సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సంచలన పరిణామాలకు దారి తీస్తుంది. మహిళ మృతి పై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ సరైన అనుమతులు లేకుండా సంధ్య థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్లడం వలనే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది. మరో అరెస్ట్ చోటు చేసుకుంది. అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరైన బౌన్సర్ ఆంటోని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్లో బౌన్సర్లు అల్లు అర్జున్ అభిమానుల మీద దాడి కూడా చేశారని సమాచారం.
కాగా నేడు తెలంగాణ పోలీసులు మరోసారి అల్లు అర్జున్ ని విచారణకు పిలిచారు. BNS 35(3) సెక్షన్ క్రింద నోటీసులు జారీ చేశారు. నేడు 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. చిక్కడపల్లి సీఐ, ఏసీపీ అల్లు అర్జున్ ని విచారించారు.
సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా సాగిన విచారణలో 20కి పైగా ప్రశ్నలు అల్లు అర్జున్ ని అడిగారట. అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు మౌనం వహించారట. అల్లు అర్జున్ తో పాటు లాయర్ అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన సమక్షంలో విచారించారు. కాగా ఈ కేసులు మొత్తం 18 మందిని ముద్దాయిలుగా చేర్చారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు.
Allu Arjun
వివాదం ఇలా మొదలైంది... డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు హీరోయిన్ రష్మికతో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు సంధ్య థియేటర్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
allu arjun
ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు.
Allu Arjun
ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు.