Folk Song: తెలంగాణ జానపద పాటలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. పల్లె పదాలు, ప్రేమ భావాలు, పెళ్లి సందడి ఊరూరా మారుమోగుతున్నాయి. అలాంటి జానపద బాణీలో వచ్చిన పాటల్లో “బిందె మీద బిందె పెట్టి.. నీలాభవంతిలో పూల భవంతిలో” ఒకటి.
“బిందె మీద బిందె పెట్టి.. నీలాభవంతిలో పూల భవంతిలో” అంటూ పాట ప్రారంభమవుతుంది. బిందెలు, పూలు, పల్లె జీవితం వంటి పదాలతో మొదలయ్యే ఈ పాటలో గ్రామీణ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. పాటలో వచ్చే పదాలు సాధారణంగా పల్లెల్లో వినిపించే భాషకు దగ్గరగా ఉండటంతో వినేవారికి వెంటనే కనెక్ట్ అవుతుంది. “ఎవరింటి బిడ్డేవమ్మ..” అంటూ సాగే పదాలు ఒక అందమైన యువతిని ఉద్దేశించి అడిగే చిలిపి ప్రశ్నలా అనిపిస్తాయి.
25
ప్రేమలో పడిన యువతి భావాలను చెప్పే పాట
పాట మధ్యలో వచ్చే పదాలు ప్రేమలో పడిన యువతి మనసులోని భావాలను తెలియజేస్తాయి. చీకటి రాత్రి, వెన్నెల, ప్రియుడి కౌగిలి, ముద్దులు, అతని శ్వాస వంటి ప్రస్తావనలతో ప్రేమలోని అనుభూతిని కాస్త చిలిపిగా, జానపద శైలిలో వ్యక్తం చేస్తుంది. తర్వాత “ఆకుపచ్చ చీరెను కట్టి.. అద్దాల రైకను తొడిగి.. జడలోన మల్లెలు పెట్టి..” అంటూ యువతి తనను తాను అలంకరించుకునే దృశ్యాన్ని వివరిస్తుంది. చీర, అద్దాల రైక, మల్లెపూలు, అత్తరు, కాటుక వంటి పదాలు సంప్రదాయ పల్లె ఆడపడుచుల అలంకరణను గుర్తు చేస్తాయి. తాను అందంగా తయారై ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న భావన కూడా ఈ భాగంలో కనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి కంటికి కనిపించకపోయినా.. మనసులో మాత్రం అతడినే తలచుకుంటూ ఉండే యువతి మనస్తత్వాన్ని ఈ పాటలోని పదాలు ప్రతిబింబిస్తాయి.
35
పెళ్లి సందడి.. పందిరి నుంచి భరాత్ వరకు
పాట చివరి భాగంలో ప్రేమ భావన కాస్త పెళ్లి సందడిగా మారుతుంది. “రంగు రంగుల బంగ్లా.. రామ చక్కని బంగ్లా” అంటూ పెళ్లి ఇంటి వాతావరణాన్ని వర్ణిస్తుంది. పాలు, పచ్చని పందిరులు, బాజాల చప్పుడు, తోరణాలు, పూల అలంకరణ వంటి అంశాలు పెళ్లి వేడుకను కళ్ల ముందు నిలబెడతాయి. “పెళ్లి పిల్లనూ చేసి..” అంటూ పెళ్లి కూతురిని సిద్ధం చేసే సందర్భాన్ని కూడా పాటలో ప్రస్తావిస్తుంది. పెళ్లి జరిగే ఇంట్లో ఉండే సందడి, అలంకరణ, సంగీతం, బంధువుల హడావుడి వంటి వాటిని జానపద పదాలతో అందంగా చెప్పడం ఈ పాట ప్రత్యేకత. అందుకే ఈ పాట పెళ్లి వేడుకలకు బాగా సరిపోతుంది. ముఖ్యంగా భరాత్, డీజే, పెళ్లి ఊరేగింపుల్లో పాట బీట్‌కు యువత స్టెప్పులు వేయడంతో ఇది మరింత వైరల్‌గా మారింది.
ఈ పాట కేవలం పెళ్లి వేడుకలకే పరిమితం కాలేదు. వినాయక నిమజ్జనం, గ్రామీణ జాతరలు, స్థానిక ఉత్సవాలు, డీజే కార్యక్రమాల్లోనూ ఈ పాట వినిపిస్తోంది. ప్రధాన కారణం పాటలోని జానపద బీట్, సులభంగా గుర్తుండిపోయే పదాలు, డ్యాన్స్‌కు అనుకూలంగా ఉండే రిథమ్. వినగానే పల్లె వాతావరణం గుర్తుకు రావడంతో పాటు బీట్ మొదలైతే కదలకుండా ఉండలేని విధంగా మ్యూజిక్ ఉండటం ఈ పాట మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ముఖ్యంగా పండుగలు, ఊరేగింపులు, పెళ్లిళ్లలో డీజే సౌండ్‌లో ఈ పాట వినిపించినప్పుడు చుట్టూ ఉన్నవారు కూడా పాటలో కలిసిపోయేలా ఉంటుంది. అందుకే విడుదలైన తర్వాత ఈ పాటకు వేడుకల పాటగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
55
నాగవ్వ, శ్రీనిధి గానం.. కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న పాట
“బిందె మీద బిందె పెట్టి..” పాటను నాగవ్వ, శ్రీనిధి ఆలపించారు. పాటకు తిరుపతి సాహో సాహిత్యం అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. సాండీ సంగీతం అందించగా.. డీజే శేఖర్ ఇచ్చోడ రిథమ్స్ అందించారు. ఈ పాటలో సోనీ వైష్ణవి, నాగవ్వ నటించారు. రాఘవేంద్ర గౌడ్ నిర్మాతగా వ్యవహరించారు. సినిమాటోగ్రఫీని పరమేశ్ ఏసం నిర్వహించారు. ఎడిటింగ్, డీఐ బాధ్యతలను సంజు మార్టిన్ (Redspoon Media) చేపట్టారు. కొరియోగ్రఫీని రాజేష్ పైండ్ల చేశారు. ఈ పాట వైదిక ప్రొడక్షన్స్ నిర్మాణంలో, వైదిక మ్యూజిక్ మ్యూజిక్ లేబుల్‌పై విడుదలైంది. 2026 ఏప్రిల్ 26న ప్రీమియర్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 25,545,487 వ్యూస్ వచ్చాయి. అంటే సుమారు 2.55 కోట్ల వ్యూస్ అన్నమాట. పాటకు వచ్చిన ఈ స్పందన చూస్తే తెలుగు జానపద పాటలకు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమవుతోంది. పల్లె పదాలను, ప్రేమ భావాలను, పెళ్లి సంబరాలను కలిపిన ఈ పాట ఇప్పుడు ఒక వేడుక పాటగా మారిపోయింది. పెళ్లి భరాత్ అయినా.. వినాయక నిమజ్జనం అయినా.. “బిందె మీద బిందె” పాట వినిపిస్తే సందడి మరింత పెరగాల్సిందే.