rajendra prasad
హీరో, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన వెయ్యని వేషం లేదు. లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఆ ఒక్కటి అడక్కు, అప్పు చేసి పప్పు కూడు, అప్పుల అప్పారావు వంటి కామెడి చిత్రాలు దూసుకుపోతుంటే రామానాయుడు జంధ్యాలను పెట్టి తీసిన ఆహనా పెళ్ళంట ఈ రోజుకీ ప్రతి ఇంట్లో నవ్వులు పూయిస్తూ.. రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ. ఇప్పటికి ఆ సినిమా తరచూ యూట్యూబ్ ఇతర మాధ్యమాల్లో చూసేవారు ఉండటం విశేషం. ఇక మేడం అనే చిత్రంలో ఆడ వేషం వేయడంతోపాటు ఆయనే అమ్మాయిలాగా డబ్బింగ్ చెప్పి మరొక సంచలనం సృష్టించారు. రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ కెరీర్ ఆరంభం, అనుభవాల గురించి వివరించారు.
హీరో రాజేంద్రప్రసాద్‌ది కృష్ణా జిల్లా నిమ్మకూరుట. సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం కూడా అదేనంట. ఇక రామారావు రాజేంద్రప్రసాద్ వరుసకు మేమమామ అవుతారంట. అంతేకాదు.. రాజేంద్రప్రసాద్ ఇంట్లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొన్నాళ్లు అద్దెకు ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి రావడానికి ప్రేరణ మాత్రం ఎన్టీఆర్ అని చెబుతుంటారు.
ఇక నటకిరీటి ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారంట. ఆ సమయంలో ఎన్టీఆర్ నటన చూసి సినిమాల పట్ల ఆకర్షణ మొదలై.. మద్రాస్ యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నారంట. అదే స్కూల్‌లో తొలి బ్యాచ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, రజనికాంత్, రెండో బ్యాచ్ రాజేంద్ర ప్రసాద్, మూడో బ్యాచ్ చిరంజీవి తదితరులు శిక్షణ పొందారంట. రాజేంద్ర ప్రసాద్ సీనియర్ కావడంతో అక్కడ మైమ్, మోనో, డ్యుయల్, డైలాగ్, డబ్బింగ్ ఇలా కొన్ని అంశాల మీద శిక్షణ తీసుకుని తనకంటే జూనియర్ అయిన చిరంజీవికి క్లాసెస్ చెప్పారంట. ఇక యాక్టింగ్‌లో ఇద్దరికీ కూడా ఏడాది మాత్రమే గ్యాప్ ఉంది.
యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత సినిమాల కోసం రాజేంద్ర ప్రసాద్ అనేక స్టూడియోలకు వెళ్లారంట. కానీ ఎక్కడ అవకాశాలు రాలేదట. అప్పటికే తెచ్చుకున్న డబ్బు అయిపోతుందని ఆందోళన, సినిమా అవకాశాలు రావడం లేదని బాధతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. కొన్నాళ్ళు అవకాశాలు రాకపోవడంతో ఇక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారంట.. ఒకరోజు ఆ విషయాన్నే పుండరీకాక్షయ్యతో చెప్పి.. తన జీవితం ముగిద్దాం అనుకున్నారట. దీంతోపాటు అప్పటికి నెల నుంచి ఒంటిపూట తింటూ అది కూడా అరటిపళ్లుతోనే కడుపు నింపుకున్నారంట. ఇక పుండరీకాక్షయ్య అదే సమయానికి ఏదో సినిమా డబ్బింగ్ గురించి చర్చ జరుగుతుండగా.. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ వెళ్లారంట.. వెంటనే ఆయన రావయ్యా ప్రసాదు, ఈ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని ఒక అవకాశం ఇచ్చేశారంట. ఇక అక్కడి నుంచి మొదలు.. ఎడాపెడా కొత్తపాత అనే తేడా లేకుండా అందరికీ డబ్బింగ్ చెప్పుకుంటూ కేవలం డబ్బింగ్ వల్ల చెన్నైలో ఇల్లు కట్టేంత డబ్బు సంపాదించారట.
ఇక సొంతూరికి రాజేంద్రప్రసాద్ ఒకసారి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ కూడా ఆ గ్రామానికి వచ్చారని తెలుసుకుని వెళ్లి పెద్దాయన్ని కలిశారంట. ఏం ప్రసాద్ ఏం చేస్తున్నావ్ అని ఎన్టీఆర్ అడిగారంట. డబ్బింగ్ చెబుతున్నాను, హీరో అవుదాం అనుకుంటున్నట్లు నటకిరీటి అన్నారంట. వెంటనే ఎన్టీఆర్ గట్టిగా నవ్వి ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు కదయ్యా, పౌరాణికాలకు నేను, ప్రేమ చిత్రాలకు నాగేశ్వరరావు, ఫైటింగులకు కృష్ణ, అందానికి శోభన్ బాబు ఉన్నారు కదా అన్నారంట. ఎవరి ప్రత్యేకత వారికి ఉంది, మరి నువ్వేం చేస్తావ్ అని అడగ్గా.. వెంటనే రాజేంద్రుడు టక్కున కామెడీ సినిమాలకు ఎవరూ లేరు అవి చేస్తానని అన్నారంట. సరే అయితే ప్రయత్నించి చూడు అని ఎన్టీఆర్ అన్నారంట. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ కామెడీ పాత్రలను ఎంచుకుని అందరిలా నవ్వించడమే కాకుండా కామెడీ చేసే నటుడికి హీరో గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాదు క్విక్ గన్ మురుగన్ అనే సినిమాలో తెలుగు నుంచి మొదటి ఇంగ్లీష్ సినిమాలో నటించింది కూడా రాజేంద్రుడే కావడం విశేషం. ఇప్పటికీ విభిన్న పాత్రలతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తుండటం ప్రత్యేకం.