
బిగ్ బాస్ తెలుగు 10కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు 9 ముగిసింది. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అయ్యాడు. అగ్నిపరీక్ష ద్వారా వచ్చి ఆయన విజేతగా నిలవడం విశేషం. ఇక పదవ సీజన్‌కి సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. కానీ ఇప్పట్నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.
బిగ్ బాస్ షోకి సంబంధించి మొదటగా ఒక ప్రోమో వస్తుంది. షో ఎలా ఉండబోతుందనేది నాగార్జున వివరిస్తారు. షో పై హైప్ ఇచ్చేలా ఈ ప్రోమోని కట్ చేస్తారు. ఇది ప్రతి సీజన్‌కి డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ సారి కూడా సరికొత్తగా ప్లాన్ చేశారు. తాజాగా ఈ ప్రోమో వచ్చింది. నాగార్జున మీదనే ఈ ప్రోమో సాంగ్‌ని డిజైన్ చేశారు. దీనికి ఆర్టిస్ట్, ర్యాప్ సింగర్ నోయల్ సాంగ్ కంపోజ్ చేయడం విశేషం. ర్యాప్ స్టయిల్‌లో ఈ సాంగ్‌ని డిజైన్ చేశారు. తాజాగా దీన్ని విడుదల చేశారు. బిగ్ బాస్ దశావతారం పేరుతో దీన్ని రిలీజ్ చేయడం విశేషం.
ఇందులో నాగార్జున చెబుతూ, బిగ్ బాస్ ఎన్నో యుద్ధాల్ని గెలిచిన రాజ్యమే కాదు, ఎంతో మంది హృదయాల్ని గెల్చుకున్న మహా సామ్రాజ్యం. ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు, లవ్ చేసే అభిమానులు చెబుతారు` అని నాగార్జున ఇంట్రో ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు 10 కోసం నోయల్ కంపోజ్ చేసిన సాంగ్‌ని చూపించారు. బిగ్ బాస్ స్పెషాలిటీని వివరిస్తూ ఈ పాట సాగింది. ఒత్తిడి రిలీఫ్ బిగ్ బాస్ అని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ షో ఉంటుందని తెలిపారు. ఎండింగ్‌లో నాగ్ చెబుతూ, చెరగని ప్రస్థానం, తరగని అభిమానం బిగ్ బాస్ సొంతం, ఈ ప్రస్థానంలో ఇంకో కొత్త ఛాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్` అని ముగించారు నాగార్జున. ఈ సీజన్‌పై ఆసక్తిని పెంచారు.
ఇక ప్రోమో సాంగ్‌ని తాను కంపోజ్ చేసిన విషయాన్ని నోయల్ పంచుకున్నాడు. `బిగ్ బాస్ సీజన్ 10 అధికారిక ప్రోమో సాంగ్‌ని నేనే స్వరపరిచానని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. బిగ్ బాస్ ఏ సీజన్‌కైనా ఇదే మొదటి ప్రోమో సాంగ్ అనే నేను భావిస్తున్నాను. చాలా కాలం తర్వాత నాగార్జున, మొత్తం బిగ్ బాస్ టీమ్‌ని కలవడం ఆనందంగా ఉంది. ఇదొక మరువలేని క్షణం, ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కి ధన్యవాదాలు` అని చెబుతూ, బిగ్ బాస్ టీమ్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు నోయల్. ఇందులో నాగార్జున కూడా ఉన్నారు.
గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా అగ్నిపరీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. సీజన్ 2 పేరుతో దీన్ని నిర్వహించబోతున్నారట. దీని ద్వారా కామన్ మ్యాన్‌ని ఎంపిక చేయనున్నారట. అయితే ఈ సారి కాస్త ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లాస్ట్ టైమ్ ఏడుగురుకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సారి ఆ సంఖ్య పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2కి శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ జడ్జ్ లుగా వ్యవహరిస్తారని సమాచారం. అగ్నిపరీక్షకి సంబంధించిన ప్రకటన త్వరలో వస్తుంది, ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగైదు లేయర్స్ లో ఫిల్టర్ చేస్తారు. చివరికి వారితో అగ్ని పరీక్ష నిర్వహించి, అందులోనుంచి కంటెస్టెంట్లని ఎంపిక చేస్తారు. మరి ఈ సారి ఎవరు వస్తారనేది చూడాలి.
ఇదిలా ఉంటే పదవ సీజన్‌లో బిగ్ బాస్ షోకి సెలబ్రిటీ విభాగంలో ఎవరు కంటెంస్టెంట్లుగా రాబోతున్నారనేది చూస్తే తేజస్విని గౌడ, శివకుమార్, ఈటీవీ ప్రభాకర్‌గానీ, ఆయన కొడుకు చంద్రహాస్‌గానీ వచ్చే అవకాశం ఉందట. అలాగే పల్లవి గౌడ, ఎక్స్ ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, వంటి వారు రాబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరికి బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్స్ వచ్చాయని, కొందరు ట్రై చేస్తున్నారని సమాచారం. మరి వీరిలో ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. రెగ్యూలర్ షో మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం కానుందని సమాచారం.