కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ తెలుగులో మూడవ చిత్రం. గతంలో కియారా భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కియారా అద్వానీ 2023లో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇదే. రాంచరణ్ తో ఆమెకి ఇది రెండో సినిమా. వినయ విధేయ రామ డిజాస్టర్ అయింది. ఈ చిత్రం అయినా సక్సెస్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా కియారా అద్వానీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కి కియారా అద్వానీ మునిమనవరాలు అవుతుంది. 1991 జూలై 31న ముంబైలో కియారా జన్మించింది. ఆమె మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా పొందారు.
ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంతో కియారాకి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి విమర్శలు మూటగట్టుకున్నారు. మహేష్ బాబు సరసన నటించిన భరత్ అనే నేను చిత్రంతో తెలుగు యువతని ఆమె మాయ చేశారు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.
హీరోయిన్ కాకముందు కియారా అద్వానీ టీచర్ వృత్తిలో రాణించారు అని మీకు తెలుసా ? కియారా అద్వానీ తల్లి జెనివివే అద్వానీ స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అదే స్కూల్ లో కియారా కొంత కాలం టీచర్ గా పనిచేశారు.
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. తల్లిదండ్రులు ఆమెకి అలియా అని పేరు పెట్టారు. కానీ వాస్తవానికి కియారా అని పేరు పెట్టాలనుకుని కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు. కియారా అనే పేరునే ఆమె తన స్క్రీన్ నేమ్ గా మార్చేసుకున్నారు. కియారా అద్వానీ తెలుగులో ఒక సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకుంది. అదే అర్జున్ రెడ్డి చిత్రం. కానీ ఈ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ లో మాత్రం నటించింది.