Sudigali Sudheer
యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇద్దరూ బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలెబ్రిటీలు. అనేక టివి కార్యక్రమాల్లో వీరిద్దరూ యాంకర్లుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి హీరోగా రాణించే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కొనసాగుతున్నాడు. ఇటీవల సుధీర్, యాంకర్ రవి కలసి చేసిన ఒక టీవీ షో తీవ్ర వివాదానికి కారణం అయింది. ఈ టీవీ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా హాజరయ్యారు. దీనితో సుధీర్, రవి ఇద్దరూ బావగారు బాగున్నారా చిత్రంలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు.
సాధారణంగా హిందువులు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు. బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది. స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే.. నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అని చిరంజీవి చెప్పే డైలాగ్ బావగారు బాగున్నారా చిత్రంలో ఉంది.
ఇదే సన్నివేశాన్ని సుడిగాలి సుధీర్, యాంకర్ రవి రీ క్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభని చూస్తాడు. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్ళని అనుమానించేలా సుధీర్, యాంకర్ రవి ప్రవర్తించారు అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, యాంకర్ రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
rambha
ఈ క్రమంలో రోజు రోజుకి ఈ వివాదం ముదురుతోంది. తాజాగా రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి ఫోన్ చేశారు. ఆ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టివి షోలో ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని ఆయన యాంకర్ రవిని ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుడిని చూడాల్సింది పోయి అమ్మాయి కనిపిస్తోంది అని ఎలా అంటారు అని నిలదీశారు. యాంకర్ రవి సమాధానం ఇస్తూ అది చిరంజీవి గారు నటించిన సన్నివేశం అని అన్నారు. వాళ్ళు తప్పుచేస్తే మీరు కూడా తప్పు చేస్తారా అని రవిని తిరిగి ప్రశ్నించారు.
చిరంజీవి గారికి మీరు అప్పుడు తప్పు అని చెప్పి ఉంటే అది నిజంగా తప్పని మాకు తెలిసేది. చిరంజీవి గారే చేశారు కదా అని మేము కూడా చేశాం. ఆయన అభిమానులం మేము. అయినా అందులో తప్పేముంది. గుడికి అమ్మాయిలు కూడా వెళతారు. సుధీర్ దేవుడినే చూడాలని అనుకుంటాడు. మధ్యలో అమ్మాయి వచ్చింది. అందులో ఎవరు ఎవరిని కించపరిచినట్లు అనిపించింది అని రవి ప్రశ్నించారు.
ఆ సన్నివేశం చేసేటప్పుడు షూ కూడా విప్పేసి నటించాము. అక్కడ ఎవరినీ కించపరచలేదు. మీకు ఈ విషయంలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే జీ తెలుగు స్టూడియోకి వెళ్లి అడగండి అని రవి సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పను అని రవి పేర్కొన్నాడు. దీనితో కేశవ రెడ్డి అనే వ్యక్తి అయితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు.