
నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీసు వద్ద పోటీ పడటం చాలా అరుదు. ఇప్పుడు వీరిద్దరు ఒకేసారి థియేటర్లోకి రాబోతున్నారు. రెండు భారీ సినిమాలు ఓకే రోజు విడుదల కాబోతున్నాయి.
ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు వస్తే రచ్చ వేరేలా ఉంటుంది. థియేటర్ల విషయంలో దెబ్బ పడుతుంది, అంతిమంగా కలెక్షన్ల పరంగానూ దెబ్బ పడుతుంది.
ఇది రెండు చిత్రాలకు నష్టమనే చెప్పాలి. అయితే ఈ విషయంలో ఇద్దరూ తగ్గేలా లేకపోవడమే ఇప్పుడు పెద్ద రచ్చగా మారుతుంది. టాలీవుడ్‌లో డిస్కషన్‌గా మారింది.
బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో సంయుక్త, ఆదిపినిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కొత్త అమ్మాయిని పరిచయం చేశారు.
హర్షాలి మల్హోత్రా ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తుంది. జననిగా ఆమె కనిపించబోతున్నట్టు వెల్లడించారు. హర్షాలి మల్హోత్రా సల్మాన్ ఖాన్ నటించిన `భజరంగీ భాయిజాన్` చిత్రంలో బాల నటిగా నటించింది.
ఇప్పుడు `అఖండ 2ః తాండవం`లో కీలక పాత్రలో కనిపించబోతుందట. తాజాగా విడుదల చేసిన ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఎంతో క్యూట్‌గా ఉంది.
`అఖండ 2` చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంది.
అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు గతంలోనే టీమ్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.
ఈ మూవీ వాయిదా పడబోతుందనే వార్తలు గతంలో వచ్చిన నేపథ్యంలో రిలీజ్ డేట్‌లో మార్పు లేదనే విషయాన్ని తాజా పోస్టర్‌తో చెప్పకనే చెప్పేశారు. అయితే ఇదే ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.
ఇప్పటి వరకు `అఖండ 2`నే వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ రిలీజ్ డేట్‌లో మార్పు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` సినిమా వాయిదా పడుతుందనే పుకార్లు ఊపందుకున్నాయి.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ `ఓజీ` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ముంబాయి ప్రధానంగా గ్యాంగ్ స్టర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ పై సీన్లు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీని కూడా సెప్టెంబర్ 25నే విడుదల చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా `అఖండ 2` రిలీజ్ డేట్‌ని మరోసారి కన్ఫమ్ చేస్తూ టీమ్ పోస్టర్‌ని విడుదల చేయడంతో ఇక పవన్ కళ్యాణ్ `ఓజీ` వాయిదా పడుతుందంటూ చర్చ మొదలైంది. దీంతో `ఓజీ` నిర్మాత డీవీవీ దానయ్య సైతం క్లారిటీ ఇచ్చారు.
తాము తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. రూమర్లని నమ్మవద్దని తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. మరి బాలయ్య తగ్గకుండా, పవన్ కళ్యాణ్ తప్పుకోకుండా పంతానికి పోతే నష్టపోయేది, మధ్యలో బలయ్యేది నిర్మాతలు మాత్రమే అని చెప్పొచ్చు.
అయితే ఈ విషయంలో ఆ నిర్మాతలే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి రిలీజ్‌కి ఇంకా మూడు నెలలు ఉంది. కావున ఆ లోపు ఏ పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.