
సుభాష్‍కు స్ట్రోక్ రావడానికి రేఖ ఇంజక్షన్ వేసేస్తుంది. దీంతో ఇందు, అపర్ణ కంగారుపడతారు. హాస్పిటల్‍కు తీసుకెళ్తేసమయానికి ఉంటాడో, పోతాడో చెప్పలేను అని రేఖ పెడసరంగా ఉంటుంది. అప్పుడు అపర్ణ రేఖపై అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావంటూ రేఖ అపర్ణపై కోప్పడుతుంది. నీ పొగరు వల్ల నీ భర్త చావుబతుకుల మధ్య ఉన్నాడని, నన్ను ఎదురించాలన్న ఈ ధైర్యమే..ఈరోజు మృత్యువుగా మారిందని రేఖ అంటుంది. ఏంటీ బెదిరిస్తున్నావా అని అపర్ణ అంటే...ఎందుకు నాన్నమ్మ నీకు దండం పెడతాను, తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది, నువ్వు సైలెంట్‍గా ఉండు అని ఇందు అంటుంది. మా నాన్నమ్మ చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతా, ముందు మా తాతయ్యకు ఇవ్వాల్సిన యాంటీ డోస్ చెప్పండని ప్రాధేయపడుతుంది. అది నా దగ్గరే ఉన్నా నేను ఇవ్వాలనుకోవడం లేదని రేఖ అంటుంది. పాపం ఇందు కాళ్లమీద పడి వేడుకుంటుంది. నిన్ను చూస్తే జాలిగా ఉంది కాబట్టి, నా బెడ్ రూంలో ఉందని చెప్పి పంపిస్తుంది.
అయినా అక్కడ కూడా యాంటీ డోస్ ఇంజక్షన్ ఉండదు. ఇందు అన్నీ వెతుకుతుంది. అక్కడ లేదని రేఖకు చెప్తుంది. అయ్యో ఇందు మరిచిపోయా...అది మీ తాతయ్య బెడ్ రూంలో ఉండదంటుంది. ఇలా భ్రమరాంబ గదిలో, ఐశ్వర్య గదిలో, స్వాతి గదిలో ఉందని ఇందును ఇబ్బంది పెడుతుంది. అటు సుభాష్ బ్రీతింగ్ ప్రాబ్లమ్‍తో ఇబ్బంది పడుతుంటాడు. పాపం ఇందు ఇంజక్షన్ కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి మెట్ల మీద కూడా పడిపోతుంది.
అప్పుడు అపర్ణ ఇందును ఆగమంటుంది. ఆ ఇంజెక్షన్ ఇంట్లో ఎక్కడా లేదని, రేఖ దగ్గర మాత్రమే ఉందని అపర్ణ అంటుంది. సరిగ్గా గెష్ చేశావంటీ, నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నావ్ కదా..నువ్వు ఎప్పుడు, ఎవరిని కలుస్తున్నావో నాకు తెలీదనుకుంటున్నావా అని రేఖ అపర్ణతో అంటుంది. నువ్వు లాయర్‍ను కలవడం నాకు తెలీదనుకుంటున్నావా? ఎంత ధైర్యముంటే నా మీద కేసు వేయాలనుకుంటున్నావా, నా పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటార్నీని నీ మనవరాలి పేరు మీద మార్చేయలనుకున్నావ్ కదా అని రేఖ అంటుంది.
చివరకు అపర్ణ రేఖ కాళ్లమీద పడి క్షమించమని అడుగుతుంది. నువ్వు చెప్పినట్లే వింటానని వెక్కివెక్కి ఏడుస్తుంది. ఇప్పుడు నీ కళ్లల్లో భయం కనిపిస్తోంది, ఆ భయం ఎప్పుడూ ఇలానే ఉండాలి, అది దూరమైన రోజు మళ్లీ ఇలానే ఉంటుంది. అప్పుడు మాత్రం జాలి చూపించనని రేఖ అంటుంది. ఇక ఆ తర్వాత భూషణ్ దగ్గర ఉన్న యాంటీ డోస్ ఇంజక్షన్ ఇప్పిస్తుంది. నువ్వు డాక్టర్‍ను తెప్పించినప్పుడు కంగారు పడిపోయా, కానీ ఇప్పుడు అర్థమైంది ఆ అపర్ణలో పొగరు దింపడానికని. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ అపర్ణ వింటుంది, చెప్పినచోట ఇందు సంతకం పెడుతుందని రేఖ అంటుంది. ఎందుకు పెట్టదు, లేకపోతే ఆ ముసలాడు చస్తాడు కదా అని భ్రమరాంబ పైశాచిక ఆనందం పొందుతుంది.
అమ్మో అమ్మో నువ్వు పైకి అమాయకురాలిలాగా కనిపిస్తున్నావ్ గానీ...వెనుక నుండి బాగానే నడిపిస్తున్నావని భ్రమరాంబ అంటుంది. ఏదో ఒకటి చేసి తన మనవరాలికి ఆస్తి మొత్తం ఇచ్చేయాలని చూస్తోందని రేఖ అంటుంది. ఏంటీ నాన్నమ్మ ఇదంతా, రేఖ ఆంటీ చెప్పేదంతా నిజమా అని ఇందు అడుగుతుంది. నీకు తెలియకుండా మీ నాన్నమ్మ వెనుకనుంచి ఇంత నడిపించిందా అని రేఖ అంటుంది. అమ్మ మీద ఒట్టు వేస్తున్నా ఆంటీ నాకు ఇదేం తెలీదు అని ఇందు అంటుంది. మీరు నన్ను వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నా మిమ్మల్ని నేను క్షమించేయాలా అని రేఖ అంటుంది. నువ్వేమో చెప్పకుండా బయటకి పోతావ్, మీ నాన్నమ్మేమో నేనంటే లెక్కేలేకుండా నోరు జారడం నాకస్సలు నచ్చలేదు, అందుకే వీటన్నింటికి శిక్ష పడాలి అని రేఖ అంటుంది. కేసు వాపస్ తీసుకుంటాం, మా నాన్నమ్మ మీరు చెప్పినట్టే వింటుందని ఇందు అంటుంది. మీ నాన్నమ్మ కోసం నువ్ బాగానే బాధపడుతున్నావ్, కానీ మీ నాన్నమ్మకు ఎలాంటి బాధ లేదు, నీకెందుకు ఇంత కష్టం అని రేఖ అంటుంది.
యాంటీ డోస్ ఇంజక్షన్ ఇవ్వగానే ఇందు వెళ్లి సుభాష్‍కు వేస్తుంది. నాదే తప్పు అండి, మిమ్మల్ని వదిలి వెళ్లడం చాలా పెద్ద తప్పు అని అపర్ణ అంటుంది. అసంలేంటీ నాన్నమ్మ ఇదంతా, తాతయ్యను వదిలి ఎలా వెళ్లావని అడుగుతుంది. నువ్వు చేసిన పనికి రేఖకు కోపం వస్తుందని తెలీదా? అసలెందుకు లాయర్‍ను కలవడానికి వెళ్లావని ఇందు అడుగుతుంది. నీకోసమే ఇదంతా చేశానని అపర్ణ అంటే..నా కోసం తాతయ్య ప్రాణాలు పణంగా పెడతావా అని ఇందు అంటుంది. నీ కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదని అపర్ణ అంటుంది. ఒకప్పుడు నువ్వు చిన్న పిల్లవని, ఆ రాక్షసి నుంచి నిన్ను కాపాడటానికి ఎక్కడ పెట్టమంటే సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టానని అపర్ణ అంటుంది.
ఇప్పుడు మేజర్‍వి ఈ ఆస్తి నీపేరుమీదకు రావాలనే నా తాపత్రయమంతా అని అపర్ణ బాధపడుతుంది. నిన్ను బానిసలా చూస్తుంటే మౌనంగా ఉండలేకపోతున్నా అని అపర్ణ అంటే...ఇక చాలు నాన్నమ్మ నాకు కావాల్సింది న్యాయం, ధర్మం కాదు, నా లక్ష్యమొక్కటే...మిమ్మల్ని కాపాడుకోవడమని ఇందు అంటుంది. నేను చాలా కోల్పోయా, ఇప్పుడు మీరు కూడా దూరమైతే నేను ఏమైపోతానో అని ఒక్కసారైనా ఆలోచించారా అని ఇందు అడుగుతుంది. నా చిన్నప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు...అమ్మనాన్నలుగా మీరిద్దరూ నన్ను నడిపించారు, అలాంటిది మీరే లేకపోతే ఈ ఆస్తితో ఏం చేసుకుంటానని ఇందు అంటుంది. మీ అమ్మనాన్నల ఆశయాలు నిజం చేయాలని అపర్ణ అంటే...అలా చేయాలంటే నువ్వు రేఖ చెప్పినట్లే వినాలని ఇందు మాట తీసుకుంటుంది. ఈ యుద్ధం నాది, పోరాడాల్సింది నేను, ఏం జరిగినా నేను చూసుకుంటానని ఇందు అంటే...ఆ ఇందు ఏమైనా చేస్తుందని, చాంపడానికైనా సిద్ధంగా ఉందని అపర్ణ అంటుంది. ఆస్తి సొంతమయ్యే వరకూ రేఖ నన్ను ఏం చేయలేదని ఇందు అంటుంది.