
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తనదైన మాటలతో మాయ చేస్తుంటారు. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటుంటారు. ఆయన సినిమాల్లో డైలాగులే హైలైట్‌గా నిలుస్తాయి. హార్ట్ టచ్ చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. అదే ఆయన స్పెషాలిటీ. అసిస్టెంట్ రైటర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ప్రారంభంలో పోసాని కృష్ణమురళీ వద్ద పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు విజయ భాస్కర్ వద్ద పనిచేశారు. అసిస్టెంట్‌గా పనిచేయడంతోపాటు కథ, మాటలు అందించారు. చాలా సినిమాలకు డైలాగ్స్ రాశారు. వాటి ద్వారానే పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్.. `నువ్వే నువ్వే` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. `అతడు`, `జల్సా`, `ఖలేజా`, `జులాయి`, `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అ ఆ` చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`, `గుంటూరు కారం` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు వెంకటేష్‌తో `ఆదర్శకుటుంబం హౌస్ నెం.47` మూవీని రూపొందిస్తున్నారు. నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు.
అయితే రైటర్‌గా చాలా సినిమాలకు పనిచేశారు త్రివిక్రమ్. చాలా వరకు దర్శకుడు విజయభాస్కర్ సినిమాలకు కథ, మాటలు అందించారు. వీరి కాంబినేషన్‌లో `స్వయంవరం`, `నువ్వే కావాలి`, `నువ్వు నాకు నచ్చావ్`, `మన్మథుడు`, `మళ్లీశ్వరి`, `జై చిరంజీవా` వంటి చిత్రాలు వచ్చాయి. ఈ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్. ఒక్క `జై చిరంజీవా` తప్ప. అప్పట్లో విజయ భాస్కర్ స్టార్ డైరెక్టర్ కూడా. ఆ తర్వాత వీరిద్దరు పనిచేయలేదు. త్రివిక్రమ్ సొంతంగా దర్శకుడిగా మారడంతో వీరి బాండింగ్ బ్రేక్ అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, దీంతోనే విడిపోయారని, ఈ క్రమంలోనే `అత్తారింటికి దారేది`లో బద్దం భాస్కర్ పాత్రతో విజయ భాస్కర్‌పై సెటైర్లు వేశారనే కామెంట్స్ బయటకు వచ్చాయి. ట్రోల్స్ కూడా నడిచాయి.
`అత్తారింటికి దారేది`లో బద్దం భాస్కర్‌గా బ్రహ్మానందం నటించారు. ఆయన పాత్ర కామెడీగా ఉంటుంది. ఆయన్ని హీరో ఆడుకునేలా ఉంటుంది. అయితే ఆ పాత్ర దర్శకుడు విజయభాస్కర్ దే అనేది చాలా మంది వాదన. దీనిపై తాజాగా దర్శకుడు విజయ భాస్కర్ స్పందించారు. ఇలాంటివి చిల్లర కామెంట్స్ చాలా మంది చేస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవాటికి రియాక్ట్ అయితే మన స్థాయి తగ్గిపోతుందని తెలిపారు. తాము గురువు, శిష్యులం కాదు అని, మంచి స్నేహంగానే ఉంటామని, రైటింగ్ విషయంలో పెద్దా, చిన్నా అనే తేడా ఉండదని, ఇద్దరం కలిసే రాస్తామని, స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయబేధాలుంటాయి, కానీ అది సినిమాకే పరిమితం, వ్యక్తిగతంగా ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పారు. వారిది మంచి ఫ్యామిలీ అని కూడా వెల్లడించారు దర్శకుడు.
బద్దం భాస్కర్ అనే విషయానికి వస్తే.. భాస్కర్.. త్రివిక్రమ్ నాన్న పేరు అని, ఆయన ఆ పేరునే పెట్టుకున్నారని, అదే సమయంలో తమ నాన్న పేరు శ్రీనివాస్ అని చెప్పారు దర్శకుడు విజయభాస్కర్. క్రియేటివ్ సైడ్ ఎవరికి ఉండాల్సిన రెస్పెక్ట్ వాళ్లకి ఉంటుందన్నారు. `జై చిరంజీవా` తర్వాత ఇద్దరం కలిసి పనిచేయలేదని, ఆయన కెరీర్ పరంగా బిజీ అయ్యారని, ఆ సమయంలో ఆయన్ని అడగడం కరెక్ట్ కాదు. ఒకవేళ అడిగినా, ఆయన తన కెరీర్‌ని పక్కన పెట్టి రావాలి. అందుకే తాను అడగలేదని చెప్పారు. త్రివిక్రమ్ మంచి స్థాయికి వెళ్తాడని తాను ముందుగానే ఊహించానని, ఆ సమయంలో తన కెరీర్‌పై చాలా ఫోకస్డ్ గా ఉండేవాడని, రైటర్‌గా సినిమాలకు పనిచేసినా, తన పేరు రైటర్‌గా వేయోద్దని, అసిస్టెంట్ డైరెక్టర్‌గానే వేయాలని చెప్పేవాడు. రైటర్‌గా వేస్తే, దర్శకుడిగా సినిమాలు ఇవ్వరు, అందుకే ఆ జాగ్రత్త పడేవాడని తెలిపారు. కెరీర్ బిగినింగ్‌లోనే పెద్ద హీరోలతో సినిమాలు కుదిరాయి, అవి బాగా ఆడాయి, దీంతో త్రివిక్రమ్ లైఫ్ మారిపోయిందని చెప్పాడు దర్శకుడు. గతంలో ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు విజయ భాస్కర్.