Gundamma katha Review : గుండమ్మకథ అసలు హీరో ఎవరు? ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలిపిన అంశాలు ఏంటి? తెర వెనుక ఇంత జరిగిందా?

Published : Aug 17, 2025, 09:57 AM IST

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో  నిలిచిపోయిన క్లాసిక్  సినిమాల్లో గుండమ్మ కథకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈసినిమాలో  తెర ముందు, వెనుక ఎన్నో ట్విస్ట్ లు. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిన గుండమ్మ కథ రివ్యూ  గురించి తెలుసుకుందాం.

PREV
18

మెగా మల్టీ స్టారర్ గుండమ్మ కథ

గుండమ్మ కథ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా. మానవ సంబంధాలు, అనురాగాలు ఆప్యాయతల గురించి వివరించిన సినిమా. అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, తల్లీ కూతుర్ల బంధాల మధ్య ప్రేమను గుర్తు చేసిన సినిమా. ఈసినిమాలో అందరు స్టార్లే. మెగా మల్టీ స్టారర్ మూవీగా భారీ స్థాయిలో గుండమ్మ కథను నిర్మించారు నాగిరెడ్డి చక్రపాణి. కమలాకర కామేశ్వరావు డైరెక్షన్ లో రూపోందిన ఈసినిమా లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావు, ఎస్వీ రంగారావు, సూర్యాకాంతం, సావిత్రి,జమున, హరనాథ్ బాబు, రమణా రెడ్డి, రాజనాల, అల్లు రామలింగయ్య, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి లాంటి స్టార్స్ అంతా ఒక్కచోట చేరి పండగ వాతావరణంలో షూటింగ్ పూర్తి చేసిన సినిమా గుండమ్మ కథ. అంతే కాదు ఎన్టీఆర్ కు ఇది 100 సినిమా కాగా, ఏఎన్నార్ కు ఇది 99 వ సినిమా కావడం విశేషం. మాయాబజార్ ,దానవీర శూర కర్ణ తరువాత ఎక్కువమంది స్టార్స్ నటించిన సినిమా ఇదే. ఈసినిమా కథ వెనుక ఎన్నో విషయాలు విశేషాలు, అద్భుతాలు కూడా జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ తో పాటు ఎంతో మంది స్టార్లు ఉండగా సూర్యకాంతం పాత్ర అయిన గుండమ్మ పేరును టైటిల్ గా పెట్టి ఆశ్చర్యపరిచారు నాగిరెడ్డి చక్రపాణి. ఎంత మంది చెప్పినా ఆయన వినలేదట. సినిమా పోతుంది అన్నా ఆయన భయపడలేదట. సినిమా వచ్చి 63 ఏళ్లు అవుతుంది. 1962 జూన్‌ 7 గుండమ్మ కథ విడుదలయ్యింది. షష్టిపూర్తి చేసుకున్న ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

DID YOU KNOW ?
ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు స్పెషల్ మూవీ
గుండమ్మ కథ సినిమా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఎంతో స్పెషల్. గుండమ్మ కథ ఎన్టీఆర్ కు 100వ సినిమా కాగా ఏఎన్నార్ కు 99వ సినిమా కావడం విశేషం.
28

గుండమ్మ కథ సినిమా కథ విషయానికి వస్తే..

గుండమ్మ కథ సినిమాకు ప్రాణం పోసింది సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రే. మరణించిన జమిందారుకు రెండో భార్యగా, సావిత్రికి సవతి తల్లిగా, జమునకు అసలు తల్లిగా ఆమె చేసిన నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. గుండమ్మ చుట్టూనే ఈసినిమా కథ తిరుగుతుంది. తన సొంత కూతురు సరోజ( జమున) ను గారాబంగా పెంచి, సవతి కూతురు లక్ష్మి( సావిత్రి)ని మాత్రం చిత్రహింసలు పెడుతుంటుంది గుండమ్మ. ఇక సరోజకు పెళ్లి చేయాలని గుండమ్మ చూసినప్పుడల్లా ఆమె అన్న గంటన్న(రమణారెడ్డి) వచ్చినసంబంధాలు అన్నీచెడగొడుతూ ఉంటాడు. అతన్ని తన కొడుకు( రాజనాల)కు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటాడు. ఈక్రమంలోనే రామబద్రయ్య (ఎస్వీ రంగారావు) అనే జమిందారు తన ఇద్దరు కొడుకులు అయిన ఆంజనేయ ప్రసాద్, (ఎన్.టి రామారావు) రాజా (అక్కినేనినాగేశ్వరావు) లకు సబంధాలు చూస్తుంటాడు. సరోజను చూడటానికి ఆయన గుండమ్మ ఇంటికి వచ్చి, పరిస్థితి అంతా గమనిస్తాడు. ఇంటికి వెళ్లి తన కొడుకులకు విషయం చెపుతాడు. అప్పుడు ఇద్దరు కొడుకులు రంగంలోకి దిగి సావిత్రి, జమునలను ఎలా పెళ్లాడారు. అసలు రామబద్రయ్యకు, గుండమ్మ భర్తకు ఉన్న బంధుత్వం ఏంటి? గడసరి సరోజ పొగరు ఏఎన్నార్ ఎలా తగ్గిస్తారు? ఇల్లరికం కాన్సెప్ట్ కాస్తా అల్లుడరికంగా ఎలా మారుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

38

షేక్ స్పియర్ నవల, కన్నడ రీమేక్ కథ

గుండమ్మ కథ సినిమాకు మూలం విలియం షేక్ స్పియర్ రాసిన ''ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ'' అనే నవల నుంచి తీసుకున్నారు. ఈనవల ఆధారంగా కన్నడ లో విఠలాచార్య ''మానే తుంబిడా హెన్ను'' అనే సినిమాను 1958 లో తెరకెక్కించారు. ఈసినిమాకు చక్రపాణి ఎంతో సాయం చేయడంతో... తెలుగు హక్కులను ఆయనకు ఇచ్చారట విఠలాచార్య. అప్పుడే తెలుగులో మంచి కుటంబకథా చిత్రం చేయాలి అనుకుంటున్న నాగిరెడ్డి చక్రపాణికి ఈ కథ దొరికింది. కాని ఈకథను ఇలాగే చేస్తే బాగోదు.. అనుకుని నరసరాజుతో కలిసి కథను తెలుగు ఆడియన్స్ కు అనుకూలంగా తిరగరాశారట. కన్నడ సినిమాలో గుండమ్మ పాత్ర అంత పవర్ ఫుల్ కాదు. ఆమెకు ఆ సినిమాలో భర్త ఉంటాడు. కాని తెలుగులో గుండమ్మను విదవగా చూపించారు. మల్టీ స్టారర్ మూవీకి కావాల్సిన స్టఫ్ అంతా సినిమాలో చేర్చారు నరసరాజు. డైరెక్టర్ గా ఎవర్ని తీసుకోవాలో అర్ధ కాక చాలా కాలం ఆలోచించారట నాగిరెడ్డి చక్రపాణి. బీఎన్ రెడ్డి, సి పుల్లయ్య లాంటివారిని అనుకున్నారు. కాని చివరకు ఆయన కమలాకర కామేశ్వరావును ఎంచుకుని విజయబ్యానర్ పై సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లారు. అయితే అన్ని పాత్రలు కుదిరాయి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సూర్యకాంతం, సావిత్రి ని కూడా ఓకే చేశారు. కాని గడసరి సరోజ పాత్రకు మాత్రం జమున మాత్రమే సెట్ అవుతుంది. కాని అప్పటికే జమునతో సినిమాలు చేయడం మానేశారు ఎన్టీఆర్ ఏఎన్నార్. మూడేళ్లుగా ఆమెను దూరం పెట్టారు. అదే సమయంలో చక్రపాణి రంగంలోకి దిగి, వారిమధ్య రాజీ కుదిర్చి ఈ సినిమాకు ఒప్పించారు. ఈసినిమా టైమ్ లో అందరు స్టార్లు బిజీ షెడ్యుల్స్ లో ఉన్నారు. అయినా సరే ఈమూవీకి టైమ్ కేటాయించి కంప్లీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. గుండమ్మ అనే పేరు కన్నడలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ సినిమా ప్రయత్నాల్లో చక్రపాణి ఉండగా.. ఇండస్ట్రీలో ఎవరు కలిసినా.. గుండమ్మ కథ ఎంత వరకూ వచ్చింది అని అడిగేవారట. దాంతో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఎవరు భయపెట్టినా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు నిర్మాత.

48

గుండమ్మ కథ రివ్యూ..

కుటుంబంలో బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అందరూ కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అంతే కాదు కర్మఫలం అనుభవించక తప్పదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఈసినిమాలో. గుండమ్మ పాత్రలో ఆ డైలాగ్ కూడా చెప్పించారు. సావిత్రిని చిత్రహింసలు పెట్టిన గుండమ్మ, ఆతరువాత కాలంలో దుర్గమ్మ(ఛాయాదేవి) పాత్ర వల్ల అష్టకష్టాలు పడుతుంది. దాంతో సావిత్రిని పట్టుకుని నీకు చేను చేసిన అన్యాయానికి అనుభవిస్తున్నాను అని అంటుంది. తల్లీ కూతుర్లు, భార్య భర్తలు, తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాలను అంద్భుతంగా చూపించింది ఈసినిమా. మరీ ముఖ్యంగా 'గుండమ్మ పాత్రతో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులుపెట్టించారు మేకర్స్. ఇందులో ప్రతీ పాత్ర ఓ ఆణిముత్యమే. గుండమ్మ కథ సినిమా మొత్తం మీద.. ఫలానా సీన్ ఎందుకు పెట్టి ఉంటారు అనే అనుమానం అస్సలు రాదు. పద్దతిగా గోడకట్టినట్టు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు.. ఎంతో అద్భుతంగా సినిమాను చేసుకుంటూ వెళ్ళిపోయారు.

58

నటీనటుల విషయానికి వస్తే..

గుండమ్మ కథ లో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. అంజి అలియాస్ ఆంజనేయ ప్రసాద్ పాత్రలో ఎన్టీఆర్ నటన, కామెడీ టైమింగ్ అద్భుతంగా నటించారు. సావిత్రితో కలిసి ఆయన నటించిన సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్థాయి. అంతే కాదు గుండమ్మ దగ్గర అంజిగా ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రాజా పాత్రలో ఏఎన్నార్ తన మార్క్ నటన, రొమాన్స్‌తో ఆకట్టుకున్నారు. అమాయకమైన, మంచి మనసున్న లక్ష్మి పాత్రలో సావిత్రి నటన హృదయాన్ని హత్తుకుంటుంది. గారాబంగా పెరిగిన గడుసుదనం గల సరోజ పాత్రలో జమున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గుండమ్మ పాత్రలో సూర్యకాంతం జీవించింది. ఈ సినిమాకు ప్రాణం పోసింది గుండమ్మ పాత్ర. ఈసినిమా తరువాత నుంచి సూర్య కాంతం పేరు పెట్టడానికి కూడా జనాలుభయపడేవారట. అంత ప్రభావం చూపించింది గుండమ్మ పాత్ర. అంతలా పండించిన సూర్యాకాంతం ఎన్టీఆర్, ఏఎన్నార్ లకంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పటికీ గడసరి పాత్రలకు ఆమెనే రిఫరెన్స్ గా తీసుకుంటున్నారంటే, సూర్యకాంతం ఎంత బాగా నటించిందో అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో సూర్యాకాంతం, సరోజ పాత్రలను రీ ప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదు. ఎవరు చేయలేరు కూడా. ఇక ఎస్.వి. రంగారావు, రమణారెడ్డి, రాజనాల, హరినాథ్, ఛాయాదేవి ఇతర పాత్రలు తమ పరిది మేర అద్భుతంగా నటించారు. గంటన్న పాత్రలో రమణారెడ్డి కామెడీ ఈసినిమాకు ఎంతో బలంగా మారింది. ఎన్టీఆర్, రమణారెడ్డి మధ్య సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.

68

గుండమ్మ కథ విజయంలో పాటల పాత్ర

గుండమ్మ కథ' సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. కామేశ్వరావు డైరెక్టర్ అయినప్పటికీ.. సినిమా మొత్తాన్ని చక్రపాణి దగ్గరుండి చూసుకున్నారు.దాదాపు ఆయన చేతుల మీదనే ఈసినిమా వర్క్ అంతా జరిగిపోయింది. ఈ అనుభవంతోనే చక్రపాణి తన స్వీయ దర్శకత్వంలో గుండమ్మ కథ సినిమాను తమిళంలో కూడా తెరకెక్కించి విజయం సాధించారు. ఇక గుండమ్మ కథకు ముందే విజయా ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్ - ఏఎన్నార్ లతో 'మిస్సమ్మ', 'మాయాబజార్' వంటి విజయవంతమైన సినిమాలను అందించారు. ఇక గుండమ్మ కథ సినిమా విజయంలో పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈసినిమాకు మధుర గాయకుడు ఘంటసాల స్వయంగా సంగీతం అందించారు. 'లేచింది నిద్ర లేచింది మహిళా లోకం', 'ప్రేమ యాత్రలకు', 'ఎంత హాయీ', 'మనిషి మారలేదు', 'కోలో కోలోయన్నా', 'అలిగిన వేలనే చూడలి' వంటి పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈనాటికీ ఈ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. గుండమ్మ కథ విజయంలో పాటల పాత్ర కూడా చాలా ఉంది.

78

ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు ఎంతో ప్రత్యేకం

తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 14 సినిమాలు వచ్చాయి. గుండమ్మ కథ సినిమాకంటే ముందే వీరిద్దరి కలయికలో మిస్మమ్మ, మాయాబజార్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో గుండమ్మ కథ సినిమాపై అప్పట్లోనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా స్థాయిలో పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఏఎన్నార్ కొన్నివిషయాల్లో విభేదించినా.. కొన్ని విషయాల్లో మాత్రం ఒక్క మాటమీద ఉండేవారు. కొన్ని పనులు కలిసి చేసేవారు. అందుకే ఇలాంటి అద్బుతమైన సినిమాలు చేయగలిగారు. అప్పట్లో సినిమాను మూడు నాలుగు నెలల్లో తీసేవారు. కానీ గుండమ్మ కథ సినిమా తీయ్యాడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట. ఈసినిమాలో స్టార్స్ అంతా బిజీగా ఉండటంతో కాల్షీట్లు దొరక్క.. ఎవరు టైమ్ దొరికితే వారితో సన్నివేశాలుషూట్ చేసేవారట. అందుకే ఈసినిమా షూటింగ్ కు ఏడాది పట్టింది. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అంత ప్రతి ఫలం లభించింది. అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా ఈసినిమా నిలిచింది. గుండమ్మ కథ సినిమా కోసం అప్పట్లో ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ గ్రామాల నుండి టౌన్ కి వెళ్లి ఈ సినిమా చూశారట. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం.. అప్పటికీ ఎప్పటికీ అజరామరమంగా నిలిచిపోయింది.

88

గుండమ్మ కథ రీమేక్ ప్రయత్నాలు

గుండమ్మ కథ' సినిమాను ఒక్క సారి కాదు రెండు సార్లు రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా బాలకృష్ణ, నాగార్జునతో ఈసినిమా చేయాలని చూశారట. ఇద్దరు హీరోలు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కాని అది ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇక ఆ తాతలకు మనవళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ - నాగ చైతన్యలతో ఈ సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. తారక్ సైతం చైతూతో కలిసి రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ రెండు సార్లు సినిమా ప్రయత్నం ముందుకు వెళ్లకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అలాంటి క్లాసిక్ మూవీని టచ్ చేయడానికి ధైర్యం చాలకపోవడం, అంత అద్భుతంగా చేయగలమా.. ? ఈజనరేషన్ కు అలాంటి సినిమాను ఎలా అందించాలి అనేది అర్ధం కాకపోవడం. ఇక మరో కారణం ఏంటంటే 'గుండమ్మ కథ'ను తెలుగులో మరోసారి రీమేక్ చేస్తే.. గుండమ్మ పాత్ర ఎవరితో చేయించాలి. సరోజ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి. గుండమ్మ పాత్రను సూర్యాకాంతం తప్పించి మరొకరు చేయలేదు. ఆమెను రీప్లేస్ చేసే నటి మరొకరు పుట్టలేదే. ఎవరు ప్రయత్నించినా అది సాధ్యం కాదు అని తెలిసి రెండు సార్లు ఈ ప్రయత్నం మానుకున్నారట మేకర్స్. ఇక మరి భవిష్యత్ లో ఎవరైనా ఈ సాహసం చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories