తప్పే, ఇక అలాంటి పనులు చేయను: యాంకర్ శ్యామల
బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు వైకాపా ప్రతినిధి శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. భవిష్యత్తులో బెట్టింగ్‌లను ప్రోత్సహించనని, చట్టానికి కట్టుబడి ఉంటానని శ్యామల తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు వైకాపా ప్రతినిధి శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. భవిష్యత్తులో బెట్టింగ్‌లను ప్రోత్సహించనని, చట్టానికి కట్టుబడి ఉంటానని శ్యామల తెలిపారు.
నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకుగానూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు.
తాజాగా ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీస్ స్టేషన్ లో శ్యామలను పోలీసులు దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించారు.
విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ... బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యతగల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు.
బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు.
తాను చట్టాన్ని గౌరవిస్తానని... విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున... మాట్లాడటం సరికాదని చెప్పారు.
ఇక తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసుల ఎదుట హాజరుకావాలని సూచించింది.
నోటీసు ఇచ్చి దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. బెట్టింగ్ యాప్ కేసులో తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని శ్యామల పిటిషన్ వేయగా.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.