Badava Rascal telugu Review: `బడవ రాస్కల్‌` సినిమా రివ్యూ.. `పుష్ప` విలన్‌ తెలుగులో అదరగొట్టాడా?

First Published | Feb 18, 2022, 11:00 PM IST

`పుష్ప` చిత్రంలో జాలిరెడ్డి అనే విలన్‌ పాత్రతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన కన్నడ నటుడు ధనుంజయ్‌ కన్నడలో నటించిన `బడవ రాస్కెల్‌` చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

`పుష్ప` చిత్రంలో జాలిరెడ్డి అనే విలన్‌ పాత్రతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు కన్నడ నటుడు ధనుంజయ్‌. ఇందులో ఆయన నటనకు మంచి పేరొచ్చింది. ఆ పేరుని వాడుకుని తెలుగులో మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ధనుంజయ్‌. అందులో భాగంగా ఆయన ఇటీవల హీరోగా నటించిన  కన్నడ చిత్రాన్ని తెలుగులో `బడవ రాస్కెల్‌`(Badava Rascal Movie) పేరుతో విడుదల చేశారు. దీనికి గురు శంకర్‌ దర్శకత్వం వహించగా, ధనుంజయ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రిజ్వాన్‌ రిలీజ్‌ చేశారు.  కన్నడలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 18)న విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది `బడవ రాస్కెల్‌` రివ్యూ(Badava Rascal Review)లో తెలుసుకుందాం. 

కథః
శంకర్‌(ధనుంజయ్‌) ఆటో డ్రైవర్‌. ఎంబీఏ చదివిన శంకర్‌ తండ్రిలాగే ఆటో డ్రైవర్‌గానే జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఓ పొలిటికల్ లీడర్‌ కుమార్తె సంగీత(అమృతా అయ్యర్‌)ని ప్రేమిస్తాడు. శంకర్‌ ఆటో డ్రైవర్‌ అని తెలిసీ కూడా సంగీత అతనితో పీకల్లోతు ప్రేమలో మునుగుతుంది. ఇద్దరూ మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటారు. కానీ చివరి నిమిషంలో సంగీత హ్యాండిస్తుంది. మరి సంగీత ఉన్నట్టుండి శంకర్‌ని వద్దనుకోవడానికి కారణమేంటి? ఎంబీఏ చేసిన శంకర్‌ ఎందుకు ఆటోడ్రైవర్‌గా కొనసాగుతుంటాడు? చివరికి వీరి ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.

Latest Videos


విశ్లేషణః 
`బడవ రాస్కెల్‌` కథ పరంగా రెగ్యూలర్‌ స్టోరీ అనే చెప్పాలి. ఇలాంటి కథలు తెలుగులో చాలా కథలు వచ్చాయి. ఒకప్పుడు ప్రేమ కథలకు ఇలాంటి కథే మూలంగా ఉండేది. అయితే దాన్ని ఎంత కొత్తగా స్క్రీన్‌ప్లే ఆవిష్కరించారనేది ముఖ్యం. ఆకట్టుకునేలా, ఎంటర్‌టైన్‌ చేసేలా చెప్పడంలో దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `బడవ రాస్కెల్‌` విషయంలో దర్శకుడు ఆ కొత్త ప్రయత్నం చేశారనిపిస్తుంది. రొటీన్‌ కథని భిన్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దీనికితోడు తండ్రి కొడుకుల బంధం, తల్లీకొడుకు సెంటిమెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. Badava Rascal Telugu Review.

దర్శకుడు గురు శంకర్‌కిది తొలి చిత్రం. ఆ తాలుకూ అనుభవలేమి సినిమాలో కనిపిస్తుంది. సినిమా కాస్త స్లోగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ మధ్య మధ్యలో వచ్చే మెరుపులు రిలీఫ్‌నిస్తుంటాయి. కథ, కథనాలను మరింత వేగంగా చూపిస్తే కచ్చితంగా ఇదొక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంగా నిలిచేది. ఫస్టాఫ్  వేగంగానే సాగినప్పటికీ.. సెకండాఫ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది. కానీ విడి విడిగా తల్లి, కొడుకు, తండ్రి కొడుకు మధ్య ఉండే సెంటిమెంట్ హృదయానికి హత్తుకొంటుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్‌ దాన్ని డామినేట్‌ చేస్తాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.  

నటీనటుల పరంగా ఆటో డ్రైవర్‌ శంకర్‌ పాత్రలో ధనుంజయ్‌ పరకాయ ప్రవేశం చేశాడు. యాప్ట్ గా అనిపించుకున్నారు. పాత్రకి తగ్గట్టుగానే యాటిట్యూడ్ చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. తల్లితో శంకర్ చెప్పే డైలాగ్స్, తండ్రితో పంచుకొనే భావోద్వేగం ఆకట్టుకొంటుంది. అనువాదం సినిమాలకు డబ్బింగ్‌ ప్రధాన సమస్యగా ఉంటుంది. సహజత్వం మిస్‌ అవుతుంటుంది. ఈ సినిమా విషయంలో ఇంకాస్త కేర్‌ తీసుకోవాల్సింది.  శంకర్ ప్రియురాలిగా అమృత తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. శంకర్ తల్లిదండ్రులుగా తార, రంగాయణ రఘు తమదైన స్టయిల్‌లో మెప్పించారు. హైలైట్‌గా నిలిచారు. శంకర్ ఫ్రెండ్‌ నాగలింగ‌గా నటించిన నాగభూషణ్ కామెడీని పండించాడు. సంగీత తల్లిగా స్పర్ష రేఖ నెగిటివ్ షేడ్స్‌ పాత్రతో మెప్పించింది. Badava Rascal Telugu Review.

టెక్నీకల్‌గా.. వాసుకి వైభవ్‌ సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది. మాస్‌ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్‌గా ప్రీతా జయరామన్ కెమెరా వర్క్ బాగుంది. సినిమా కథకి కావాల్సిన టోన్‌లో విజువల్స్ ఉన్నాయి. డాలీ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుంజయ్ ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా రిజ్వాన్‌ విడుదల చేశారు. డబ్బింగ్‌ సినిమాని స్ట్రెయిట్‌ సినిమా మాదిరిగా ప్రమోట్‌ చేసి విడుదల చేయడం విశేషంగా చెప్పొచ్చు. 

రేటింగ్‌-2.75

నటీనటులు: ధనుంజయ, అమృతా అయ్యంగార్, నాగభూషణ్, రంగాయణ రఘు, తారా, స్పర్ష రేఖ తదితరులు
దర్శకత్వం: గురు శంకర్
బ్యానర్: డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాత: ధనుంజయ, గుజ్జల్ పురుషోత్తం, రిజ్వాన్
మ్యూజిక్: వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫి: ప్రీతా జయరామన్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే.

click me!