టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న నిర్మాత ఎవరంటే అది దిల్ రాజు మాత్రమే. ఆయన నిర్మించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు. ఆ మూవీ జనవరి 14న రిలీజ్ అవుతోంది. మధ్యలో బాలయ్య డాకు మహారాజ్ చిత్రం కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాదు.. కానీ నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మూడు చిత్రాల్లో దిల్ రాజు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే దిల్ రాజు టెన్షన్ మొత్తం గేమ్ ఛేంజర్ పైనే కనిపిస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేశారట. దీనితో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్ రాజు ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. జనవరి 4 న రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కువ సమయం మాట్లాడలేకపోయాను. ప్రేక్షకులు భారీగా రావడం వల్ల బ్యారికేడ్లు విరిపోతున్నాయి అని పోలీసు వారు తెలిపారు. దీనితో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ఈవెంట్ ని త్వరగా ముగించాం.
పవన్ కళ్యాణ్ గారు తనకి వకీల్ సాబ్ చిత్రం జనసేన పార్టీని నడిపించడానికి ఇంధనంలా పనిచేసింది చెప్పారు. ఆ విషయం నాకు తెలియదు. వకీల్ సాబ్ రెమ్యునరేషన్ వల్లే జనసేన పార్టీ నిలబడింది అని పవన్ కళ్యాణ్ అంతటి వ్యక్తి చెప్పడంతో వేదికపైనే నాకు కన్నీళ్లు వచ్చాయి. కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసిన పనుల వల్ల అద్భుతాలు జరుగుతుంటాయి అని దిల్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి వకీల్ సాబ్ కంబ్యాక్ మూవీ. ఆ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఆయన సందేహపడ్డారు. ఆడియన్స్ నానుంచి ఇలాంటి కథని రిసీవ్ చేసుకుంటారా అని అడిగారు.
దీనిని రీమేక్ మూవీగా చూడొద్దు, ఫ్యాన్స్ కి నచ్చేలా చేయడంలో నాది భాద్యత అని దిల్ రాజు పవన్ కి చెప్పారట. ఆ విధంగా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ తో నా జర్నీ తొలిప్రేమ నుంచి మొదలైంది అని మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత పాలిటిక్స్ లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. అరె.. పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా చేస్తున్నాడు.. ఇంత ఇమేజ్ పెట్టుకుని రాజకీయాల్లోకి ఎందుకు అని అనుకున్నా. నాతో పాటు ఆయన మంచి కోరుకునే చాలా మంది ఎందుకు పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అని అనుకున్నాం.
కానీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పాలిటిక్స్ ఒకసారి ప్రయత్నించారు వర్కౌట్ కాలేదు.. తిగిరి మళ్ళీ సినిమాలు చేశారు.. మల్లి రాజకీయాలపై ఫోకస్ చేసి గట్టిగా కొట్టారు. ఆయన ఎక్కడా హాప్ కోల్పోలేదు.. వదిలిపెట్టలేదు అని దిల్ రాజు తెలిపారు. 21 సీట్లకు 21 సీట్లు గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు గేమ్ ఛేంజర్ లాగా కనిపించారు అని దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.