ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్‌గా పాపులర్. చాలా సందర్భాల్లో తమ స్నేహాన్ని చాటుకున్నారు ఆనంద్ సాయి. ఆయనకు లైఫ్ ఇచ్చిందే పవన్ అని చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కారణంగానే తనకు లవ్ దొరికిందట. పవన్ `తొలిప్రేమ` సినిమాకి, ఆనంద్ సాయి-వాసుకి లవ్‌కి లింక్ ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ రహస్యం బయటపడింది. `తొలిప్రేమ` చిత్ర నిర్మాత జీవీజీ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.
`తొలిప్రేమ` సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి కెరీర్ ప్రారంభమయ్యింది. పవన్ కళ్యాణ్ కారణంగా, నువ్వు చేయగలవనే సపోర్ట్ ఇవ్వడంతోనే ఆనంద్ సాయి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా చేశారు. ఇందులో ఆయన వేసిన తాజ్ మహల్ సెట్ ఆయనకు మంచి గుర్తింపు, పేరుని తీసుకొచ్చింది. అంతేకాదు తనకు ప్రేమని కూడా పరిచయం చేసిందట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆనంద్ సాయి, వాసుకి ప్రేమలో పడ్డారని తెలిపారు నిర్మాత జీవీజీ రాజు. `తొలి ప్రేమ` 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత ఈ విషయాన్ని వెల్లడించారు.
`తొలిప్రేమ` సినిమా సమయంలోనే యూనిట్‌లో రెండు జంటలు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. ఆనంద్ సాయి-వాసుకితోపాటు పవన్, కీర్తిరెడ్డి డూపులు కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సినిమాలో ఓ కార్ యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. అందులో డూప్ ఆర్టిస్టులున్న కారు లోయలో పడిపోయిందట. దీంతో వారికి గాయాలయ్యాయని, వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారట. అయితే ఆసుపత్రిలో పక్క పక్కనే వారి బెడ్లు ఉండటం, ఆ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, ఆ తర్వాత పెళ్లి కార్డ్ తో తన వద్దకు వచ్చారని తెలిపారు నిర్మాత జీవీజీ రాజు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఆనంద్ సాయిని పవన్ బలవంతం చేయకపోతే, ఆనంద్ సాయి ఈ సినిమా చేయకపోతే వాసుకి పరిచయం అయ్యేది కాదు, వారిద్దరు పెళ్లి చేసుకునేవాళ్లు కాదు. ఓ రకంగా వీరి ప్రేమ, పెళ్లికి పవన్ కళ్యాణే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అప్పట్నుంచి ఆనంద్ సాయి పవన్‌తోనే ఉంటున్నారు. ఆయన సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఇప్పటి వరకు `తొలిప్రేమ`తోపాటు `యమదొంగ`, `సైనికుడు`, `గుడుంబా శంకర్`, `నాని`, `బృందావనం`, `పులి`, `బాలు`, `ఎవడు` వంటి యాబైకి పైగా చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు `హరిహర వీరమల్లు` చిత్రాలకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు.
మరోవైపు దేవాలయాల నిర్మాణంలోనూ ఆయన మరింత పేరుతెచ్చుకున్నారు. `యాదాద్రి టెంపుల్`ని ఆయనే డిజైన్ చేశారు. ఇప్పుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌ని, భద్రకాళీ టెంపుల్‌ని ఆయన డిజైన్ చేయబోతున్నారు. మరోవైపు వాసుకి పెళ్లి తర్వాత సినిమాలు మానేశారు. ఇటీవల `అన్ని మంచి శకునములే` చిత్రంలో నటించింది. ఆనంద్ సాయికి సపోర్ట్ గా ఉంటున్నారామే.
ఇదిలా ఉంటే తాజాగా `తొలిప్రేమ` రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆనంద్ సాయి మాట్లాడుతూ, ఈ సినిమాతోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. కానీ నువ్వు చేయగలవని కళ్యాణ్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ రోజు కళ్యాణ్ గారు ఆ ఫ్లాట్ ఫామ్ ఇవ్వడం వల్లే, ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. కళ్యాణ్ గారు లేకపోతే నేను గానీ, కరుణాకరన్ గారు గానీ ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ముందుగా వేరే పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ని అనుకున్నప్పటికీ, నాకు ఈ అవకాశమిచ్చి కరుణాకరన్ గారు, జి.వి.జి.రాజు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తాజ్ మహల్ సెట్ వేయడం అంత తేలిక కాదు. నేను చేయగలనని నమ్మి అవకాశమిచ్చారు. ఈ సినిమా వల్లే నా కెరీర్ ఇంత బాగుంది. అలాగే వాసుకి కూడా నా జీవితంలోకి వచ్చింది. `తొలిప్రేమ` అనేది జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా` అని చెప్పారు.