Pawan, Mahesh
ఏ దర్శకుడి వద్ద ఎలాంటి ప్రతిభ ఉంది అనేది అవకాశం వస్తే కానీ తెలియదు. చాలామంది దర్శకులు తొలి అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డవారే. రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 మూవీ చేస్తున్నప్పుడు, సుకుమార్ ఆర్య చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ స్థాయికి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిభని కూడా బిగినింగ్ లో కొందరు అగ్ర హీరోలు తక్కువగా అంచనా వేశారు. ఆ సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం టీవీ సీరీయల్సా ?
పూరి జగన్నాధ్ కి ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో రఘు కుంచె ఒకరు. పూరి దర్శకుడు కాకముందు ఆయన రూంలో తాను రాసుకున్న కథలు ఎక్కువగా ఉండేవట. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో పూరి టివి సీరియల్స్ డైరెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు అని రఘు కుంచె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షాకింగ్ విషయం ఏంటంటే పూరి జగన్నాధ్.. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథలని టీవీ సీరియల్స్ చేయడానికి రాసుకున్నారట.
సూపర్ స్టార్ కృష్ణ, సుమన్ తో సినిమాలు ఆగిపోయాయి
కొన్ని ఛానల్స్ కి ఆ కథలని వినిపిస్తే రిజెక్ట్ చేశారు. అంతకు ముందే పూరి జగన్నాధ్ దర్శకుడు కావలసింది. సుమన్ తో ఒక సినిమా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో తిల్లానా అనే చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఆ మూవీ నుంచి కూడా కృష్ణ తప్పుకోవడంతో ఆగిపోయింది. దీనితో పూరి టివి సీరియల్స్ చేయాలని అనుకున్నారు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథలని టివి వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే అదే కథలతో పూరి జగన్నాధ్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
Raghu Kunche
పవన్ కళ్యాణ్ బద్రికి ఫ్లాప్ టాక్, పూరి రియాక్షన్
రఘు కుంచె మాట్లాడుతూ..బద్రి చిత్రం రిలీజ్ అయినప్పుడు పూరి జగన్నాధ్ ఒంటరిగా ఆఫీస్ వద్ద పచ్చికపై కూర్చుని ఉన్నారు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. దీనితో పూరి దిగులుగా కూర్చున్నారు. పూరి అన్నా ఏంటి పరిస్థితి అని అడిగా. ఏముందిరా.. మరో సినిమా మొదలుపెట్టడమే అని అన్నాడు. ఏదో అద్భుతం జరిగినట్లు రెండు రోజుల తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ స్వరూపం మార్చేసిన డైరెక్టర్
ఎక్కడ చూసినా నువ్వు నంద అయితే ఏంటి నేను బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. బద్రి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పూరి వెనుదిరిగి చూసుకోలేదు. రవితేజతో ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి క్రేజీ చిత్రాలు చేశారు. పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలనుకున్న సినిమా ఆగిపోయింది. కానీ ఆయన తనయుడు మహేష్ తో పోకిరి చిత్రం తెరకెక్కింది అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలేని మార్చేశారు.