ఈరోజు విడుదలైన చిత్రాల్లో ‘సిద్ధార్థ్ రాయ్’ Siddharth Reddy Movie ఒకటి. ‘అతడు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. ఈమూవీ ఫోస్టర్ రిలీజ్, ప్రమోషనల్ మెటీరియల్ కాస్తా అర్జున్ రెడ్డి, యానిమల్ తరహాలో కనిపించాయి. మరీ ఈ సినిమా వాటిని పోలి ఉందా? ఇంతకీ కథ ఏంటీ? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ : లాజిక్స్, ఎమోషన్స్ తో నిండిన సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) జీవితమే ఈ సినిమా కథ. సిద్ధార్థ్ మానసికంగా డిటాచ్ అయ్యి ఉంటారు. దాంతో అతని ప్రవర్తన వింతగా అనిపిస్తోంది. ఈ సమయంలో అతని జీవితంలోకి ఇందు (తన్వి నేగి) వస్తుంది. తిండి, నిద్ర, సెక్స్ మాత్రమే మనిషి అవసరాలుగా భావించిన అతని జీవితాన్ని ఇందు మలుపు తిప్పుతుంది. అందుకు ఓ కారణం కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా లాజిక్స్ తో ఓ జీనియస్ లా సిద్ధార్థ్ రాయ్ పెరుగుతాడు. మరి అలాంటి వ్యక్తి జీవితాన్ని ఇందు పూర్తిగా మార్చేస్తుంది. అన్ని ఎమోషన్స్ కు స్పందించేలా చేస్తుంది. ఇంతకీ సిద్దార్థ్ ఎవరు? ఎందుకు అతను మానసికంగా ఎవరితో కలవడు? హిందు అతని జీవితాన్ని ఎలా మార్చిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
విశ్లేషణ : సిద్ధార్థ్ సినిమాలో ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా కనిపిస్తుంది. జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకొని ప్రతిది లాజిక్స్ తోనే ముడిపెడుతూ ఆయన లైఫ్ సాగుతూ ఉంటుంది. ఏమాత్రం ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వని సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని స్టెప్ బై స్టెప్ లాజికల్ గా చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మొదటి భాగమంతా సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ ను మార్చేందుకు ఇతర పాత్రలు ప్రదర్శించడం... ప్రతి సారి సిద్ధార్థ్ రాయ్ మార్పుకోరుకునే వారు దర్శనమివ్వడం కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇందు ఎంట్రీ తర్వాత సిద్దార్థ్ రాయ్ జీవితంలో నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ ను మాత్రం క్రియేట్ చేయడంలో దర్శకుడు పాస్ అయ్యారు. రెండో భాగంలో సిద్ధార్థ్ రాయ్ పాత్ర ఫుల్ ఎమోషనల్ గా సాగుతుంది. అన్నీ ఎమోషన్స్ తో ఆయన జీవితం ఎలా సాగిందనేది కాస్తా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మాత్రం బోరింగ్ గానే అనిపిస్తుంటాయి. ఏదేమైనా హీరో పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారనే భావన కలుగుతుంది.
నటీనటులు : దీపక్ సరోజ్ కు మొదటి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ వచ్చిందని చెప్పొచ్చు. పాత్రను తన నటనతో కన్వే చేయడంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడిని ఫాలో అయిపోయారనేది అర్థమవుతుంది. ఆయన పెర్ఫామెన్స్ కు మాత్రం ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తన్వి నేగి కూడా అద్భుతంగా నటించింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది. సహాయక తారాగణం కూడా ప్రశంసనీయమైన ప్రదర్శనలను కనబరిచారు.
ప్లస్, మైనస్ పాయింట్లు : ఈ చిత్రం కథ కాస్తా కొత్తగా ఉన్నప్పటికీ సినిమాలో హీరో గెటప్ మాత్రం ’అర్జున్ రెడ్డి‘, ’యానిమల్‘ సినిమాలను గుర్తు చేస్తుంటుంది. దీంతో ఆడియెన్ కు ఆ సినిమాలను ఇన్ స్పైర్ అయ్యి ఇలా తెరకెక్కించారనే భావన కలుగుతుంది. పైగా సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ఆన్-స్క్రీన్ ఎగ్జిక్యూషన్ లో లోపం అని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే బాగున్నా కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఉంటుంది. ఇక పాటలు కూడా పెద్దగా పేలలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎం కూడా కథకు అనుగుణంగా ఉంటుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి.
సినిమా పేరు : సిద్ధార్థ్ రాయ్
నటీనటులు : దీపక్ సరోజ్, తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు
దర్శకుడు: వి. యశస్వి
నిర్మాత : జయ ఆడపాక
సంగీత దర్శకుడు: రాధన్
సినిమాటోగ్రాఫర్: సామ్ కె నాయుడు
విడుదల తేదీ : 23 ఫిబ్రవరి 2024