
టాలీవుడ్ లో డిటెక్టివ్ తరహా చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒకవేళ డిటెక్టివ్ మూవీస్ వచ్చినా కామెడీ టచ్ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం డిటెక్టివ్ జోనర్ లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మంచి కంటెంట్ తో వస్తే డిటెక్టివ్ చిత్రాలకు కూడా టాలీవుడ్ లో ఆదరణ ఉంటుందని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రం నిరూపించింది. ఇప్పుడు అదే జోనర్ లో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ. శివ కందుకూరి నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులని అలరించిందా? డిటెక్టివ్ చిత్రాల్లో ఉండాల్సిన కిక్ ఉందా అనేది సమీక్షలో చూద్దాం.
కథ :
ఒక సైకో కిల్లర్ ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో చేసే వరుస హత్యలు సంచలనంగా మారుతుంటాయి. చాలా కిరాతకంగా ఆ సైకో హత్యలు చేస్తుంటాడు. మహిళల తలలు తీసేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతూ కిరాతక ఆనందం పొందుతుంటారు. సైకోని కిల్లర్ కేసుని ఛేదించడానికి పోలీసులు నానా తిప్పలు పడుతుంటారు. అప్పడే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ( శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. సైకో కిల్లర్ కథని దర్శకుడు పురాణాలతో ముడిపెట్టాడు.
ఒక్క క్లూ కూడా వదలని సైకో కిల్లర్ ని హీరో పట్టుకోగలిగాడా ? పురాణాలకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి ? సైకో కిల్లర్ దిష్టిబొమ్మలు ఎందుకు పెట్టాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
డిటెక్టివ్, సస్పెన్స్ చిత్రాలతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇవ్వాలి. ఆ విషయంలో బూతద్దం భాస్కర్ నారాయణ చిత్రానికి మంచి మార్కులు ఇవ్వొచ్చు. ఈ చిత్రంలో చివరి వరకు ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ కుదిరింది. కథని పురాణాలకి లింక్ చేయడం, హత్యలు చేసి దిష్టి బొమ్మలు పెట్టడం చాలా బాగా కుదిరాయి. ఈ అంశాలతో తెలుగులో సైకో థ్రిల్లర్ మూవీ రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.
హీరో పాత్రని చిన్ననాటి నుంచి చూపిస్తూ ఆడియన్స్ కి అతడి స్వభావం బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు దర్శకుడు పురుషోత్తం రాజ్. హీరో నటించే ఫన్ ఎలిమెంట్స్ బాగా కుదిరాయి. ఇక ప్రేమ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ మాత్రమే మెప్పిస్తాయి. ప్రేమ సన్నివేశాలు కథ ఫ్లోని అడ్డుకున్నాయి అనే చెప్పాలి. దర్శకుడు ఈ కథకి రాసుకున్న పురాణాల అంశం కొత్తదనం తీసుకువచ్చింది. చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి సెకండ్ హాఫ్ లో రివీల్ చేయడం బావుంది.
డిటెక్టివ్ పాత్రలో శివ కందుకూరి ఒదిగిపోయారు. డిటెక్టివ్ అంటే హ్యాట్ పెట్టుకుని డిఫెరెంట్ లుక్ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో దర్శకుడు హీరో లోకల్ బాయ్ లాగా కనిపించాలని భావించారు. అందులో హీరో సాధారణ గెటప్ లో కనిపిస్తాడు. భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి అదరగొట్టేసాడు అనే చెప్పాలి. విలేకరి పాత్రలో రాసి సింగ్ పర్వాలేదనిపించింది.
ఫస్టాఫ్ మొత్తం ఫన్ ఎలిమెంట్స్ తో, లవ్ సీన్స్ తో, సస్పెన్స్ తో సాగిపోతూ ఉంటుంది. హత్యలు మొదలయ్యాక కథ సీరియస్ గా ఉంటుంది.. అక్కడికి నుంచి చివరి వరకు కథ సీరియస్ గానే ఉంటుంది. అంచెలంచెలుగా ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠగా మారుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కాస్త సాగదీసినట్లుగా బోరింగ్ గా ఉంటాయి. రీపీట్ గా అవే సన్నివేశాలు వచ్చినట్లు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లో ఇచ్చిన ఫినిషింగ్ బావుంది. సెకండ్ హాఫ్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టి ఉంటే బూతద్దం భాస్కర్ నారాయణ తిరుగులేని చిత్రం అయి ఉండేది.
నటీనటులు :
ముందుగా చెప్పినట్లుగా శివ కందుకూరి పాత్ర ఈ చిత్రానికి పెద్ద బలం. ప్రతి సన్నివేశంలో శివ కందుకూరి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. దర్శకుడు అంత చక్కగా శివ కందుకూరి పాత్రని తీర్చి దిద్దారు. దేవి ప్రసాద్, వర్షిణి, శివకుమార్ తమ పాత్రల మేరకు బాగానే నటించారు.
టెక్నీకల్ గా :
శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కావాల్సిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో శ్రీచరణ్ ఎంగేజ్ చేయగలిగారు. అయితే బిజియంతో సన్నివేశాలని మరో స్థాయికి తీసుకెళ్లే స్కోప్ కూడా కథలో ఉంది. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ అద్భుతంగా వర్కౌట్ అయింది. కెమెరామెన్ అందించిన విజువల్స్ చాలా బావున్నాయి. నిర్మాతలు ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఫైనల్ గా : సైకో కిల్లర్ జోనర్ లో ట్రై చేసిన గుడ్ అటెంప్ట్ ఈ చిత్రం. ఈ తరహా చిత్రాలపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా బూతద్దం భాస్కర్ నారాయణని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ : 2.75
నటీనటులు: శివ కందుకూరి, రాసి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరాజన్
సాంకేతిక వర్గం :
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కార్తీ
దర్శకత్వం : పురుషోత్తం రాజ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : గౌతమ్ జార్జ్