
బిగ్ బాస్ తెలుగు 9 షో రెండు వారాల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల షో విన్నర్‌గా నిలిచాడు. ఎవరూ ఊహించని విధంగా కప్ గెలిచాడు. కామన్ మ్యాన్‌గా వచ్చి కప్ కొట్టుకుపోయాడు. చాలా మంది సెలబ్రిటీలను దాటుకుని ఆయన విజేతగా నిలవడం విశేషం. అయితే బిగ్ బాస్ షో టీమ్ మాత్రం ఈ సారి విన్నర్ గా తనూజనిగానీ, ఇమ్మాన్యుయెల్‌ని గానీ చేయాలనుకున్నారట. నిర్వాహకుల మదిలో వీరిద్దరే ఉన్నారు. బట్ చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట.
అయితే ముందుగా ఈ సీజన్ విన్నర్ ఇమ్మాన్యుయెల్ అని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలోనూ అదే చర్చ నడిచింది. ఎందుకంటే ఇమ్మూ అటూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. గతంలో ఏ సీజన్‌లోనూ కమెడియన్లు చేయనంత కామెడీ ఇమ్మాన్యుయెల్ చేయడం విశేషం. ఈ విషయాన్ని మరో కమెడియన్ అవినాష్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అందరితోనూ మంచి రిలేషన్ కొనసాగించాడు. ఎవరితోనూ గొడవలు లేవు. అదే సమయంలో టాస్క్ ల విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. తనకంటే బలమైన కళ్యాణ్, డీమాన్ పవన్‌లకు దీటుగా ఆయన గేమ్స్ ఆడి మెప్పించాడు. విజయం సాధించాడు.
బిగ్ బాస్ షో మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. ఒక కంటెస్టెంట్ ఇలా మూడు సార్టు కెప్టెన్ కావడం ఇమ్మూ విషయంలో జరిగింది. ఆయన పర్సనల్ లైఫ్‌లోనూ చాలా డ్రామా ఉంది. ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాడు. బెస్ట్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. దీంతో బిగ్ బాస్ షో విన్ అయ్యే లక్షణాలు అన్నీ ఆయనకు ఉన్నాయని అంతా భావించారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అదే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కళ్యాణ్‌ని చేశారు. అయితే నామినేషన్స్ లో ఎక్కువగా లేకపోవడమే ఇమ్మూకి పెద్ద మైనస్‌గా మారిందని చెబుతున్నారు. మొత్తంగా ఇమ్మూ టాప్ 4వ స్థానంలో హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధపడ్డాడు ఇమ్మూ. ఆ బాధ ఆయన మొహంలో కనిపించింది. ఎంతో నిరాశతో, అసహనంతో కనిపించారు. అన్నీ తనలో దిగమింగుకున్నాడు.
తాజాగా ఆ అసహనం బయటపడింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంతా తాజాగా యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న `ఆదివారం స్టార్ మా పరివారం`లో పాల్గొన్నారు. ఇందులో కళ్యాణ్, శ్రీజ, ఇమ్మాన్యూయెల్, రీతూ చౌదరీ, డీమాన్ పవన్, దివ్య, భరణి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ, రాము రాథోడ్ పాల్గొన్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచిన నేపథ్యంలో అతన్ని అదిరిపోయే పంచ్ లతో ప్రశంసించారు. అనంతరం ఇమ్మాన్యుయెల్‌ని పట్టుకుని మా కామెడియన్లకి కప్ ఎందుకు ఇవ్వలేదంటూ కామెడీగా ప్రశ్నించాడు అవినాష్. దీనికి వామ్మో అంటూ ఇమ్మూ రియాక్ట్ కావడం నవ్వులు పూయించింది.
ఇమ్మాన్యుయెల్‌ని లో లవ్ ట్రాక్ ఎందుకు పెట్టుకోలేదని అవినాష్ అడగ్గా పెట్టుకుందామనుకుంటే శ్రీజ వెళ్లిపోయింది, ఆ తర్వాత ప్రియా వెళ్లిపోయింది. ఇక మిగిలింది మాధురీగారే అని చెప్పడంలో నవ్వులు పూయించింది. అనంతరం పదో సీజన్‌కి వెళ్లాలనుకునే మీలాంటి ఎంటర్‌టైనర్లకి మీరిచ్చే సజేషన్స్ ఏంటి అని ప్రశ్నించగా, `ఎంటర్‌టైన్ చేయకండి` అంటూ సంచలన కామెంట్ చేశాడు ఇమ్మూ. అయితే ఆ సమయంలో సరదాగానే ఆయన రియాక్ట్ అయినా, అంతర్లీనంగా తన అభిప్రాయం ఇదే అనేది అర్థమవుతుంది. తనలో ఉన్న అసహనాన్ని ఆయన ఇలా వ్యక్తం చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇమ్మూ చెప్పింది నిజం, కామెడీ చేసిన వాళ్లకి కప్ ఇవ్వరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిప్పుడు రచ్చ అవుతుంది.