అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయిన బిగ్ బాస్ షో టాలీవుడ్‌లోనూ ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సీజన్‌లు సక్సెస్ కాగా తాజాగా నాలుగవ సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. కరోన నేపథ్యంలో ఈ సారి షో ఉండదని భావించినా.. అన్ని జాగ్రత్తలతో షో నిర్వహించేందుకే నిర్ణయించారు యూనిట్. ఈ మేరకు ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
మూడో సీజన్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగార్జున మరోసారి బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే నాగ్ పై రూపొందించిన ప్రోమోలు కూడా ప్రసారం అవుతున్నాయి. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 29 లేదా 30 తారీఖుల్లో షోను ప్రారంభించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్‌లను ఎంపిక చేసిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ అని నిర్థారించుకొని వారిని క్వారెంటైన్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వారంతా బస చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యూనిట్‌ను కలవరపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది.
ముందుగా చేసిన టెస్ట్ లో నెగెటివ్ వచ్చినా.. తాజాగా క్వారెంటైన్‌లో ఉంటున్న ఓ కంటెస్ట్ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో యూనిట్ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కంటెస్టెంట్‌కు చికిత్స అందిస్తుండగా షో ప్రారంభమయ్యే సమయానికి నెగెటివ్ వస్తుందా లేదా అన్న సందిగ్థంలో ఉన్నారట. అధికారికంగా వెల్లడించకపోయినా.. ఓ యంగ్ కంటెస్టెంట్ కరోనా బారిన పడిన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
పాజిటివ్ వచ్చిన కంటెస్టెంట్ యువ గాయకుడు కావటంతో త్వరగానే తగ్గిపోయే అవకాశం ఉందన్న నమ్మకంతో ఉన్నారట యూనిట్ సభ్యులు. ఒక వేళ తగ్గకపోతే అతడిని హౌస్‌లోకి పంపే అవకాశం లేదు. ప్రస్తుతానికి బిగ్ బాస్ టీం కంటెస్టెంట్‌ల లిస్ట్ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి, ఫైనల్‌గా ఎవరు హౌస్‌లోకి వస్తే వాళ్లే ఫైనల్ కంటెస్టెంట్లు.
ఇక త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 4లో నందు, నోయల్ సీన్, గంగవ్వ, సింగర్ సునీత, కరాటే కళ్యాణీ, యూట్యూబర్ హారిక, జబర్దస్త్ అవినాష్, యూ ట్యూబర్ మెహబూబ్ షేక్ లు పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో నందు మాత్రం తాను బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు.