బాలకృష్ణ, రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ అంతా కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఈ ముగ్గురు తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి, వినడానికి చూడటానికి మాటలు చాలవు, వినడానికి చెవులు సరిపోవు, చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అంతకు మించి ఇంకా ఏదైనా కావాల్సిందే. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ జరుగుతుందట. దీనికి సంబంధించిన క్రేజీ లీక్ వినిపిస్తుంది.
రజనీకాంత్ హీరోగా నటించిన `జైలర్` సినిమా గతేడాది వచ్చి పెద్ద విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ 650 కోట్ల వరకు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించగా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ గెస్ట్ రోల్స్ చేశారు. జాకీ ష్రాఫ్ సైతం కాసేపు మెరిశారు. సినిమా పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా `జైలర్ 2`ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. తాజాగా ఈ మూవీ ప్రకటన రాబోతుంది. సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 14)న ఈ మూవీని ప్రకటిస్తారట. సన్ పిక్చర్స్ ఓ అప్‌డేట్‌కి సంబంధించిన క్రేజీ ప్రోమోను ప్లాన్ చేస్తుంది. అంతేకాదు తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాని ప్రకటకు సంబంధించిన ప్రోమో(టీజర్)ని విడుదల చేయబోతున్నారు. అయితే అదేంటనేది వెల్లడించలేదు. కానీ `జైలర్ 2` ప్రకటన అని అంతా మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇందులో కాస్టింగ్‌కి సంబంధించిన గూస్ బంమ్స్ లీకేజీ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తారని తెలుస్తుంది. కీలక పాత్రలోగానీ, `జైలర్` మాదిరిగా గెస్ట్ రోల్‌గానీ చేయబోతున్నారని సమాచారం. అయితే గతంలోనే `జైలర్ 2`లో బాలయ్య కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది.
రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్‌తోపాటు బాలకృష్ణ కూడా కనిపిస్తారని అంటున్నారు. నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్స్ తో `జైలర్ 2`ని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియదు. దీనిపై రేపు క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీసు షేక్ కావడం ఖాయం. ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం.