
బిగ్ బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది. ఆమె పెళ్లి పేరుతో 9.83కోట్లు మోసం చేసినట్టు ఎన్‌ఆర్‌ఐ ధర్మేంద్ర ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ధర్మేంద్ర తెలిపిన వివరాలు ప్రకారం 2018లో అషు రెడ్డితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహం వరకు దారితీసింది. ఇరు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చలు జరపడమే కాకుండా, జాతకాలు కూడా చూయించుకున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆమెను పూర్తిగా నమ్మిన ధర్మేంద్ర నుండి వివిధ సందర్భాల్లో ఆమె భారీగా నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధర్మేంద్ర నుండి సుమారు రూ. 9.35 కోట్లకు పైగా అషు రెడ్డి వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఆమె తన వ్యక్తిగత అవసరాల కోసం, తన సోదరి పేరు మీద మరో యాభై లక్షలు తీసుకున్నట్లు అతను ఆరోపిస్తున్నాడు. తీసుకున్న డబ్బుతో ఆమె బంగారం, ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వివరాలు కూడా బయటకు వస్తుండటంతో కేసు తీవ్రత పెరుగుతోంది. పెళ్ళి చేసుకో, లేదంటే డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే, తనపై తప్పుడు కేసులు పెడతానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించినట్లు ధర్మేంద్ర ఆరోపించారు. ఈ కుట్రలో ఆమె ప్రస్తుత స్నేహితుడు జయంత్ పాత్ర కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
ధర్మేంద్ర ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు మోసం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తన వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని ఆమె పేర్కొన్నారు. కేవలం తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే పోలీసుల దృష్టికి వెళ్లినా, ఇప్పుడు వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. అషు రెడ్డి కెరీర్‌పై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది వేచి చూడాలి. హైకోర్టు విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఆషురెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆడియో లీక్ అయ్యింది. ధర్మేంద్రతో రాయబారానికి వచ్చింది ఆషు రెడ్డి. కోటిన్నర సెటిల్మెంట్ చేస్తానని చెబుతోంది. ఈ మేరకు ఆమె ధర్మేంద్రకి ఆడియోని పంపించింది. ఈ ఆడియో బయటకు వచ్చింది. ఇందులో ఆమె తనకు మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర సెటిల్ చేస్తానని చెప్పింది. దీనికోసం వేణు స్వామి, ప్రవీణ అక్క పెద్దమనుషులుగా వస్తారని, అందరం కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామని అషురెడ్డి ఇందులో చెప్పింది. ప్రస్తుతానికి మే నెలే తనకు టార్గెట్‌గా కనిపిస్తోందని, మిగిలిన డబ్బును ఆమె తన లైఫ్‌లో సెటిల్ అయ్యాకి తిరిగి ఇస్తానని చెబుతోంది. ఈ వివాదంలోకి తన తల్లిని, చెల్లిని లాగొద్దని, ఏదైనా తనతోనే మాట్లాడాలని చెప్పింది.
ఈ సెటిల్మెంట్‌కి సిద్ధమైతే ఓకే, లేదంటే రివర్స్ కేసు పెడతానని, తనని, తన చెల్లిని, అమ్మని ఇందులోకి లాగుతున్నావని, వారిని హెరాస్ చేస్తున్నావని రివర్స్ లో కేసు పెడతానని బెదిరింపులకు దిగింది. తన ముఖం చూడాలని తాను అనుకోవడం లేదని, ఈ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలని తాను అనుకోవడం లేదని తెలిపింది ఆషురెడ్డి. ఆమె పేరుతో లీక్ అయిన ఈ ఆడియోలో ఉన్నది ఆమె వాయిసేనా, ఇది ఒరిజినల్ వాయిసేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆడియో లీక్ కావడంతో బాధితుడు ధర్మేంద్ర రియాక్ట్ అయ్యాడు. తన నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు కేవలం ఒక కోటిన్నర రూపాయలతో సెటిల్ చేస్తాననడం మోసమని, డబ్బు అడిగితే రివర్స్ కేసు పెడతానని బెదిరించడం అన్యాయమని పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.