విలక్షణ నటుడు గిరిబాబు ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన శనివారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన తన కొడుకుల గురించి పలు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రఘుబాబు నటించిన చిత్రాల్లో ఇష్టమైన మూవీస్ గురించి, అలాగే ఆయన తన అభిప్రాయాన్ని రివర్స్ చేసిన విషయాన్ని, బోస్ బాబుతో తీసిన సినిమాల గురించి వెల్లడించారు.
రఘుబాబు నటనపై గిరిబాబుకి ప్రత్యేకమైన అభిమానం
గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. ముఖ్యంగా కామెడీ, విలనిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో సినిమాల్లో మెప్పించారు. అయితే రఘుబాబు కెరీర్‌లో కొన్ని పాత్రలు తండ్రి గిరిబాబుకు ప్రత్యేకంగా నచ్చాయట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’, అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ సినిమాల్లో రఘుబాబు పోషించిన పాత్రలు తనకు చాలా ఇష్టమని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నత్తి పాత్రలు బాగా ఇష్టపడతానని, వాటిలో రఘుబాబు కామెడీ బాగుంటుందని చెప్పారు. రఘుబాబు విలన్‌గా కనిపిస్తూనే కామెడీ చేస్తాడని, అలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ఆ విషయంలో రఘుబాబు బాగా నచ్చుతాడని తెలిపారు.
‘ఆది’ సినిమాలో రఘుబాబు పోషించిన గంగిరెడ్డి పాత్ర ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బన్నీ’ సినిమాలోనూ తనదైన నటనతో మెప్పించారు. ఈ రెండు సినిమాలు రఘుబాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తండ్రిగా గిరిబాబు కూడా కొడుకు నటనను ఎంతో ఇష్టపడేవారని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.