫియా ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉంటుంది.దీంతో శరవణన్ చేసే ప్రయోగం అడ్డుకునే క్రమంలో అతన్ని వ్యక్తిగతంగా,వృతిపరంగా దెబ్బతీస్తారు. సర్వం కోల్పోయిన శరవణన్ మాఫియాపై ఎలా పగ తీర్చుకున్నాడు? తన లక్ష్యం ఎలా సాధించాడు? అనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి...
ఓ చిన్న సినిమా హీరోకి ఉన్న గుర్తింపు లక్ష కోట్లున్న కోటీశ్వరుడుకి ఉండదు. బిజినెస్ మాన్ శరవణన్ అరుళ్ హీరోగా మారాలనే కోరిక వెనుక కారణం ఇదే కావచ్చు. దశాబ్దాల వ్యాపార చరిత్ర కలిగిన శరవణ స్టోర్స్ వారసుడైన శరవణన్ అరుళ్ ది లెజెండ్ మూవీతో హీరోగా మారాడు. కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఎంపిక సరైనదిగా ఉండాలి. వేల కోట్ల అధిపతి అయిన శరవణన్ ఓ అరవై కోట్లు ఖర్చుపెట్టి తన ముచ్చట తీర్చుకున్నారు.
ప్యాషన్, సీరియస్ నెస్ లేని ఓ హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ది లెజెండ్ నిదర్శనం. తలా తోకా లేని కథను నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు, నాలుగు డైలాగ్స్, కొన్ని కామెడీ సన్నివేశాలు అన్న కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించి వదిలారు. ఆత్మ లేని కథకు ఎన్ని హంగులు దిద్దినా అవసరం. ది లెజెండ్ మూవీ కోసం నిర్మించిన భారీ సెట్స్, రిచ్ లొకేషన్స్ ఖర్చును గుర్తు చేశాయే కానీ గొప్ప అనుభూతుని పంచలేదు. పెట్టేవాడు ఉన్నాడు కాబట్టి ఖర్చు పెడదాం అన్నట్లు సినిమా తీశారు.
ఒక స్టార్ హీరో చేయాల్సిన ఫైట్స్, డాన్స్ లు, డైలాగ్స్, ఎమోషన్స్ ది లెజెండ్ మూవీలో శరవణన్ చేశారు. నటనలో ఓనమాలు కూడా తెలియని శరవణన్ ఇవ్వన్నీ సింగిల్ ఎక్స్ప్రెషన్ తో చేసేశాడు. ఓవర్ మేకప్ కావడం వల్లనేమో ఆయన ముఖంలో భావాలు కూడా స్క్రీన్ పై కనిపించడం లేదు. హీరోయిన్ ఊర్వశి రాతెలా సినిమాకు ఒక గ్లామర్ రీజన్ మినహా ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
సీనియర్ నటులు నాజర్, విజయ్ కుమార్, ప్రభు కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయారు. దివంగత నటుడు వివేక్ ఇలాంటి సినిమాతో వీడ్కోలు పలకడం బాధాకరం. స్టార్ కమెడియన్ యోగిబాబు కొంత మేర నవ్వించే ప్రయత్నం చేశారు.
దర్శకులకు తగ్గట్లే సాంకేతిక నిపుణులు అన్నట్లు ఓ రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల చిత్రాలను తలపించారు. కెమెరామెన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ నిరాశపరిచాడు. ఇక దర్శకుల విషయాన్ని వస్తే బలహీనమైన కథ, పట్టులేని స్క్రీన్ ప్లేతో అవుట్ డేటెడ్ కమర్షియల్ మూవీ తెరకెక్కించారు. అవసరం ఉన్నా లేకున్నా సాంగ్స్, ఫైట్స్ తో సినిమాను నింపేశారు. అంచనాలకు అందేలా సాగే కథ ఎక్కడా పుంజుకోలేదు. 2007లో వచ్చిన బ్లాక్ బస్టర్ శివాజీ సినిమాను కాపీ చేసిన భావన కలుగుతుంది.
మొత్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ది లెజెండ్ పూర్తిగా నిరాశపరిచింది. కథ కథనం లేని ఈ మూవీ కేవలం ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ కోసం తీసినట్లు ఉన్నారు. రెండున్నర గంటలు ప్రేక్షకులు థియేటర్స్ లో కూర్చోవడం కష్టమే అని చెప్పాలి. ఇక స్టార్ క్యాస్ట్ కూడా లేని ఈ మూవీ ఫలితం ఊహించడం కూడా కష్టమే.
నటీనటులు: శరవణన్ అరుళ్, ఊర్వశి రాతెలా, నాజర్, ప్రభు, విజయ్ కుమార్, యోగిబాబు, వివేక్ తదితరులు...
డైరెక్టర్స్: జేడీ-జెర్రీ
నిర్మాత: శరవణన్ అరుళ్
మ్యూజిక్: హరీష్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్
ఎడిటర్: రూబెన్
రేటింగ్: 2/5