హిట్లు తప్పా.. ఫ్లాప్ లు ఎరుగని దర్శకుడు.. సినిమా సినిమాకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తూ వచ్చిన దర్శకధీరుడు మన తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 20 ఏళ్లలో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘ఆస్కార్’ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన ఆణిమూత్యం మన రాజమౌళి.
ఈరోజు దిగ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు కావడం విశేషం. ప్రముఖ రచయిత వై విజయేంద్ర ప్రసాద్ - రాజా నందిని దంపతుల ముద్దుల కుమారుడే రాజమౌళి. 1973 అక్టోబర్ 10న జన్మించారు. ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. షార్ట్ గా ఎస్ఎస్ రాజమౌళిగా మార్చారు. ఇండస్ట్రీలో బ్రాండ్ గా మార్చారు. అప్రెంటీస్ గా కెరీర్ ను ప్రారంభించిన రాజమౌళి టీవీ సీరియల్ డైరెక్టర్ గా మెప్పించారు. అప్పటికే రాజమౌళికి వర్క్ డెవిల్ అనే నిక్ నేమ్ కూడా దక్కింది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1 చిత్రాన్ని డైరెక్ట్ చేసి దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ప్రేక్షాదరణ పొందడంతో రాజమౌళికి మంచి గుర్తింపు దక్కింది. 2001లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటి నుంచి రీసెంట్ గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వరకు అన్నీ హిట్లే అందించారు. ఇక ‘బాహుబలి’తో జక్కన్న క్రియేట్ చేసిన సెన్సేషన్ కు వరల్డ్ మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది. RRRతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు.
చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ఉన్న రాజమౌళి మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. మరో చిత్రం మహేశ్ బాబుతో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. జక్కన్న కమర్షియల్ సినిమాలే అందిస్తుంటారు. ఆయన సినిమాలూ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కాసుల వర్షం కురిపించాయి. అలాంటి రాజమౌళి తన 23 ఏళ్ల కెరీర్ లో ఎంత కూడబెట్టడనేది ఆసక్తికరంగా మారింది.
కొన్ని నివేదికల ప్రకారం.. రాజమౌళి టోటల్ నెట్ వర్త్ సుమారు రూ.158 కోట్లుగా ఉంటుందని అంచనా. అతని ప్రధాన ఆదాయం సినిమాలే. అతని ప్రొడక్షన్ హౌస్‌ల నుండి కూడా సంపాదన వస్తుంది. బంజారాహిల్స్ లో రాజమౌళికి విలాసవంతమైన బంగ్లా ఉంది. హైదరాబాద్‌లోని ఇంటితో పాటు ఇతర నగరాల్లోనూ బహుళ ఆస్తులు ఉన్నట్టు సమాచారం. రేంజ్ రోవర్, BMWతో సహా కొన్ని లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నారు. వాటి ధర రూ.1.1.5 కోట్లు ఉంటుంది.
ఇక రాజమౌళి ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే పనిచేశారు. స్క్రీన్ రైటర్ గా, ఫిల్మ్ మేకర్ గా, నిర్మాతగానూ సినిమాలు అందించారు. అడ్వెంచర్, ఫాంటసీ జానర్ సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం రాజమౌళిని పద్మశ్రీతో సత్కరించింది.