అనుపమా పరమేశ్వరన్ ఇటీవల తెలుగులో బాగా వినిపిస్తున్న పేరు. కథానాయికగా ఆమె బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. అంతకు ముందు`కార్తికేయ2`, ఇటీవల `18పేజెస్` చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం `బట్టర్ ఫ్లై`తో వచ్చింది. ఆమె చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. అప్‌కమింగ్ దర్శకుడు ఘంటా సతీష్‌బాబు, నిర్మాతలు రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లమెల్లి నిర్మించిన చిత్రమిది. డిసెంబర్ 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉంది, అనుపమా బట్టర్‌ఫ్లై ఎగిరిందా? లేదా అనేది చూద్దాం.
కథః
వైజయంతి(భూమిక), గీత(అనుపమా పరమేశ్వరన్) చిన్నప్పుడే ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతారు. అనాథలుగా పెరుగుతారు. ఎంతో కష్టపడుతూ తాను ఎదిగి, ఓ అమ్మలా మారి తన చెల్లిని పెంచి పెద్ద చేస్తుంది వైజయంతి. ఆమె ఫేమస్ క్రిమినల్ లాయర్. గీత సీఏగా వర్క్ చేస్తుంటుంది. వైజయంతి జడ్జ్ గా ప్రమోషన్ కోసం ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. దీంతో తన ఇద్దరు పిల్లల బాధ్యత చెల్లి గీత చూసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు స్కూల్‌కి బయలుదేరే క్రమంలో పిల్లలిద్దరు కిడ్నాప్ అవుతారు. దీంతో గీత టెన్షన్ పడుతుంది. కొన్ని గంటల తర్వాత కిడ్నాపర్ల నుంచి ఫోన్ వస్తుంది. పదిహేను లక్షల డిమాండ్ చేస్తారు. అక్కడ ఇక్కడ కష్టపడి ఆ అమౌంట్‌ని సమకూర్చుకుని కిడ్నాపర్లకి ఇస్తుంది గీత. అయినా తమ రూల్స్ తప్పారని, మరో 15లక్షల మనీ డిమాండ్ చేస్తుంటారు. పదే పదే ఇదే రిపీట్ అవుతుంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. మరి ఈ సమస్య నుంచి గీత ఎలా బయటపడింది, పిల్లలను కిడ్నాపర్ల నుంచి ఎలా విడిపించింది? ఇంతకి కిడ్నాప్ చేసిన వాళ్లెవరు? కిడ్నాపర్ కి డబ్బుని సమకూర్చుకునే క్రమంలో గీత ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది, ఎలాంటి కష్టాలు పడిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో కథ రన్ అవుతుంది. ఓ మహిళ సంఘర్షణని ఆవిష్కరిస్తుంది. అదే సమయంలో మహిళల బలహీనతలను, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు మగాళ్లు తమలోని రాక్షస బుద్దులను బయటపెడుతుంటారు. అందమైన అమ్మాయి కనిపిస్తే కొందరి మగాళ్లు మృగాళ్లుగా మారి ఎలా ప్రవర్తిస్తారనేది అంతర్లీనంగా చూపించారు. సినిమా కథ వేరు, చెప్పిన సందేశం వేరు. మహిళలు బట్టర్ ఫ్లైగా ఎగరగలరనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్నారు దర్శకుడు. అందుకు కిడ్నాప్ డ్రామాని కథా వస్తువుగా తీసుకున్నారు. తల్లింద్రులు లేని అమ్మాయిలను బంధువులు, సమాజం ఎలా చిన్న చూపు చూస్తుందని ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. మహిళల సాధికారతకు అద్దం పట్టేలా తెరకెక్కించారు.
సినిమాగా చూస్తే మొదటి భాగం సినిమా కాస్త స్లోగా సాగుతుంది. ఇందులో చాలా వరకు పాత్రలను పరిచయం చేయడానికే ఎక్కువ టైమ్ తీసుకున్నట్టు ఉంటుంది. కథని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ సినిమాకి ప్రధాన బలం. కథనాన్ని చాలా గ్రిప్పింగ్‌గా తీసుకెళ్లారు. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్ర స్క్రీన్‌ప్లే కాస్త భిన్నంగా ఉంటుంది. సెకండాఫ్‌లో పూర్తిగా అనుపమా పరమేశ్వరన్ పాత్ర చుట్టూతే సాగుతుంది. డబ్బుల కోసం ఆమె పడే బాధలు, ఆమె ఫేస్ చేసే అవమానాలు మనల్ని కలచివేస్తుంటాయి. ఆమె బాధ మనం ఫీలయ్యేలా చేస్తుంటాయి. ఈక్రమంలో `అమ్మ` అంటూ వచ్చే పాట సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. మన హృదయాలను బరువెక్కేలా చేస్తుంది.
సమాజంలో ఆడదానికి రక్షణ లేదని, అమ్మ కడుపు, స్మశానంలోనే వారికి రక్షణ ఉందని కోర్ట్ లో భూమిక చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. సినిమాలో అంతర్లీనంగా అదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్. కాకపోతే దాన్ని మరింత బలంగా ఆవిష్కరించి ఉంటే బాగుండేది. దీనికితోడు కొన్ని సీన్లు ఊహించినట్టే సాగడం గమనార్హం. అదే సమయంలో కిడ్నాప్ డ్రామాలో కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యాడు. వాటిపై ఇంకా ఫోకస్ పెడితే మరింత గ్రిప్పింగ్‌గా, మరింత సస్పెన్స్ ని క్రియేట్ చేసేలా ఉండేది. క్లైమాక్స్ లో అనుపమా ఎదురుతిరిగే సీన్లు అదిరిపోయేలా ఉంటాయి. క్లైమాక్స్ ని మరింత బలంగా డిజైన్ చేసుకుంటే, థ్రిల్లింగ్ అంశాలను మేళవిస్తే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. మొత్తంగా మంచి సందేశాత్మక చిత్రంగా నిలిచిందని చెప్పొచ్చు.
నటీనటులుః
సినిమాని తన భుజాలపై వేసుకుని మోసింది అనుపమా పరమేశ్వరన్. గీత పాత్రలో అదరగొట్టింది. తన నట విశ్వరూపం చూపించింది. పిల్లల కోసం ఆమె పడే తపన, బాధ, టెన్షన్ ఆడియెన్స్ ఫీలయ్యేలా చేసింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. క్యూట్ పాత్రల్లో మెప్పించే అనుపమా ఇలాంటి బలమైన పాత్రల్లోనూ మెప్పించగలదనే విషయాన్ని చాటి చెప్పింది. నటిగా అనుపమాలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. ఆమె పెయిర్‌గా నిహాల్ కోదాటి పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. ఉన్నంతలో ఫర్వాలేదు. అలాగే భూమిక ఉన్న కాసేపు అయినా అదరగొట్టింది. క్రిమినల్ లాయర్‌గా భూమిక ఎంతటి బలమైన పాత్రదో ఒక్కసీన్లో చెప్పారు. పనిమనిషి బేబీగా చేసిన ఆర్టిస్టు చాలా బాగా చేశారు. ఇక రావు రమేష్, రచ్చ రవి, వెన్నెల రామారావు ఫర్వాలేదనిపించారు. అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్‌గా చేసిన ఫణి ప్రకాష్ నటన బాగుంది. వినోదాన్ని పంచింది.
టెక్నీషియన్లుః
దర్శకుడు సతీష్ కిడ్నాప్ డ్రామాలో మహిళా సాధికారతను, మహిళలు తక్కువ కాదని, వాళ్లు ఎగరగలరనే విషయాన్ని చెప్పాలనుకోవడం ఇందులో కొత్త పాయింట్. అదే ఈ సినిమాని రెగ్యూలర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో భిన్నంగా ఉంచింది. దర్శకుడిగా ఆయన పడిన కష్టం కనిపిస్తుంది. దక్షిణ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో బలం. అర్విజ్, గిడియన్ కట్టా బీజీఎంలో, పాటల్లో తమ ప్రతిభని చూపించారు. సమీర్‌రెడ్డి విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. రిచ్ లుక్‌ని తీసుకొచ్చారు. మరోవైపు నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గాః అనుపమా పరమేశ్వరన్ గొంగళి పురుగు దశ నుంచి సీతాకోక చిలుకలా పరిణామం చెందింది. మరి సీతాకోక చిలుకలా ఎంత వరకు ఎగురుతుందనేది చూడాలి.
రేటింగ్‌ః 2.5
నటీనటులు : అనుపమా పరమేశ్వరన్, నిహాల్ కోదాటి, భూమికా చావ్లా, రావు రమేష్, ప్రవీణ్, 'రచ్చ' రవి, ప్రభు, రజిత, 'వెన్నెల' రామారావు, మేఘన, మాస్టర్ దేవాన్షు, బేబీ ఆద్య తదితరులు
మాటలు : దక్షిణ్ శ్రీనివాస్
పాటలు : అనంత్ శ్రీరామ్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : అర్విజ్, గిడియన్ కట్టా
నిర్మాతలు : రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి
కథ, కథనం, దర్శకత్వం : ఘంటా సతీష్ బాబు.