
ఎపిసోడ్ ప్రారంభంలో నా ఇంట్లోనే నాకు అవమానం జరిగింది అని అపర్ణ అంటే ఇది నీ ఇల్లు ఎందుకు అయింది అంటుంది చిట్టి. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టారు కాబట్టి అంటుంది అపర్ణ. అలాగే నీ కొడుకు కూడా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. మరి నువ్వు ఎన్నిసార్లు ఆ అమ్మాయి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయలేదు అంటుంది చిట్టి. మీరందరూ ఏకమై నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేశారు.మళ్లీ ఇప్పుడు అందరూ ఏకమై నా కొడుకుని నాకు ఇష్టం లేని చోటుకి పంపించారు అంటుంది అపర్ణ. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మేము మా అభిప్రాయాలను మాత్రమే చెప్తున్నాము నిర్ణయాలు వాడే తీసుకుంటున్నాడు అంటాడు సీతారామయ్య. మీ మటుకు మీరు వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. నా కొడుకు నా మాట కూడా వినకుండా భార్యతో కలిసి వెళ్ళిపోతాడు ఇక నా మాటకి విలువ ఏముంది అంటుంది అపర్ణ.
రాజ్ కాపురం ఏమైపోతుందో అని మేమందరం కంగారు పడుతున్న సమయంలో మనసు మార్చుకుని భార్యని తీసుకొని పుట్టింటికి వెళ్ళాడు అందుకు మేము అందరం సంతోషిస్తుంటే మీరు అలగడం ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. మీరందరూ కలిసి నా కొడుకుని నా నుంచి దూరం చేశారు. ఇంకా నాకు ఇక్కడ ఏం మిగిలింది అంటూ వెళ్ళిపోతున్న అపర్ణని ఆపుతాడు సుభాష్. ఆవేశంతో ఒక్కసారి ఇంటి బయట కాళ్ళు పెడితే మళ్లీ ఇంటి లోపలికి అడుగుపెట్టే అవకాశం ఉండదు ఆలోచించుకో అంటాడు. వంశ గౌరవం అనే మాటకి కట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది అపర్ణ. మరోవైపు స్వప్నని వెతుకుతూ ఉంటాడు రాజ్. ఇంతలో ఎవరో కలుపుకొట్టడంతో స్వప్ననేమో అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసేసరికి చేపలతో ఒక వ్యక్తి ఉంటాడు.
బావగారు మీకోసమే చేపలు తెచ్చాను అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. చేపల వాసనకి అతని ప్రవర్తనకి ఇబ్బంది పడతాడు రాజ్. ఇదంతా చూస్తున్నా కావ్య నవ్వుకుంటుంది మీ బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. పొలుసు తీసిన పులస చేప లాగా సూపర్ గా ఉన్నారు అంటాడతను. అంతలోనే అక్కడికి వచ్చిన కనకం అల్లుడు గారిని పట్టుకుంటావా అంటూ మందలిస్తుంది. రాత్రి వచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ తీసుకొని వస్తాను ఇద్దరం కుమ్మేద్దాం అంటాడు వచ్చినతను. ఒక్కసారి తాగినందుకే నా జీవితం తలకిందులుగా వేలాడిన గబ్బిలం లాగా అయిపోయింది అనుకుంటాడు రాజ్.
కనకం లోపలికి వచ్చిన అతను బయటికి వెళ్లిపోయిన తరువాత మీకు తాగడం లేదని ఎందుకు అబద్ధం చెప్పారు అంటుంది కావ్య. విషాద సంఘటనని మళ్లీ ఎందుకు గుర్తు చేస్తావు అంటాడు రాజ్. మళ్లీ అంతలోనే స్వప్న విషయం గుర్తొచ్చి ఇంట్లో లేదు పైన ఉందేమో అనుకొని బయటికి వెళ్తాడు రాజ్. మరోవైపు ఫ్రెండ్ ఇంటికి వచ్చిన స్వప్నని చూసి షాక్ అవుతుంది ఆ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళిపోయావు నీ గురించి అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అంటూ ఏవేవో మాట్లాడుతుంది ఆ ఫ్రెండ్. ఆకలేస్తుంది అంటుంది స్వప్న. అయ్యో ఉండు ఐదు నిమిషాల్లో భోజనం రెడీ చేస్తాను అంటుంది ఆ ఫ్రెండ్.
మరోవైపు స్వప్న కనబడక పోవడంతో అసహనానికి గురవుతాడు రాజ్. నిన్ను ఒక కలలాగా వదిలేద్దాము అనుకున్నాను కానీ మీ చెల్లెలు నిన్ను ఎంత మోసం చేసిందో నన్ను ఎంత మోసం చేసిందో తెలుసుకోవటానికి ఇంత దాకా దిగి వచ్చాను అనుకుంటాడు. కిందికి వచ్చిన భర్తతో మనుషుల మీద నమ్మకం లేక కనుమరుగైపోయిన మా అక్కని వెతుకుతున్నారు దొరికిందా అని అడుగుతుంది కావ్య. మాటలకి షాకైన రాజ్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. మీకు మా అక్క దొరకలేదు కానీ నేను అడగకుండానే నన్ను నా పుట్టింటికి ఎందుకు తీసుకువచ్చారో అనే నా ప్రశ్నకి సమాధానం దొరికింది అంటుంది కావ్య.
నువ్వు చెప్పింది నిజమే నేను అత్తారింట్లో మర్యాదల కోసం రాలేదు. స్వప్నని ఎక్కడ దాచావనే నమ్మకంతోనే వచ్చాను అంటాడు రాజ్. మా అక్క ఇక్కడ లేదు అంటుంది కావ్య. నువ్వు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటావు ఇంకెక్కడ కనబడుతుంది అంటాడు రాజ్. ఏం చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు అంటుంది కావ్య. నా నమ్మకం నిజమో నీ అబద్దం నిజమో తొందరలోనే తేలుతుంది అయినా ఇంకా నాకు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు బయలుదేరుతాను అంటాడు రాజ్. అమ్మ వాళ్ళు నీకోసం కష్టపడి భోజనం తయారు తయారు చేస్తున్నారు.
ఇలా మధ్యలోనే వెళ్లిపోతే బాధపడతారు భోజనం చేశాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అంటుంది కావ్య. ఉండను అంటూ భీష్ముంచుకున్న భర్తని కనీసం వాళ్ళ ముందు మనం బాగున్నట్టు నటించండి అంటుంది కావ్య. నటించడం నీ రక్తంలో ఉంది నా రక్తంలో కాదు అంటూ వెళ్లిపోవటానికి తలుపు తీసేసరికి ఎదురుగా మీనాక్షి మరి కొంతమంది ఆడవాళ్ళతో కలిసి వస్తుంది. మీరు వచ్చారని మీ అమ్మ చెప్తే నేను నమ్మలేదు మీది ఎంత గొప్ప మనసు అంటూ రాజ్ ని మెచ్చుకుంటుంది మీనాక్షి. ఇంతలో కనకం వచ్చి అల్లుడుగారు వచ్చారు.
శబరి పర్ణశాలకు వచ్చిన రాముడు లాగా అల్లుడుగారు మన ఇంటికి వచ్చారు అంటుంది. మర్యాదలు బాగా చేస్తున్నావా అంటూ రాజ్ దగ్గరికి వెళ్లి నీకు ఏమేం కావాలో చెప్పండి అంటూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది మీనాక్షి.తరువాయి భాగంలో నాన్న బట్టలు తెచ్చారు ఆయన సంతృప్తి కోసం మీరు తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. ఆ బట్టల్ని తీసుకోకుండా విసిరేస్తాడు రాజ్. మరోవైపు కూతురిని అత్తారింట్లో సంతోషంగానే ఉన్నావా అని అడుగుతాడు కృష్ణమూర్తి.