హీరో సూర్య(Suriya) తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నారు. ఆయన ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఇటీవల నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్` చిత్రాలు ఓటీటీలో విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. అదే సమయంలో ఈ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్నుంచి వస్తోన్న మరో సినిమా `ఈటీ`(ఎవరికి తలవంచడు). చాలా కాలం తర్వాత ఆయన సినిమా థియేటర్‌లో విడుదలవుతుంది. ఇది తెలుగులోనూ గురువారం(మార్చి10)న విడుదలయ్యింది. పాండిరాజ్ దర్శకత్వం వహించగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. యాక్షన్, లవ్ మేళవించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉంది, సూర్య హ్యాట్రిక్ కొట్టాడా? అనేది `ఏషియా నెట్` రివ్యూ(ET Movie Telugu Review)లో తెలుసుకుందాం.
కథః
సూర్య లాయర్. విలేజ్‌లో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తుంటాడు. లాయర్‌గా కేసులు వాదిస్తూనే చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే పొరుగు గ్రామానికి సూర్యకి పడదు. దురదృష్టవశాత్తు ఆ ఊరుకి చెందిన అమ్మాయి ప్రియాంకనే సూర్య ప్రేమిస్తాడు. లవ్ ట్రాక్, చిన్నపాటి ఘటనలతో కథ అంతా రెగ్యూలర్‌గానే సాగుతుంది. సూర్య జీవితం కూడా సాఫీగానే సాగుతుంది. కానీ ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న ఓ క్రూరమైన నేరం ద్వారా సూర్య జీవితం డిస్ట్రర్బ్ అవుతుంది. మరి ఆ నేరం ఏంటీ? అది సూర్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. దీని వెనుక ఎవరున్నారు. సమస్యని సూర్య ఎలా ఎదుర్కొన్నాడనేది మిగిలిన కథ. ET Movie Telugu Review.
విశ్లేషణః
దర్శకుడు పాండిరాజ్ గతంలో కార్తితో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో `చినబాబు` చిత్రాన్నిరూపొందించారు. ఇప్పుడు సూర్యతో `ఈటీ` సినిమా తెరకెక్కించాడు. ఎంచుకున్న కథాంశాలు వేరైనా సినిమా ఫ్లాట్ మాత్రం ఒకేలా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాని తీర్చిదిద్దిన తీరు కూడా ఒకేలా ఉండటం గమనార్హం. ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం టీవీ సీరియల్‌ని తలపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ ఉన్నా, ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. విలేజ్‌లో జరిగే గొడవ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇవన్నీ రొటీన్‌గా ఉండటంతో బోర్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. ఇక ఇంటర్వెల్‌లో క్రైమ్ ఎపిసోడ్ ఎంటర్ కావడంతో కథ కాస్త కొత్తదనం వైపు టర్న్ తీసుకుంటుంది. కాసేపు ట్విట్ట్ లు, టర్న్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.
ద్వితీయార్థం మొత్తం సినిమా మరో జోనర్‌కి తీసుకుంటుంది. విలన్ ఎంట్రీ, మహిళలకు సంబంధించిన ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎంగేజ్ చేస్తాయి. ఓ రకంగా సెకండాఫ్ సినిమా `జై భీమ్` ట్రాక్ తీసుకుంటుంది. మహిళలపై దాడులు, వారిని వేధించడం, వారి కోసం సూర్య పోరాడటమనేది `జై భీమ్` సినిమాలోని ఎపిసోడ్లని గుర్తు చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఈ ఎపిసోడ్లు, సూర్య ఫైటింగ్, మహిళ ప్రాధాన్యత చుట్టూ తిరుగుతుంది. అప్పటి వరకు బాగానే సాగిందని చెప్పొచ్చు. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి యాక్షన్ మూడ్‌లోకి వెళ్తుంది. అయితే లాజిక్ లెస్ విషయాలతో క్లైమాక్స్ ని చాలా సేపు పొడిగించారు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.
దర్శకుడు పాండిరాజ్.. ఒక మంచి మహిళ నేపథ్య కథని ఎంచుకున్నారు. పితృస్వామ్య వ్యవస్థలోని మహిళ పరిస్థితి చూపించే ప్రయత్నం చేశాడు. మహిళలను తక్కువ చేసే చూసే విధానం మనలో సిగ్గుపడేలా చేస్తుంది. కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్‌కి, పితృస్వామ్య వ్యవస్థకి, క్రైమ్‌కి మధ్య లింక్ కుదరలేదు. దీంతో ఫస్టాఫ్ ఓ సినిమా, సెకండాఫ్ మరో సినిమాగా అనిపిస్తుంది. మొత్తంగా దర్శకుడు పాండిరాజ్ సరైన సందేశాన్ని సరైన విధంగా ప్రజెంట్ చేయలేకపోవడంతో సినిమా ఫలితం నిరాశ పరుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులుః
సూర్య లాయర్‌గా అదరగొట్టారు. మహిళల కోసం చేసే పోరాట సన్నివేశాలు సహజత్వాన్ని ప్రదర్శించారు. రెగ్యూలర్ కమర్షియల్ పాత్రగానే మిగిలిపోతుంది. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను చాలా ఇంటెన్స్ తో చేశాడు. ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక పాత్ర రెగ్యూలర్‌గానే ఉంటుంది. కాకపోతే ఆమె లుక్ వైజ్‌గా ఆకట్టుకుంది. ప్లజెంట్ వైబ్‌ని క్రియేట్ చేసింది. సూర్యతో వచ్చే సన్నివేశాల్లో ఆకట్టుకుంది. సత్యరాజ్, శరణ్య వంటి మిగిలిన ఆర్టిస్టులు పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.
టెక్నీకల్‌గాః
సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ మ్యూజిక్ సినిమాకి హెల్ప్ అయ్యింది. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కమర్షియల్ సినిమాకి బీజీఎం పరంగా ఉండాల్సిన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పాటల కంటే బీజీఎం ఆకట్టుకుంటుంది. రత్నవేలు కెమెరా వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎడిటర్ రూబెన్ ఇంకాస్త ట్రీమ్ చేయాల్సింది. మెలోడ్రామా సన్నివేశాలు కట్ చేయాల్సింది. మొత్తంగా `ఈటీ` చిత్రం రెగ్యూలర్ రొటీన్ కమర్షియల్ సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు.
రేటింగ్‌ః 2