Pushpa: బన్నీ పాన్‌ ఇండియా ఆశలపై నీళ్లు ‌.. బిగ్‌ మార్కెట్‌ని లైట్‌ తీసుకున్న `పుష్ప` నిర్మాతలు?

First Published | Dec 14, 2021, 6:27 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న `పుష్ప` చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. కానీ ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం వీక్‌ గా సాగుతున్నాయి. ఏకంగా ఓ పెద్ద మార్కెట్‌ని `పుష్ప` నిర్మాతలు లైట్‌ తీసుకున్నట్టు కనిపిస్తుంది. 
 

అల్లు అర్జున్‌(Allu Arjun) `అలవైకుంఠపురములో` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఊహించని విధంగా రెండువందల కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. బన్నీకి అటు హిందీలోనూ మార్కెట్‌
ఏర్పడటానికి కారణమైంది. సౌత్‌లో మార్కెట్‌ పెరిగింది. దీనికి తోడు తెలుగు సినిమాల మార్కెట్‌ పెరిగింది. హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో టాలీవుడ్‌ సినిమాలకు ఆదరణ పెరిగింది. పాన్‌
ఇండియా చిత్రాలు తెలుగులో రూపొందుతున్న నేపథ్యంలో అందరి చూపు టాలీవుడ్‌ పైనే పడింది. 

దీంతో తాను పాన్‌ ఇండియా స్టార్‌గా రాణించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు ఐకాన్‌ స్టార్‌ Allu Arjun. అందులో భాగంగా తాను నటిస్తున్న `పుష్ప`(Pushpa)ని పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నట్టు ప్రారంభం నుంచే ప్రకటించారు. అంతేకాదు సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.  మొదటి భాగం `పుష్పః ది రైజ్‌` ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని `తగ్గేదెలే` అనే డైలాగ్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీనికి తోడు `దాక్కో దాక్కో మేక.. `, `శ్రీవల్లి`, `నా స్వామి..` పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మోస్ట్ వ్యూవర్స్ సాధించిన పాటలుగా నిలిచాయి. వీటన్నింటికి మించి ఇటీవల రిలీజ్‌ అయిన సమంత స్పెషల్‌ సాంగ్‌ `ఉ అంటవా.. ఉఉ అంటావా` పాట అంచనాలను పీక్‌లోకి తీసుకెళ్లింది.


అయితే ఇదంతా టాలీవుడ్‌తోపాటు సౌత్‌ మార్కెట్‌ వరకే పరిమితం అని చెప్పొచ్చు. బాలీవుడ్‌లో ఆ ఊపు తక్కువ. హిందీలో బన్నీకి ఆశించిన స్థాయిలో `పుష్ప`గాలి వీయడం లేదు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ గా రాణించాలనుకున్నప్పుడు ఆయన ప్రధానంగా ఫోకస్‌ చేయాల్సింది బాలీవుడ్‌ మార్కెట్‌పై. అంతేకాదు ఆ ప్రమోషన్స్ కూడా దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. పాన్‌ ఇండియాగా వస్తోన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం విడుదలకు ఇంకా ఇరవై రోజులకుపైనే ఉంది. కానీ అప్పుడే హిందీతోపాటు సౌత్‌ మొత్తం ఓ రౌండ్‌ చూట్టేశారు. ట్రైలర్‌తో అంచనాలను భారీగా పెంచేశారు. హిందీలో ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ని కలిశాడు. అమెరికన్‌ యూట్యూబర్‌ని రంగంలోకి దించుతున్నారు. వీటితోపాటు బాలీవుడ్‌ స్టార్స్ అజయ్‌ డేవగన్‌, అలియాభట్‌ అందులో ఉన్నారు. ఇవన్నీ బాలీవుడ్‌ మార్కెట్‌కి కలిసొచ్చే అంశాలు.. 

కానీ మరో మూడు రోజుల రాబోతున్న `పుష్ప` విషయంలో అది జరగ లేదు. గత వారం నుంచే ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు. అందులోనూ కేవలం బన్నీ ఒక్కడే సోలో ప్రమోషన్‌లో చేస్తున్నాడు. ఆయనలో కూడా ఉత్సాహం కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. దీనికి తోడు నిర్మాతల ప్లానింగ్‌ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పాన్‌ ఇండియా సినిమా స్థాయిలో ప్రమోషన్స్ ఎక్కడా కనిపించడం లేదు. పాన్‌ ఇండియా సినిమాలకు బాలీవుడ్‌ పెద్ద మార్కెట్‌. కానీ ఆ విషయంలోనే `పుష్ప` నిర్మాతలు వెనకబడ్డారు. బన్నీ పాన్‌ ఇండియా ఆశలపై నీళ్లు చల్లినంత పనిచేస్తున్నారు. మరోవైపు ఇందులో బాలీవుడ్‌కి చెందిన స్టార్స్ ఎవరూ లేదు. బన్నీ, రష్మిక మందన్నా ఫేసులు తప్ప మిగిలిన ఫేసులు ఇతర భాషలకు తెలియదు. ఫహద్‌ ఫాజిల్‌ మలయాళానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

మైత్రీమూవీ మేకర్స్ కారణంగానే ఇలా జరుగుతుందని, అదే అల్లు అరవింద్‌ నిర్మాత అయి ఉంటే ఇప్పటికే హిందీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగేవని, `పుష్ప` బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అల్లు అరవింద్‌కి అమీర్‌ఖాన్‌తో పరిచయం ఉంది. పైగా ఇప్పుడు షాహిద్‌ కపూర్‌తో `జెర్సీ` రీమేక్‌ చేస్తున్నారు. దీనికితోడు బాలీవుడ్‌లో గట్టిపరిచయాలున్నాయి. ఆయనే నిర్మాత అయితే `పుష్ప` ఈవెంట్‌ కోసం బాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్ ని దించేవారని, కానీ ప్రస్తుత నిర్మాతలకు ఆ హిందీ మార్కెట్‌ లెక్కలు తెలియకపోవడం వల్లే అక్కడ `పుష్ప` దూసుకెళ్లడంలో వెనకబడిపోయిందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. 

ఇది ఓఎత్తైతే, `పుష్ప`కి బాలీవుడ్‌లో మరో ఎదురు దెబ్బ పడబోతుంది. హాలీవుడ్‌ యాక్షన్‌ ఫిల్మ్ `స్పైడర్‌ మ్యాన్‌` కరెక్ట్ గా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. హిందీలోనూ అది రిలీజ్‌ కానుంది. హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలకు బాలీవుడ్‌లో పెద్ద మార్కెట్‌ ఉంది. వాటిని ఎగబడి చూస్తారు. పైగా `స్పైడర్‌మ్యాన్‌`కి అంతర్జాతీయంగా మంచి ఇమేజ్‌, క్రేజ్‌ ఉంది. బాలీవుడ్‌ కూడా అందుకు అతీతం కాదు. దానితో పోల్చితే `పుష్ప` వెనకబడిపోతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్‌ ప్రమోషన్‌ వీక్‌ ఓ దెబ్బ అయితే, `స్పైడర్‌ మ్యాన్‌` రూపంలో `పుష్ప`కి మరో దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు క్రిటిక్స్.

ప్రమోషన్‌ విషయంలో ఇటీవల వచ్చిన బాలయ్య `అఖండ`నే బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి యూనిట్‌ క్రమక్రమంగా అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ట్రైలర్‌తో ఆకట్టుకున్న టీమ్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని గెస్ట్ గా దించి అంచనాలను మరింతగా పెంచింది. పైగా బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ తోడయ్యింది. దీనికితోడు ఈవెంట్‌లో `జై బాలయ్య` సాంగ్‌ని విడుదల చేసి హైప్‌ పెంచేశారు. ఇదే కాదని, మరో సర్‌ప్రైజ్‌ టీజర్‌ని రిలీజ్‌ చేసి అంచనాలను అమాంతం పెంచింది. దీంతో `అఖండ` చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లని హౌజ్‌ఫుల్‌ చేసిన చిత్రంగా నిలిచింది `అఖండ`. ప్రస్తుతం ఇది వంద కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతుంది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

అయితే ఇలా సినిమాపై చివరి నిమిషంలో అంచనాలను పెంచడం, హైప్‌ని తీసుకురావడంలో `పుష్ప` టీమ్ విఫలమయ్యిందనే చెప్పాలి. పైగా ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పూర్తి కాలేదని తెలుస్తుంది. ప్రమోషన్‌లో దర్శకుడు సుకుమార్‌ ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాదు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాజమౌళి, అల్లు అర్జున్‌ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ఇంకా సినిమాపై వర్క్ జరుగుతూనే ఉందని, ఇంకా పూర్తి కాలేదని, ఫైనల్‌ కాపీ రెడీ చేసేందుకు ఇంకా స్టూడియోల్లో కుస్తీ పడుతున్నారని తెలుస్తుంది. ఇవన్నీ `పుష్ప` సినిమాకి సంబంధించిన ప్రతికూల అంశాలుగా మారాయి. మరి ఇన్ని ప్రతికూల అంశాలను అదిగమించి `పుష్ప` బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తుందా? బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెడుతుందా? అన్నది చూడాలి.

Latest Videos

click me!