`హరిహర వీరమల్లు` ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే..
డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్రీ టైమ్‌లో తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆయన `హరిహర వీరమల్లు` సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ నుంచి కొత్త ఏడాది సందర్భంగా అప్ డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తుంది. `మాట వినాలి` అంటూ సాగే పాటని ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు.
ఈ విషయాన్ని తాజాగా టీమ్ ప్రకటించింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం. జనవరి 6వ తేదీన ఉదయం 9:06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు.
తుఫానుకి ముందు ప్రశాంతతలా, యుద్ధానికి ముందు చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న యోధుడిలా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ పోస్టర్ లో ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
`డాకు మహారాజ్` మూడో పాట `దబిడి దిబిడి`..
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `డాకు మహరాజ్` చిత్రం నుంచి కొత్త ఏడాది అప్ డేట్ వచ్చింది. మూడో పాటకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. రేపు జనవరి 2న ఈ పాటని విడుదల చేయబోతున్నారు. `దబిడి దిబిడి` అంటూ సాగే ఈ పాటలో బాలయ్యకి జోడీగా ఊర్వశీ రౌతేలా నర్తిస్తుంది. థమన్ సంగీతం అందించారు.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`డ్రింకర్ సాయి` కలెక్షన్ల రచ్చ..
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.
గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "డ్రింకర్ సాయి" సినిమా పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగానూ మంచి ఆదరణ పొందుతుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు అంటే గొప్పవిషయమనే చెప్పాలి.
లవర్‌ని పరిచయం చేసిన సాగర్..
రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయిందని టీమ్ తెలిపింది.
ఇళయరాజా సంగీత సారథ్యంలో ఫస్ట్ టైమ్ పాట రాసిన కీరవాణి..
రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత.
ఈ సినిమాలోని 'ఏదో ఏ జన్మ లోదో' సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. `ఏదో... ఏ జన్మలోదో... ఈ పరిచయం' సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే... ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించగా, ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో కీరవాణి పాట రాయడం ఇదే మొదటి సారి కావడం విశేషం.