
బిగ్ బాస్ తెలుగు 9 శుక్రవారం(68వ) ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల చిన్ననాటి మెమొరీస్ గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. చిల్డ్రన్స్ డే స్పెషల్ గా దీన్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా కంటెస్టెంట్ల చిన్నప్పటి ఫోటోలను తెప్పించారు. వాటిని కంటెస్టెంట్లకి ఇచ్చి ఆ ఫోటో వెనుక స్టోరీని పంచుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో ఒక్కొక్కొరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. కొందరివి రెగ్యూలర్‌గా ఉంటే, మరికొందరివి ఫన్నీగా, ఇంకొందరివి ఎమోషన్‌గా ఉన్నాయి. అందులో భాగంగా ఇమ్మాన్యుయెల్ చిన్ననాటి జీవితం ఆద్యంతం బాధాకరంగా సాగడం గమనార్హం. అన్నయ్య, తాను ఒకే డ్రెస్ ధరించడంపై ఆయన చెబుతూ, అన్నయ్యకి ఏ డ్రెస్ కోనిస్తే, తనకు కూడా అదే కోనివ్వమని అడిగేవాడిని, లేదంటే గొడవ చేసేవాడిని అని తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నప్పటి దారుణమైన పరిస్థితులను వెల్లడించాడు ఇమ్మూ. తాను, డానియల్ అన్నదమ్ములు. తాను పుట్టే సమయంలో వీరి పేరెంట్స్ కఠిక పేదరికంలో ఉన్నారు. చిన్నపాకలో ఉండేవారట. తినడానికి తిండికూడా లేదు. అప్పటికే పెద్దబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ కడుపులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న తనని వద్దు అనుకున్నాడట. ఒక్కడినే సరిగా చూసుకోలేకపోతున్నాం, ఇంకొక్కరు అంటే కష్టమవుతుంది. వద్దు అన్నారట. అమ్మని చాలా ఫోర్స్ చేశారట. కానీ అమ్మమ్మ ఒత్తిడి చేసి ఇమ్మాన్యుయెల్‌ని కనేలా వాళ్ల అమ్మానాన్నల్ని ఒప్పించిందట. అంతేకాదు వీడి వల్లే మీ జీవితాలు మారతాయని కూడా చెప్పిందట. అలా అమ్మమ్మ వల్లనే తాను పుట్టానని తెలిపారు ఇమ్మాన్యుయెల్.
ఈ క్రమంలో మరో షాకింగ్ విషయాన్ని పంచుకున్నాడు. తాను కడుపులో ఉన్నప్పుడు అమ్మకి ఆకలేస్తే, తినడానికి తిండి లేక పొలంలోకి వెళ్లి మట్టిని తిన్నదని చెప్పాడు. దీంతో హౌజ్ ఒక్కసారిగా గుంబనంగా మారిపోయింది. అందరి మనుషులను చలింప చేసింది. ఇంకా ఇమ్మాన్యుయెల్ చెబుతూ, చిన్నప్పట్నుంచి కూలీ పనులు చేసుకునేవాళ్లమని, ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పనులు చేసి తమ ఖర్చులకు తామే సంపాదించుకున్నట్టు తెలిపారు. అన్ని రకాల కూలీ పనులు చేసిన్టటు తెలిపాడు. డిగ్రీలో క్యాటరింగ్ సర్వీస్ కూడా చేసినట్టు తెలిపారు ఇమ్మాన్యుయెల్. తాను సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదన్నారు.
`సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాక.. గుడిసే ఉన్న చోటనే నాన్న ఇళ్లు కడితే, ఆ తర్వాత దాన్ని పెంచి మూడు ఫ్లోర్స్ వేశాను. అన్ని అప్పులు కూడా తీర్చుకోగలిగాం. ఇప్పుడు అంతా హ్యాపీ. అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. ఏదైనా పని చేయాల్సి వస్తే, నా పని కూడా తనే చేసేవాడు, తనకు కష్టం రానిచ్చేవాడు కాదు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ గత మూడేళ్లుగా సరిగా మాట్లాడటం లేదు. ఏమైందో ఏంటో తెలియదు. అయితే తాను జబర్దస్త్ లోకి వచ్చాను, మంచి పేరొచ్చింది. ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. ఏదైనా ఆఫర్స్ ఇప్పించొచ్చు కదా అని వాళ్లు వీళ్లు అన్నకి చెబుతుంటారు. మనసు పాడు చేస్తుంటారు. అన్నయ్య విషయంలో అదే జరిగి ఉంటుంది. కానీ ఏ రోజైనా వాడు మంచి డైరెక్టర్ అవుతాడు. నాతో సినిమా తీస్తానని అంటుంటారు. అది నెరవేరాలని కోరుకుంటున్నా. అన్నయ్య చాలా మంచివాడు, నేనే దొంగనా కొడుకుని` అంటూ కన్నీళ్లు పెట్టించాడు ఇమ్మాన్యుయెల్. ఆయన చిన్నప్పటి స్టోరీ ఆద్యంతం గుండెని బరువెక్కించిందని చెప్పొచ్చు.
ఇమ్మాన్యుయెల్‌తోపాటు రీతూ చౌదరీ, భరణి, నిఖిల్, సంజనా, డీమాన్ పవన్, కళ్యాణ్ కూడా తమ చిన్నప్పటి గుర్తులను నెమరేసుకున్నారు. చిన్నప్పుడు తనని అమ్మమ్మ వద్ద పెంచారని, అమ్మానాన్న ప్రేమకి నోచుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్. అలాగే తాను చిన్నప్పుడు అన్నయ్య డ్రెస్సులు, చెప్పులు వేసుకునేదాన్ని అని, తానుఎక్కువగా అబ్బాయిల దుస్తులు ధరించేదాన్ని అని రీతూ చౌదరీ తెలిపింది. మరోవైపు తాను 6వ తరగతిలోనే జిల్లా స్థాయిలో చెస్‌లో విన్నర్‌గా నిలిచినట్టు, చాలా మందికి చెస్ నేర్పించేవాడిని అని వెల్లడించారు డీమాన్ పవన్. ఇలా తమ చిన్నప్పటి విషయాలు చెప్పి ఆకట్టుకున్నాడు కంటెస్టెంట్లు.ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరించింది.